Business

ట్విట్టర్‌కు ఇండియా అల్టిమేటం-వాణిజ్యం

Business News - Indian Govt. Issues Final Notice To Twitter

* మైక్రో బ్లాకింగ్‌ సైట్‌ ట్విటర్‌కు కేంద్రం మరో అల్టిమేటం జారీచేసింది. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ల నియామకంలో కొత్త ఐటీ నిబంధనలను పాటించాలని మరోసారి గట్టిగా ఆదేశించింది. ఇదే అవకాశమని, లేదంటే తదనంతర పరిణామాలను సిద్ధంగా ఉండాలని కేంద్రం శనివారం హెచ్చరించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్‌ ఖాతాకు బ్లూటిక్‌ తొలగింపు వివాదం తరువాత తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో కేంద్రం, ట్విటర్‌ వార్‌ మరింత ముదురుతోంది.

* అతి తక్కువ కాలంలోనే ఇండియా కార్ల మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన కియా సంస్థ నుంచి మరో కొత్త కారు మార్కెట్లోకి రాబోతుంది. ముఖ్యంగా ఫ్యూచర్‌ కార్లుగా చెప్పుకుంటున్న ఎలక్ట్రిక్‌ కారును తెచ్చేందుకు కియా సన్నాహాలు చేస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు కియా తన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) మోడల్‌ సోల్‌ లేబుల్‌ని ఇండియాలో రిజిస్ట్రర్‌ చేసింది.

* మే నెలలో కేంద్రానికి జీఎస్టీ రాబడి స్వల్పంగా తగ్గింది. జీఎస్టీ వసూళ్లు వరుసగా ఎనిమిదో నెల కూడా రూ.లక్ష కోట్ల మార్కును దాటినప్పటికీ గత వసూళ్లతో పోలిస్తే తగ్గుదల నమోదైంది. మే నెలకు గాను మొత్తంగా రూ.1,02,709 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది మే నెలతో పోలిస్తే రాబడిలో 65% వృద్ధి కనిపించినట్టు తెలిపింది. దీంట్లో వస్తువుల దిగుమతి నుంచి 56శాతం వసూళ్లు అధికంగా రాగా.. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం (సేవల దిగుమతి సహా) 69 శాతం గతేడాది కన్నా అధికంగా రాబడి ఉన్నట్టు పేర్కొంది.