NRI-NRT

కాలిఫోర్నియా హోటల్‌లో మాస్క్ పెట్టుకుంటే జరిమానా-తాజావార్తలు

కాలిఫోర్నియా హోటల్‌లో మాస్క్ పెట్టుకుంటే జరిమానా-తాజావార్తలు

* కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు నిబంధన విధించాయి. అంతేనా.. మాస్క్‌ ధరించపోతే జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయితే, ఇటీవల అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్‌ వేగవంతం కావడంతో ఇకపై మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశాధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్‌హెడ్‌ కేఫ్‌ రెస్టారెంట్‌ విస్తుపోయే నిబంధన అమలు చేస్తోంది. రెస్టారెంట్లోకి మాస్క్‌ ధరించి వస్తే బిల్లుపై 5 డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

* నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా ఔషధాన్ని తాను ఎప్పుడో తీసుకున్నానని సినీ నటుడు జగపతిబాబు అన్నారు. ఇటీవల జగపతిబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆనందయ్య తయారు చేసిన ఔషధం పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

* హోండా కార్స్‌ ఇండియా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అత్యధికంగా రూ.33,496 వరకు వినియోగదారులు లబ్ధి పొందే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్లు అమేజ్‌, డబ్ల్యూ-ఆర్‌, జాజ్‌లకు వర్తిస్తాయి. ఈ ఆఫర్లు మోడల్‌, వేరియంట్‌, ప్రదేశాన్ని బట్టి వర్తిస్తాయని హోండా వెల్లడించింది. జూన్‌ 30వ తేదీ వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి.

* మహారాష్ట్రలోని పుణెలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది కార్మికులు మృతిచెందారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ధాటికి రాష్ట్రాలన్నీ వణికిపోయాయి. ఈ ప్రభావంతో ఏప్రిల్‌ నుంచి చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రెండు నెలల అనంతరం కనిష్ఠంగా నమోదయ్యింది. దీంతోపాటు పలు రాష్ట్రాల్లో వైరస్‌ నియంత్రణలోకి రావడంతో ఆంక్షలను సడలిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా దిల్లీ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాలు ఆంక్షలను సడలించడంతో దుకాణాలు, కార్యాలయాలు తెరచుకున్నాయి.

* హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మరో బలమైన బీసీ నేత కోసం తెరాస పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్‌.రమణను తెరాసలో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెదేపాను వీడి తెరాసలో చేరేందుకు ఆయన కూడా ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎల్‌.రమణతో పలుమార్లు ఫోన్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కూడా రమణతో చర్చలు జరిపినట్లు తెలిసింది.

* క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తుండటంతో త‌న పుట్టిన రోజున‌ అభిమానుల్ని రావొద్ద‌ని కోరారు ప్ర‌ముఖ న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. జూన్ 10.. బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈ వేడుక‌ని జ‌రిపేందుకు ప్ర‌తి ఏడాది అభిమానులు బాల‌కృష్ణ ఇంటికి త‌ర‌లి వచ్చేవారు. కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర‌త దృష్ట్యా ఈసారి అలాంటి కార్య‌క్ర‌మాలు వ‌ద్ద‌ని, అంద‌రూ త‌మ త‌మ కుటుంబ స‌భ్యుల‌తోనే గ‌డ‌పాల‌న్నారాయ‌న‌.