Politics

కేసీఆర్‌కు ఆ అలవాటు ఉంది-తాజావార్తలు

కేసీఆర్‌కు ఆ అలవాటు ఉంది-తాజావార్తలు

* అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేశానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. పింఛన్లు రాకపోవడంతో వితంతువులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం ఇల్లందకుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. పింఛన్లు, రేషన్‌కార్డులు వెంటనే మంజూరు చేయాలని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. పీవీ జిల్లా కోసం తాను గతంలోనే ప్రతిపాదన తెచ్చానన్నారు. ఎన్నికలు ఎక్కడ వస్తే అక్కడ వరాలు ఇచ్చే అలవాటు సీఎం కేసీఆర్‌కు ఉందని వ్యాఖ్యానించారు. తన రాజీనామా తర్వాత గతంలో ఆగిపోయిన పథకాలన్నీ వస్తాయని ప్రజలు సంతోష పడుతున్నారని చెప్పారు. హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించడంతో పాటు వావిలాల, చల్లూరును మండలాలుగా ప్రకటించాలని ఈటల డిమాండ్‌ చేశారు. తాను పార్టీ మారలేదని.. బలవంతంగా వెళ్లిపోయేలా చేశారన్నారు.

* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టు చిరకాలవాంఛ నెరవేరనుంది. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచుతూ సీజేఐ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు.

* నటి, అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టి కీలక ఉత్తర్వులు వెలువరించింది. పంజాబ్‌ మూలాలు కలిగిన నవనీత్‌ కౌర్‌.. మహారాష్ట్రలో ఎస్సా కేటగిరికి రాదని, ఆమె కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేసింది. దీంతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఆరు నెలల్లోగా కులధ్రువీకరణకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను కోర్టు ముందుంచాలని నవనీత్ కౌర్‌ను ఆదేశించింది.

* తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో అధికారులతో మంత్రి సబితా సమీక్ష నిర్వహించారు.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జోరుగా వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోకి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో ముంబైలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతున్నదని తెలిపింది. ఈ నెల 9 నుంచి 13 వరకు ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్‌ 10న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, అయితే అవి ఈసారి కాస్త ముందుగా వచ్చేశాయని ఐఎండీ ముంబై డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డా. జయంత సర్కార్‌ వెల్లడించారు.

* మెట్‌పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రేగుంట నుంచి సీఎం రోడ్డు మార్గాన హైదరాబాద్‌ బయల్దేరారు. మెట్‌పల్లి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బాల్క సురేష్‌(62) కరోనాతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఇటీవల కన్నుమూశారు.

* praముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా వర్తమాన అంశాలకు తన హాస్యచతురతను జోడించి, ట్వీట్లతో చమత్కరిస్తుంటారు. ఆయన నెట్టింట్లో పంచుకునే ట్వీట్లే అందుకు నిదర్శనం. కరోనాకు సంబంధించిన అంశాలు వాటిలో ప్రస్తావనకొస్తాయి. ఏడాదిన్నర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన మహమ్మారి కొత్త రూపాలను సంతరించుకుంటూ మానవాళికి సవాలు విసురుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్త రకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆల్ఫా, బీటా, గామా,.. అంటూ నామకరణం చేసింది. మరో కొత్త రకం N440K రకం గురించి ఓ ఆంగ్ల పత్రిక ద్వారా తెలిసింది. అది చూసిన ఆయనకు విసుగు పుట్టిందట, ఈ కొత్తపేర్లన్నీ గందరగోళంగా అనిపిస్తున్నాయట. ఇదే విషయాన్ని ట్వీట్ చేసి, చెప్పారు. ‘ఆల్ఫా-B.1.1.7, బీటా-B.1.351, గామా-P1, డెల్టా-B.1.617.2… ఇప్పుడు N440K. నేను విసిగిపోయాను. గందరగోళానికి గురయ్యాను. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు పాఠశాలల్లో కొత్త భాషను ఎంచుకోవాలేమో. వారు ఇంగ్లిష్‌, స్పానిష్‌, కొవిడిష్‌ను ఎంపిక చేసుకోవచ్చు’ అంటూ తన చిరాకును చమత్కారంగా ప్రదర్శించారు. ఈ N440K రకం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి తదితర రాష్ట్రాల్లో వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

* రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉచితంగా 25 కోట్ల వ్యాక్సిన్లు అందజేసిందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1.3కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మరో 3లక్షలపైగా టీకాలు పంపించనున్నట్లు వెల్లడించింది. మే1న వ్యాక్సినేషన్‌ మూడో దశ ప్రారంభం కాగా, జూన్‌21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా ఇవ్వనుందని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మొత్తం ఉత్పత్తిలో 75శాతం కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. టీకాల కోసం రాష్ట్రాలు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు.

* తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి నియామకంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజగా దీనిపై సీనియర్‌ నేత వి.హనుమంతరావు మరోసారి స్పందించారు. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ప్రకటనకు ముందే సీనియర్లతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌కు హనుమంతరావు లేఖ రాశారు. 2014 నుంచి ఇప్పటి వరకు పార్టీ అంతర్గత సమీక్ష జరగలేదని ఆరోపించారు. ప్రతి ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలేమిటో మేథోమథనం జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రేపు దిల్లీ వెళ్లే అవ‌కాశం ఉంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను క‌ల‌వ‌నున్నారు. ఈయ‌న‌తో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను జ‌గ‌న్‌ క‌లిసే అవ‌కాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. మూడు రాజ‌ధానుల ఏర్పాటుపై స‌హ‌క‌రించాల‌ని అమిత్‌షాను కోరే అవ‌కాశం ఉంది. పోల‌వ‌రం ప్రాజెక్టు బ‌కాయిల విడుద‌ల‌పై జ‌ల‌శ‌క్తి మంత్రితో జ‌గ‌న్‌ చ‌ర్చించ‌నున్నారు. కొవిడ్ దృష్ట్యా కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆర్థిక సాయం చేయాల‌ని జ‌గ‌న్ కోరుతున్న నేప‌థ్యంలో తాజా ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది.