Politics

ఆమెకు నో ఎంట్రీ

ఆమెకు నో ఎంట్రీ

తాను తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు శశికళ చెప్పడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శశికళను తిరిగి తమ పార్టీలోకి తీసుకునేది లేదని ఏఐఏడీఎంకే డిప్యూటి కోఆర్డినేటర్‌ కేపీ మునుసామి వెల్లడించారు. పార్టీపై తిరిగి పట్టు సాధించాలనే యోచనతో కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోమవారం వెప్పనహళ్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలతో శశికళ ఆదివారం ఫోన్‌లో సంభాషించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఏఐఏడీఎంకే ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించింది. పనీర్‌సెల్వం, పళనిస్వామి పేర్లు చెప్పకుండా.. ఆ ఇద్దరు ముఖ్య నేతల మధ్య అంతర్యుద్ధం గురించి కార్యకర్తలతో శశికళ మాట్లాడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని వారు ఆమెను కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తమ పార్టీ కార్యకర్తలతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె చాలా రోజుల నుంచి పార్టీలో లేదని మునుసామి తెలిపారు. శశికళను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ఆమె వర్గీయులు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలో నమ్మకంగా పనిచేస్తున్న కొందరితో శశికళ మాట్లాడిన విషయంపై ఓ విలేకరి ప్రశ్నించగా.. తమ పార్టీ నుంచి ఎవరూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడలేదని సమాధానమిచ్చారు. తమలాంటి వారంతా కష్టపడి పార్టీని నిర్మించినట్లు శశికళ చెప్పిందనే మాటలను మునుసామి తోసిపుచ్చారు. ఎంజీ రామచంద్రన్‌ ఏఐఏడీఎంకేను స్థాపించినప్పటి నుంచి వెలకట్టలేని సేవ చేసిన కార్యకర్తలే పార్టీకి బలమని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు ముఖ్య నేతల మధ్య విభేదాల గురించి ప్రశ్నించగా.. అవన్నీ అవాస్తవాలంటూ తోసిపుచ్చారు. నియోజకవర్గాల సమస్యలపై వారికి సొంత అబిప్రాయాలు ఉండడం సహజమేనన్నారు. కానీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి వారిద్దరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు తెలిపారు. అవకాశవాదులు అవాస్తవాలను ప్రచారం చేస్తూ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యూహాలకు స్వస్తి పలకాలని ఆమెను హెచ్చరించారు. 2016 డిసెంబరులో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం శశికళ తాత్కాలికంగా పార్టీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2017లో అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీ అధ్యక్షురాలి స్థానాన్ని కోల్పోయారు. ఆ తర్వాత నిర్వహించిన పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో.. ఆమె అల్లుడు దినకరన్‌ చేసిన నియామకాలన్నీ చెల్లవంటూ తీర్మానించారు. పనీర్‌సెల్వం, పళనిస్వామిలకు పార్టీలో పూర్తి అధికారాలు కట్టబెడుతూ అదే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి శశికళ, ఆమె బంధువులను పార్టీలోకి తిరిగి తీసుకునేది లేదని ఏఐఏడీఎంకే నిర్ణయించింది.