Business

బాస్మతీ బియ్యం కొసం ఇండియా-పాక్ తగవు-వాణిజ్యం

బాస్మతీ బియ్యం కొసం ఇండియా-పాక్ తగవు-వాణిజ్యం

* బిర్యానీ, పులావ్‌.. ఇవి భారతీయులు, పాకిస్థానీయులకు ఎంతో ఇష్టమైన వంటకాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇందులో ఉపయోగించే పొడవాటి బాస్మతి బియ్యం ఇప్పుడు రెండు దేశాల మధ్య కొత్త ఉద్రిక్తతలకు తెరలేపింది. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో బాస్మతి బియ్యం హక్కుల కోసం ఈ రెండు దేశాల గొడవపడుతున్నాయి. బాస్మతి రకంపై పూర్తి హక్కులు చెందేలా భారత్‌ ఈయూలో దరఖాస్తు చేసుకుంది. అయితే దీన్ని పాక్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో భారత్‌ అత్యధికంగా బియ్యం ఎగుమతులు చేస్తోంది. ఈ ఎగుమతుల ద్వారా ఏడాదికి 6.8 బిలియన్‌ డాలర్లను సమకూర్చుకుంటోంది. ఇక 2.2 బిలియన్‌ డాలర్ల విలువైన బియ్యం ఎగుమతులతో పాకిస్థాన్‌ నాలుగో స్థానంలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా బాస్మతి రకం బియ్యాన్ని ఎగుమతి చేసేది మాత్రం ఈ రెండు దేశాలే. అయితే బాస్మతి భౌగోళిక గుర్తింపుపై భారత్‌, పాక్‌ మధ్య చాలా కాలం నుంచే విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. యూరోపియన్‌ యూనియన్‌ ఎరువుల ప్రమాణ స్థాయిని కఠినతరం చేయడంతో గత మూడేళ్లుగా ఈయూకు భారత్‌ నుంచి బాస్మతి ఎగుమతులు తగ్గాయి. దీన్ని అదనుగా చేసుకుని పాకిస్థాన్‌ తన ఎగుమతులను విస్తరించుకుంది.

* దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడు కొనసా..గుతూనే ఉంది. తాజాగా సోమవారం కూడా పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 27పైసలు చొప్పున వడ్డించడంతో పలు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్‌ ధర సెంచరీ దాటేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంధన ధరలు ఇంతలా పెరిగిపోవడానికి అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలే కారణమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇటీవలి కాలంలో ఖరీదైపోయాయన్నారు. పెట్రోల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలా? వద్దా అనేది జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని జీఎస్టీ కిందకు తెస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారని మంత్రి తెలిపారు. సోమవారం ఆయన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో విలేకర్లు పెట్రో ధరల పెంపుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ దేశంలో పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలు పైకి పోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారల్‌కు ధర 70 డాలర్లుగా ఉండటమే. మన అవసరాల్లో 80శాతం దిగుమతి చేసుకోవడంతో ఇక్కడ వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడుతోంది’’ అని మంత్రి వివరించారు.

* వాల్‌మార్ట్‌ ఆధ్వర్యంలోని భారత ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మూడు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు సమీకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ మేరకు సాఫ్ట్‌ బ్యాంక్‌ సహా మరికొన్ని నిధుల సమీకరణ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. 40 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువే లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్‌ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెట్టుబడుల కోసం సింగపూర్‌కు చెందిన జీఐసీ, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

* కరోనా వైరస్‌పై పోరాటంలో కీలక అస్త్రమైన వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ విధానంలో మరిన్ని కొత్త మార్పులతో కేంద్రీకృత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ తీసుకొచ్చింది. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని.. రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనన్నారు. వ్యాక్సినేషన్‌పై అనేకసార్లు సీఎంలతో మాట్లాడానన్న ప్రధాని.. టీకా కొరతపై అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ల కొరతపై రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. టీకాల భారం నుంచి రాష్ట్రాలకు పూర్తి విముక్తి కల్పిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. 75శాతం టీకాలు కేంద్రమే సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందని ప్రధాని స్పష్టంచేశారు.