Business

₹1147కోట్ల నష్టం-వాణిజ్యం

₹1147కోట్ల నష్టం-వాణిజ్యం

* దేశంలో త్వరలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పలువురి నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణి కోటిపై 5జీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, 5జీ టెక్నాలజీ ఎవరి ఆరోగ్యం పైనా ప్రభావం చూపదని, తప్పుడు ప్రచారం జరుగుతోందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (COAI) తెలిపింది. 5జీ టెక్నాలజీ పూర్తి సురక్షితమని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని కాయ్‌ వివరించింది. రాబోయే కాలంలో 5జీ గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి విస్తృతమైన ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంది.

* ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజలను.. చమురు ధరల పెరుగుదల మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం పెట్రోలుపై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచారు. ధరల పెంపు ఆరు రోజుల్లో ఇది మూడోసారి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.98.76, డీజిల్‌ ధర రూ.93.70కి చేరింది. మరోవైపు ఇంధనం నిల్వ కేంద్రం నుంచి రవాణా దూరం ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, జోగులాంబ, కుమురం భీం, నిర్మల్‌ జిల్లాల్లో లీటరు పెట్రోలు ధర రూ.వంద దాటిన విషయం తెలిసిందే. మరోవైపు ఏపీలో అనంతపూర్‌, చిత్తూరు, తూర్పు గోదావరి, విజయవాడ, గుంటూరులోనూ లీటర్‌ పెట్రోల్‌ ధర వందకు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.101.25, డీజిల్ ధర లీటరుకు రూ. 93.10 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.95.03, డీజిల్‌ రేటు రూ.85.95గా ఉన్నాయి. చైన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.47, కోల్‌కతాలో రూ.95.02, బెంగళూరులో రూ.98.20, లఖ్‌నవూలో రూ.92.29, పట్నాలో రూ.రూ.97.18, చండీగఢ్‌లో రూ.91.40కు చేరింది. మరో వైపు డీజిల్ లీటర్‌ ధర చైన్నైలో రూ.90.66, కోల్‌కతాలో రూ.88.80, బెంగళూరులో రూ.91.12, పట్నాలో రూ.91.24, లఖ్‌నవూలో రూ.86.35కి చేరింది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీట‌ర్‌ పెట్రోల్‌ ధర రూ.105.33కి చేరగా.. డీజిల్‌ ధర వందకు చేరువైంది.

* ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ జనవరి- మార్చిలో ఏకీకృత ప్రాతిపదికన రూ.1,147.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలోని రూ.870.80 కోట్లతో పోలిస్తే నష్టం పెరిగింది. కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో ఆదాయాలు గణనీయంగా తగ్గడం ఇందుకు కారణమైంది. మొత్తం ఆదాయం కూడా రూ.8,634.60 కోట్ల నుంచి 26 శాతం తగ్గి రూ.6,361.80 కోట్లకు పరిమితమైంది.

* ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంక్‌గా చెబుతున్న నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌)లో వాటాను కొనుగోలు చేయనున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) వెల్లడించింది. అలాగే ఎన్‌ఏఆర్‌సీఎల్‌కు బదిలీ చేసేందుకు రూ.8,000 కోట్ల నిరర్థక ఆస్తులను కూడా గుర్తించినట్లు తెలిపింది. బ్యాంకులు, ఇతరత్రా రుణ సంస్థల నుంచి మొండి బకాయిలను కొనుగోలు చేసి.. వాటిని వసూలు చేయడం బ్యాడ్‌ బ్యాంక్‌ పని. ‘బ్యాంకులన్నింటి ద్వారా ఎన్‌ఏఆర్‌సీఎల్‌ ఏర్పాటు కానుంది. వసూలు నిమిత్తం దీనికి కొన్ని ఎన్‌పీఏలను బ్యాంకులు బదిలీ చేస్తాయి. ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో 51 శాతం వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే ఉండనుంది. అయితే అన్ని పెద్ద బ్యాంకులకు ఇందులో వాటా ఉన్నా.. అది 10 శాతం లోపే ఉంటుంద’ని పీఎన్‌బీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.మల్లికార్జున రావు తెలిపారు. వచ్చే నెల నుంచి ఎన్‌ఏఆర్‌సీఎల్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.