Politics

అర్ధరాత్రి అక్రమాలపై చంద్రబాబు ఆవేదన

అర్ధరాత్రి అక్రమాలపై చంద్రబాబు ఆవేదన

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆనందయ్య తాపత్రయపడుతుంటే… వైకాపా నేతలు అందులోనూ అవినీతికి ప్రయత్నిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా నేతల అక్రమాలను, అవినీతిని ప్రశ్నించి, దోపిడీని ఆధారాలతో సహా బయట పెట్టినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై అర్ధరాత్రి అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు. అర్ధరాత్రి కేసు నమోదు చేయడంతోనే ఇది అక్రమ కేసని, ఇందులో కుట్ర ఉందని స్పష్టమవుతోందన్నారు. అర్ధరాత్రి కేసులు, తెల్లవారుజాము కూల్చివేతలు వంటి మూర్ఖపు చర్యలతో జగన్‌ రాష్ట్రాన్ని ప్రతీకార కుంపటిగా మార్చారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ.. పౌర హక్కుల్ని అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించి మందులు అమ్ముకునేందుకు ప్రయత్నించిన వారిని వదిలేసి అవినీతి బట్టబయలు చేసిన సోమిరెడ్డిపై దొంగతనం, ఫోర్జరీ, చీటింగ్‌ అంటూ నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతారా అని నిలదీశారు. ఆనందయ్య అనుమతి నిరాకరించినా దొడ్డిదారిన ఆన్‌లైన్‌ అమ్మకాలకు ప్రయత్నించిన సెశ్రిత టెక్నాలజీస్‌ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దొంగతనంగా వ్యాపారం చేసేందుకు ప్రయత్నించిన వైకాపా నేతలపైనే ఐపీసీ సెక్షన్‌ 379, 468, 506, ఐటీ యాక్ట్‌ 56 కింద కేసు పెట్టాలన్నారు.