Sports

వైదొలిగిన ఫెదరర్

వైదొలిగిన ఫెదరర్

ఫ్రెంచ్‌ ఓపెన్లో స్విస్‌ మాస్టర్‌ రోజర్‌ ఫెదరర్‌ తన ఆటను మధ్యలోనే ఆపేశాడు. టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. డొమినిక్‌ కెఫర్‌ (జర్మనీ)తో హోరాహోరీగా సాగిన మూడో రౌండ్‌ పోరులో 7-6 (7/5), 6-7 (3/7), 7-6 (7/4), 7-5తో గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరిన తర్వాత అతనీ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘మా బృందంతో చర్చించిన తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. మోకాలికి రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. ఆటకు ఏడాదికి పైగా విరామం వచ్చింది. ఈ స్థితిలో నా శరీర స్పందనలకు తగ్గట్టుగా నడుచుకోవడం ముఖ్యం. పూర్తిగా కోలుకునే దిశగా ఉన్న స్థితిలో శరీరాన్ని ఎక్కువ శ్రమ పెట్టాలనుకోవట్లేదు. ఈసారి రొలాండ్‌ గారోస్‌లో 3 మ్యాచ్‌లు గెలిచాను.. అది చాలు! త్వరలోనే మళ్లీ కలుస్తా’’ అని ఫెదరర్‌ ట్వీట్‌ చేశాడు. డొమినిక్‌తో మూడు గంటలకు పైగా సాగిన మూడో రౌండ్‌ పోరులో రోజర్‌ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడ్డాడు. మూడు సెట్లు టైబ్రేకర్‌కు వెళ్లడంతో అతడు సుదీర్ఘంగా ర్యాలీలు ఆడాల్సి వచ్చింది. ఫెదరర్‌ తప్పుకోవడంతో ప్రిక్వార్టర్స్‌లో అతడి ప్రత్యర్థి మాటో బెరిటిని (ఇటలీ) నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ చేరుకున్నాడు. గ్రీసు కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్‌లో ఈ అయిదో సీడ్‌ 6-3, 6-2, 7-5తో పాబ్లో కారెనో బస్టా (స్పెయిన్‌)పై పెద్దగా కష్టపడకుండానే గెలిచాడు. మెద్వెదెవ్‌ (రష్యా) కూడా క్వార్టర్స్‌ చేరాడు. ప్రిక్వార్టర్స్‌లో ఈ రెండోసీడ్‌ 6-2, 6-1, 7-5తో క్రిస్టియన్‌ గారిన్‌ (చిలీ)పై విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో సిట్సిపాస్‌తో మెద్వెదెవ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు..