ScienceAndTech

మీ ఫోన్ సంభాషణ సాక్ష్యంగా పనిచేస్తుందా?

మీ ఫోన్ సంభాషణ సాక్ష్యంగా పనిచేస్తుందా?

ఇది డిజిటల్‌ యుగం.సెల్ ఫోన్ లులేని ఇల్లంటూ లేదంటే అది అతిశయోక్తే. ఇంట్లో అపుడే పుట్టిన పాపాయి వద్దనుండి కాటికి కాల్లు చాపుకున్న వృద్ధులకు చరవాణులకు బానిసలే.అందరికి దగ్గరా అత్యంత సాంకేతికతో కూడిన చరవాణులే. ప్రతి చరవాణిలో కూడా ఎందుకైనా మంచిదని అందరూ కాల్ రికార్డింగ్ యాప్ ను పెట్టుకోవడం జరుగుతోంది.

అలా కాల్ రికార్డర్ లేదా వాయిస్ రికార్డ్ రు, సెల్ఫోన్, కంప్యూటర్,కెమెరాల వంటి పరికరాల ద్వారా మాటలు లేదా దృశ్యాల రికార్డు చేయడం, అవసరమున్నప్పుడు వినడం చూడడం లేదా బ్లాక్ మెయిల్ చేయడం, దృశ్యమాధ్యమాలకు (ఛానెళ్ళ ) ఇవ్వడం చేస్తున్నారు.

కొన్ని సందర్భాలలో రక్షకభట నిలయాలలో ఇలాంటి దృశ్యశ్రవణ నమోదులను ( రికార్డింగులు) సాక్ష్యంగా చూపి కేసులు పెట్టడం జరుగుతోంది. కేసుల నమోదు తరువాత వాటిని సాక్ష్యంగా న్యాయస్థానాలలో ప్రవేశపెట్టడం జరుగుతోంది.

ఇలా ఎలెక్ట్రానిక్ డిజిటల్ పరికరాల ద్వారా నమోదుకాబడినవాటిని కోర్టులు ఏవిడెన్స్ (సాక్ష్యం ) గా పరిగణిస్తాయా? అలా పరిగణిస్తే వ్యక్తిగతగోప్యం,భద్రత, ప్రాథమికహక్కులకు భంగం కాదా!

మనం ఏదో సరదాకో, మాటకో వరుసకో, యాదృచ్ఛికంగానో, కోపంగానో, తెలిసో తెలియకో మాట్లాడిన మాటలను మనకు తెలియకుండా ఎలెక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా రికార్డ్ చేయడం నిజంగా వ్యక్తిగతగోప్యత (పర్సనల్ ప్రవైసీ) కిందకే వస్తుంది. దీనికి రాజ్యాంగరక్షణ కూడా వుంది.

అలాగని ఒక వ్యక్తిచేసిన నేరపూరితమైన దృశ్యాలను (విజువల్స్) మాటలను ఎలెక్ట్రానిక్ ఉపకరణాల ద్వారా రికార్డు కాబడినాయి. నేరనిరూపణకు ఆ ఎవిడెన్స్ అవసరం కూడా. అలాంటపుడు వ్యక్తిగతగోప్యత కింద వాటిని సాక్ష్యంగా పరిగణించకపోతే నిరాపరాధులు కేసులలో ఇరుక్కోవడం, లేదా నిందితులు తప్పించుకోవడం జరగదా !

అందువలన భారతప్రభుత్వ న్యాయశాఖవారు వివిధగౌరవ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను పరిగణన లోనికి తీసుకుకొని సాక్ష్యాలకే మూలస్థంభమైన ఇండియన్ ఏవిడెన్స్ యాక్ట్ (Indian Evidence Act) 1872 లోని సెక్షన్ 45 కి B అనే సబ్ సెక్షన్ ను తగిలించడం (Add) చేయడం జరిగింది.

సాక్ష్యాలు (Evidence) అనేవి రెండు రకాలని మనం తెలుసుకోవాలి. మొదటిది వాజ్ఞ్ములము ( మాటలు) ద్వారా ఇచ్చేది, రెండోది డాక్యూమెంటు రూపకంగా ఇచ్చేది. మనం మౌఖికంగా ఇచ్చే సాక్ష్యాన్ని గౌరవన్యాయస్థానాలు విని వాటిని కాగితంమీద ప్రకటనలుగా వ్రాసుకొని మనసంతకం తీసుకొంటారు.దీనినే స్టేట్ మెంట్ రికార్డింగ్ అంటారు.
రెండవది డాక్యూమెంటు రూపంలోనున్న సాక్ష్యం. ఇవి వస్తురూపంలో వుంటాయి. ఉదా॥పత్రాలు, దస్త్రాలు, నేర సమయంలో దొరికిన వస్త్రాలు, వేలిముద్రలు, ఆయుధాలు మొదలైనవి.

1872 భారత ఏవిడెన్స్ చట్టంలో ఎలెక్ట్రిక్, ఎలెక్ట్రానిక్ ఉపకరణాల (ఇన్స్ట్రుమెట్స్/ గాడ్జెట్స్) అంటే టేపు రికార్డ్ లు, చరవాణులు, కెమెరాలు, కంప్యూటర్లు మొదలైన వాటిగురించి ప్రస్తావన లేదు. అందుకే 1872 చట్టానికి అనుబంధంగా ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది, అదేమిటంటే IT Act – 2000. ఈ చట్టం ప్రకారం ఎలెక్ట్రానిక్ పరికరాల ద్వారా రికార్డుకాబడిన రికార్డులను అవసరమైతే నేరవిభాగశాఖవారు సాక్ష్యంలో భాగంగా ఉపయోగించవచ్చును.

అయితే సామాన్య ప్రజలచే రికార్డ్ చేయబడిన అంశాలు, సివిల్, క్రిమినల్ కేసులకు వర్తించవా అంటే వర్తిస్తాయి. 1872 భారత ఏవిడెన్స్ యాక్ట్ లోని 45 వ సెక్షన్‌ కు B అనే అనుబంధం చేర్చారు, అనగా 1872 భారత ఏవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 45 – B ప్రకారం ఇవి చెల్లుబాటైతాయి.

అయితే కొన్ని సందర్భాలలో నేరం లేదా కేసు తీవ్రత దృష్ట్యా గౌరవన్యాయస్థానం అనుమతితో దృశ్యాలను మాటలను మాటలతో కూడినదృశ్యాలను రికార్డుచేసి సాక్ష్యంగా కోర్టుముందు ప్రవేశపెడతారు.ఉదా॥ అవినీతి నిరోధకశాఖ (ACB) వారు ఇలా రికార్డ్ చేసిన సందర్భాలున్నాయి.

సామాన్య పౌరుడు ఇలాంటి రికార్డులను సాక్ష్యంగా గోరవన్యాయస్థానాలలో ప్రవేశపెట్టడానికి ముందు ఒక వ్రాతపూర్వకంగా (అఫిడవిట్) రూపంలో కోర్టుకు తెలియచేయాలి. రికార్డు చేసిన ఉపకరణం, విధానం, సమయం, మాటలరూపమా, దృశ్యరూపమా, లేక మాటలు దృశ్యాలున్న రూపమా, రికార్డింగ్ కు పట్టిన సమయం, అటువైపునున్న పరిస్థితులు, వ్యక్తులు, రికార్డింగ్ యాదృచ్చికంగా జరిగిందా లేక ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా మొ॥ అంశాలు పొందుపరచాలి. న్యాయస్థానం మనం సమర్పించిన అఫిడవిట్ లోని అంశాలు పరిశీలించిన అనంతరం అవి నమ్మదగినవిగా భావిస్తే వాటిని నిపుణులకు లేదా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి, మనం ఇచ్చిన రికార్డులు ఎంతవరకు సమంజసమైనవో అంటే నిజమా కాదా అని నిర్ధారిస్తుంది.

మరో అంశమేమిటంటే వ్యక్తిగత గోప్యత అనేది భారతదేశంలో అత్యంత విలువైనదని మనం మరువరాదు.కాబట్టి రికార్డింగ్ సమయంలో విజ్ఞత అత్యంత అవశ్యం.

ఈ సమాచారం కేవలం మీ అవగాహన కొరకే సంపూర్ణ సమాచారం కొరకు సంబంధిత చట్టాలను చదవండి.లేదా నిష్ణాతులైనవారు, వకీల్లు, రక్షకభటశాఖవారు, చాలమందివున్నారు వారిని
సంప్రదించప్రార్ధన.