Business

రామ్‌దేవ్ బాబాకు నేపాల్ సెగ-వాణిజ్యం

రామ్‌దేవ్ బాబాకు నేపాల్ సెగ-వాణిజ్యం

* యోగా గురువు, పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌ బాబాకు భారీ షాక్‌ తగిలింది. కరోనా వైరస్‌ సోకకుండా తీసుకువచ్చిన కరోనిల్‌ మందును భూటాన్‌ నిలిపివేయగా.. తాజాగా నేపాల్‌ ఆ మందును వాడకూడదని ఆదేశించింది. భూటాన్‌ గతంలోనే కరోనిల్‌పై నిషేధం విధించింది. తాజాగా నేపాల్‌ సోమవారం ఆ మందుల పంపిణీని నిలిపివేసింది. రామ్‌దేవ్‌ బాబా బహుమతిగా అందించిన 1,500 కరోనిల్‌ కిట్లను వాడకూడదని నిర్ణయించింది. ఎందుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కోనవడంలో కరోనిల్‌ విఫలం చెందిందని గుర్తించింది.

* తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన ప్రాంతాలన్నింటిలో పగటి పూట లాక్‌డౌన్‌ను సర్కారు ఎత్తివేసిన నేపథ్యంలో బస్సు సర్వీసుల వేళలను టీఎస్‌ఆర్టీసీ పొడిగించింది. సడలింపులకు అనుగుణంగా 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలకు నడిపే బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2గంటల వరకు నడుపుతున్నామని.. వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని స్పష్టం చేశారు.

* మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో సంకల్ప్, రాణి పరిహార్‌ దంపతులు సాగు చేస్తున్న మామిడి పండ్ల కిలో ధర రికార్డ్‌ స్థాయిలో సుమారు రూ. రెండు లక్షల వరకు పలుకుతోంది. జపాన్‌లో ఎక్కువగా పండించే టాయో నో టామ్‌గావ్‌ రకం మామిడిని సాగు చేస్తూ వారు లాభాలను గడిస్తున్నారు. ఈ రకానికి చెందిన చెట్లు ఒకొక్కదానికి 20 పండ్లు కాస్తాయని.. పండు కూడా రుచిగా ఉంటుందని రాణి పరిహార్‌ తెలిపారు.

* ఈఎంఐ, బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక వ్యవహారాల్లో వినియోగించే ఆటో-డెబిట్‌ లావాదేవీల తిరస్కరణ రేటు వరుసగా రెండో నెలా పెరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఏర్పడ్డ ఒత్తిడిని ఇది సూచిస్తోంది. నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌(నాచ్‌) వివరాల ప్రకారం.. మే నెలలో మొత్తం 85.7 మిలియన్ ఆటో డెబిట్‌ లావాదేవీల్లో.. 30.8 మిలియన్(35.91 శాతం) లావాదేవీలు తిరస్కరణకు గురయ్యాయి. ఏప్రిల్‌లో 85.4 మిలియన్‌ లావాదేవీల్లో 29.08 మిలియన్(34.05శాతం) తిరస్కరణకు లోనయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చిన తిరస్కరణలు మార్చిలో కరోనా మునుపటి స్థితికి చేరుకున్నాయి. కానీ, రెండో దశ విజృంభణ, దాని కట్టడి కోసం రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించడంతో మళ్లీ ప్రతికూల తిరస్కరణ రేట్లు పెరిగాయి.

* భారత్‌లో రెండో దశ తీవ్ర ఉద్ధృతికి కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్ నుంచి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా మెరుగైన రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పుణెకు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ), భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సంయుక్తంగా ఇటీవల అధ్యయనం చేపట్టాయి. డెల్టాతో పాటు బీటా వేరియంట్‌నూ ఈ టీకా సమర్థంగా ఎదుర్కంటోందని అధ్యయనంలో తేలింది.

* దివాలా చర్యలు ఎదుర్కొంటున్న వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ కొనుగోలుకు వేదాంతా గ్రూప్‌ సంస్థ ట్విన్‌స్టార్‌ టెక్నాలజీస్‌ దాఖలు చేసిన రూ.2962 కోట్ల రుణ పరిష్కార ప్రణాళికకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబయి బెంచ్‌ మంగళవారం ఆమోదం తెలిపింది.రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో దాఖలు చేసిన వివరాల ప్రకారం.. ట్విన్‌స్టార్‌ డైరెక్టర్లు, స్టెరిలైట్‌ గ్రూప్‌ కంపెనీల బోర్డులో సైతం ఉన్నారు. వీటి ప్రమోటర్‌ మైనింగ్‌ దిగ్గజం అనిల్‌ అగర్వాల్‌ కావడం విశేషం. తాజా కొనుగోలుతో రవ్వ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ క్షేత్రంపై అనిల్‌ అగర్వాల్‌కు పట్టు లభిస్తుంది. ఈ క్షేత్రంలో ఇప్పటికే వేదాంతాకు 22.5 శాతం వాటా ఉండగా, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌కు 25 శాతం వాటా ఉంది. రుణదాతలకు వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌, 13 గ్రూప్‌ సంస్థలు రూ.31,000 కోట్లు బకాయిపడ్డాయి. ఈ రుణాలపై బ్యాంకులు ఎంత హెయిర్‌కట్‌ తీసుకుంటాయన్న విషయం రుణ పరిష్కార ప్రణాళిక బయటకు వస్తేనే తెలుస్తుంది. 90 రోజుల్లోపు రూ.500 కోట్లు, మిగిలిన మొత్తాన్ని డిబెంచర్ల రూపంలో ట్విన్‌స్టార్‌ చెల్లిస్తుంది.