Business

ఇవాళ కార్ కొనండి. కిస్తీ 3నెలల తర్వాత కట్టండి-వాణిజ్యం

ఇవాళ కార్ కొనండి. కిస్తీ 3నెలల తర్వాత కట్టండి-వాణిజ్యం

* కొవిడ్‌ వ్యాప్తి కారణంగా విక్రయాలపై పడిన ప్రభావాన్ని తగ్గించుకొనేందుకు ఆటోమొబైల్‌ సంస్థలు పలు స్కీమ్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా మహీంద్రా సంస్థ కూడా కొత్త పథాకాలను అమల్లోకి తెచ్చింది. కొనుగోలు దారులకు ఆర్థిక వెసులుబాటు లభించేలా దీనిని సిద్ధం చేసింది. మనకు నచ్చిన మహీంద్రా వాహనాన్ని ఇప్పుడు కొనుగోలు చేసి.. మూడు నెలల తర్వాత దాని ఈఎంఐను చెల్లించే అవకాశం కల్పించింది. నిత్యావసర సేవలు అందించే కస్టమర్లు వాణిజ్య వాహనాల కొనుగోలుకు కూడా ఇది వర్తిస్తుంది. దీంతోపాటు మహీంద్రా వినియోగదారులకు కాంటాక్ట్‌ లెస్‌ సేవలు అందించేదుకు ఉన్న ‘ఓన్‌ ఆన్‌లైన్‌’ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తోంది. దీనిలో ఆన్‌లైన్‌ రుణాలు సమకూరుస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌ పై నుంచి వాహనాలు కొనుగోలు చేసిన వారికి రూ.3,000 విలువైన యాక్సెసరీలు, రుణ మంజూరులో రూ.2,000 లబ్ధి చేకూరుస్తోంది. కస్టమర్లు యాక్సెసిరీస్‌ ఖర్చు, ఎక్స్‌టెండ్‌ వారెంటీ చెల్లింపులు, వర్క్‌షాప్‌ చెల్లింపులను కూడా ఈఎంఐలుగా మార్చుకొనే సౌకర్యం కల్పించింది. వీరికి రూ.3,000 వరకు క్యాష్‌ బ్యాక్ కూడా ఆఫర్‌ చేస్తోంది.

* దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆటో, మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను సూచీలు పూడ్చుకోగలిగాయి.

* పేటీఎం పబ్లిక్‌ ఇష్యూకు వస్తుండటంతో, ఈ కంపెనీ షేరుకు మదుపర్ల నుంచి గిరాకీ అమితంగా పెరిగింది. అనధికారిక మార్కెట్‌లో (గ్రే మార్కెట్‌) గత నాలుగు రోజులుగా షేరు ధర రూ.9,500 వరకు పెరిగి రూ.21,000కు చేరినట్లు తెలుస్తోంది. ఇంత అధిక ధర ఉన్నా షేరును కొనేందుకే మదుపర్లు ఇప్పటికీ మొగ్గు చూపుతున్నారని.. ఎవరూ విక్రయించడం లేదని సమాచారం. ‘గతవారం మేం పేటీఎం షేర్లను మదుపర్లకు రూ.11,000 నుంచి రూ.12,000 మధ్య విక్రయించాం. మేం చివరి సారిగా రెండు రోజుల క్రితం ఈ షేర్లలో ట్రేడ్‌ చేశాం. అప్పుడు ధర రూ.21,000గా ఉంది. ఇప్పుడు కొందామంటే షేర్లు లేవ’ని మిత్తల్‌ పోర్ట్‌ఫోలియోస్‌ డైరెక్టర్‌ మనీష్‌ మిత్తల్‌ తెలిపారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్‌ 309 పాయింట్లు నష్టపోయి 51,625 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 15,504 వద్ద ట్రేడవుతున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌, సుమోటోమో కెమికల్స్‌, హిల్‌, మాగ్మా ఫిన్‌ కార్ప్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. నారాయణ హృదయాలయా, టీసీఐ లిమిటెడ్‌, ఇండోస్టార్‌ క్యాపిటల్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అత్యధికంగా విద్యుత్తు రంగం సూచీ 0.40శాతం లాభాల్లో ఉండగా.. బీఎఎస్‌ఈ ఎఫ్‌ఎంసీ సూచీ అత్యధికంగా 0.51శాతం నష్టాల్లో ఉంది.

* కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్న వారి సంఖ్య కొన్ని రెట్లు పెరిగింది. అయితే.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లతో పాటు, బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణం ఇచ్చే సంస్థలకూ ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. బంగారాన్ని కుదవపెట్టి, అప్పు తీసుకుంటున్న వారిలో బాకీలు తీర్చని కేసులు పెరుగుతున్నాయి. మణప్పురం ఫైనాన్స్‌ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా టన్ను బంగారాన్ని వేలం వేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విలువ దాదాపు రూ.404 కోట్లు. సాధారణంగా బ్యాంకుల్లో బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి ఏడాది కాలావధికి రుణాలు తీసుకుంటారు. గతేడాది లాక్‌డౌన్‌లు ముగిశాక, ఆర్థిక అవసరాల కోసం మూడో త్రైమాసికంలో పసిడి తనఖా రుణాలను ఎక్కువగా తీసుకున్నారని సమాచారం. అంటే వచ్చే సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంకులు సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది.