Politics

షర్మిల పార్టీ YSRTPకి ఈసీ ఆమోదం-తాజావార్తలు

షర్మిల పార్టీ YSRTPకి ఈసీ  ఆమోదం-తాజావార్తలు

* తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. పార్టీ పేరును వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ)గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. వైఎస్సార్ టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

* రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం కింద చేసిన శంకుస్థాపనలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ మళ్లీ చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

* మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రేపు టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. శుక్రవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. అనంతరం మీడియాతో సమావేశం కానున్నారు. కాగా, ఎమ్మెల్యే ఈటల బీజేపీలో చేరుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించటం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కావటం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఈటెల మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సమావేశమై ఎల్లుండి ఢిల్లీ వెళ్లి కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

* టీఎస్ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రోసారి పొడిగించారు. ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని ఎంసెట్ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు. విద్యార్థుల విజ్ఞ‌ప్తి మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించారు.

* ఈ ఏడాది నైరుతి రుతుప‌వ‌నాలు వ‌చ్చేశాయి. గురువారం ఉద‌యం రుతుప‌వ‌నాలు కేర‌ళలో ప్ర‌వేశించిన‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. జూన్ 1నే ఇవి రావాల్సి ఉండ‌గా.. ఈసారి రెండు రోజులు ఆల‌స్యంగా వ‌చ్చిన‌ట్లు ఐఎండీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎం మోహ‌పాత్ర చెప్పారు. రుత‌ప‌వ‌నాల రాక‌తో కేర‌ళ‌లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

* రాష్ట్రంలో త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని, ఇది ప్రభుత్వ విధానమని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి తీరుతామన్నారు. న్యాయస్థానంలో ఉన్న కేసులు సత్వరం పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే సీఎం పనిచేయవచ్చన్న మంత్రి… న్యాయస్థానంలో కేసులకు, సీఎం పనిచేయడానికి సంబంధం లేదన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

* బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్ష‌న్ల బ్లాక్ మార్కెట్‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ప్ర‌శ్నించింది. రాష్ట్రంలో క‌రోనా కేసులు, చికిత్స‌, ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై హైకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రిగింది. బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్ష‌న్ల కొర‌త‌, అధిక ధ‌ర‌ల‌కు అమ్మ‌కాలు జ‌రుగుతుంటే ఏం చేస్తున్నారని నిల‌దీసింది. బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకునేందుకు ఇప్ప‌టికే ఫ్ల‌యింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌భుత్వం ధ‌ర్మాసనానికి వివ‌రించింది. కేంద్రం నుంచి స‌రిప‌డా ఇంజెక్ష‌న్లు రావ‌డం లేద‌ని.. 1400 మంది బ్లాక్ ఫంగ‌స్ రోగులు ఉంటే 13 వేల ఇంజ‌క్ష‌న్లే వ‌చ్చాయ‌ని తెలిపింది.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఉదారతను చాటుకున్నారు. తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల భద్రతకు పెద్దపీట వేశారు. కరోనా మహమ్మారికి బలైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోనున్నారు. చనిపోయిన ఉద్యోగుల పిల్లల విద్యకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఆ ఉద్యోగి చివరిసారి తీసుకున్న జీతాన్ని ఐదేళ్ల పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నీతా అంబానీతో కలిసి ఆయన ఉద్యోగులకు లేఖ రాశారు. కొవిడ్‌-19 గతంలో మనమెప్పుడూ చవిచూడని బాధాకరమైన అనుభవాలను పంచింది. మన సహచరులు, వారి కుటుంబ సభ్యుల మరణాలు కలచివేస్తున్నాయి. ఆ విషాదాల నుంచి కోలుకొనేందుకు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నామని రిలయన్స్‌ పేర్కొంది.

* టెట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్‌ సర్టిఫికేట్‌ ఏడేళ్ల గడువును ఎత్తివేస్తూ.. జీవిత కాలం చెల్లుబాటు అయ్యేలా సవరణలు చేసింది. దీనికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సూచించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవారికి టెట్‌ను తప్పనిసరి చేస్తూ గతంలో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశానుసారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్‌ను నిర్వహిస్తున్నాయి. ఒకసారి టెట్‌లో పాసైతే దాని వ్యాలిడిటీ ఏడేళ్లపాటు ఉంటుంది. ఈ లోపల ఉద్యోగం సాధిస్తే సరేసరి, లేదంటే మళ్లీ అర్హత సాధించాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం ఒకసారి టెట్‌ పాసైతే, ఉద్యోగం సంపాదించే వరకు దానిని ఉపయోగించుకోవచ్చు.

* సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. నీతిఆయోగ్‌ విడుదల చేసిన తాజా నివేదికలో కేరళ తొలి స్థానంలో కొనసాగగా.. బిహార్‌ చివరి స్థానంలో ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 2వ స్థానంలో నిలిచాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్‌ తొలిస్థానంలో నిలిచింది. భారత్‌లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆయా ప్రభుత్వాల పనితీరును పర్యవేక్షిస్తోన్న నీతిఆయోగ్‌, ప్రతిఏటా నివేదిక ఇస్తుంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకొని నీతిఆయోగ్‌ ఈ ర్యాంకులను కేటాయిస్తుంది.