Politics

ఇప్పుడు తెదేపాకు తెలంగాణాలో దిక్కు ఎవరు?

ఇప్పుడు తెదేపాకు తెలంగాణాలో దిక్కు ఎవరు?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ తెరాసలో చేరడం దాదాపుగా ఖాయమైంది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈ అంశంపై ఇప్పటికే రమణతో సంప్రదింపులు జరిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కూడా మాట్లాడారని సమాచారం. తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని రమణ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత కొన్ని నెలలుగా రమణ తెరాసలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు రమణ, ఇటు తెరాస స్పందించలేదు. తాజాగా ఈటల రాజేందర్‌ రాజీనామా చేయడంతో బీసీ నేతల సమీకరణపై తెరాస దృష్టి సారించింది. అందులో భాగంగానే రమణ పేరును పరిగణనలోనికి తీసుకుంది. అన్నీ కుదిరితే ఈటల రాజేందర్‌ భాజపాలో చేరడానికంటే ముందే రమణ తెరాసలో చేరే వీలుంది. రమణ తెలుగుదేశం సీనియర్‌ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారు. 1994లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి, 1996లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. ఆ తర్వాత పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయన 2009 శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల నుంచి విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెతెదేపా అధ్యక్షునిగా రమణ కొనసాగుతున్నారు. ఇటీవల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్‌ కోల్పోయారు. 2018లోనే ఆయన తెరాసలో చేరి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా… పరిస్థితులు అనుకూలించలేదు. తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాస సీనియర్‌ బీసీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రమణతో చర్చలు జరిగాయి. రమణకు స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ సీనియర్‌, చేనేత వర్గానికి చెందిన ఆయనకు తెరాస సముచిత స్థానం కల్పిస్తుందని ఎర్రబెల్లి ఇతర నేతలు వెల్లడించినట్లు తెలిసింది. రమణ సానుకూలంగా ఉన్నందున త్వరలోనే తెరాసలో చేరిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.