Business

టీకా వేయించుకుంటే FDలపై ఎక్కువ వడ్డీ-వాణిజ్యం

టీకా వేయించుకుంటే FDలపై ఎక్కువ వడ్డీ-వాణిజ్యం

* కరోనాను కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేకాదు.. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ప్రోత్సాహకంగా పలు చోట్ల స్వచ్ఛంద సంస్థలు బహుమతులు కూడా ఇస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు సైతం వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు వినూత్న ఆఫర్లను తీసుకొస్తున్నాయి. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రకటిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్లు కొద్ది రోజులకు మాత్రమే.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం రోజంతా స్తబ్దుగానే కదలాడాయి. ఓ దశలో 52,135 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ తిరిగి కోలుకున్నప్పటికీ.. ఏ దశలోనూ లాభాల్లోకి రాలేకపోయింది. నిఫ్టీ సైతం అదే తీరును కొనసాగించింది. చివరకు సెన్సెక్స్‌ 52 పాయింట్లు నష్టపోయి 52,275 వద్ద ముగియగా.. నిఫ్టీ 11 పాయింట్లు కుంగి 15,740 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.88 వద్ద నిలిచింది. ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కరోనా టీకా అందించనుందన్న వార్త మదుపర్లను అప్రమత్తతకు గురిచేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడనుందనే వార్త సూచీలను కాస్త నిరాశపరిచింది. సూచీలు గరిష్ఠాలకు చేరుకోవడంతో మదుపర్లు కీలక రంగాల్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేడు మందకొడిగా ముందుకు సాగాయి.

* కొవిడ్‌ మహమ్మారి, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం నేపథ్యంలో 2020లో ప్రపంచ రుణాలు 32 ట్రిలియన్‌ డాలర్ల మేర పెరిగి 290.6 ట్రిలియన్ డాలర్లకు చేరిందని మూడీస్‌ వెల్లడించింది. ఆఫ్రికా, కరీబియన్‌ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల ఉత్పాదకత వృద్ధి కుంగడం వల్ల ఆయా దేశాల రుణ చెల్లింపు సామర్థ్యంపై తీవ్ర పభావం పడిందని అభిప్రాయపడింది. అలాగే అభివృద్ధి చెందిన దేశాలకు ఉత్పాదకత, మానవ వనరులపరమైన ఇబ్బందులు.. రుణాలు చెల్లించే సామర్థ్యానికి సవాల్‌గా నిలవనున్నాయన్నారు.

* దేశంలో 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయించే బాధ్యత కేంద్రానిదే అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాలపై పైసా భారం పడదని చెప్పారు. అంతేగాక, 80కోట్ల మందికి నవంబరు వరకు ఉచితంగా రేషన్‌ అందించనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఉచితాల వల్ల కేంద్రంపై అధిక భారమే పడనుంది. ఉచిత టీకాలు, రేషన్‌ కోసం కేంద్రం దాదాపు రూ. 1.45లక్షల వరకు ఖర్చు చేయనుందని ఆర్థికశాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి.