Sports

నాదల్ జోరుకు జకో డిస్క్ బ్రేకు

నాదల్ జోరుకు జకో డిస్క్ బ్రేకు

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నాదల్‌కు బ్రేక్‌ పడింది. సెమీస్‌లో టాప్‌ సీడ్‌ జకోవిచ్‌ 3-6, 6-3, 7-6 (7-4), 6-2 తేడాతో మూడో సీడ్‌ నాదల్‌ను ఓడించాడు. ఇప్పటికే 13 సార్లు ట్రోఫీని ముద్దాడి.. సెమీస్‌ చేరిన ప్రతిసారీ విజేతగా నిలిచిన నాదల్‌ జైత్రయాత్రకు ముగింపు పలికిన అసాధారణ విజయమిది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 6-3తో సులభంగా గెలుచుకున్న నాదల్‌ ఫైనల్లో అడుగుపెట్టడం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ సెర్బియా పోరాట యోధుడు జకోవిచ్‌ మాత్రం ఆశలు వదులుకోలేదు. రెండో సెట్లో గొప్పగా పుంజుకున్నాడు. 5-2తో ఆధిక్యం సంపాదించిన అతను.. అదే జోరులో సెట్‌ సొంతం చేసుకున్నాడు. ఇక చరిత్రలో నిలిచిపోయేలా మూడో సెట్లో ఈ దిగ్గజాలిద్దరూ గొప్పగా తలపడ్డారు. మ్యాచ్‌ మొత్తాన్ని ఈ ఒక్క సెట్లోనే చూపించేశారు. 93 నిమిషాల పాటు సాగిన ఈ సెట్‌ అభిమానులకు అసలైన టెన్నిస్‌ మజాను అందించింది. నాదల్‌ బలంగా బoతిని బాదితే.. జకో తెలివిగా దాని వేగాన్ని తగ్గించి నెట్‌కు దగ్గరగా ఆడడం.. నాదల్‌ ముందుకు దూసుకొస్తూ బంతిని ప్రత్యర్థికి అందకుండా కొడితే.. దానికి జకో ధీటుగా స్పందించడం.. ఇలా పోటాపోటీగా సాగిన ఆ సెట్‌ను ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకులు అదృష్టవంతులే. వేగవంతమైన సర్వీసులు, శక్తిమంతమైన షాట్లతో నాదల్‌ చెలరేగితే.. క్రాస్‌ కోర్టు షాట్లతో జకో ప్రతిఘటించాడు.

బ్యాక్‌హ్యాండ్‌, ఫోర్‌ హ్యాండ్‌ షాట్లు, విన్నర్లు, ఏస్‌లు.. ఇలా పూర్తి ఆటకు ఈ సెట్‌ చిరునామాగా మారింది. చెరో గేమ్‌ గెలుస్తూ సాగడంతో ఓ దశలో స్కోరు 3-3తో సమమైంది. అయితే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జకో వరుసగా రెండు గేమ్‌లు గెలిచి 5-3తో గెలుపు దిశగా సాగాడు. కానీ తిరిగి పుంజుకున్న నాదల్‌ వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 6-5తో నిలిచి సెట్‌ ముగించేందుకు చేరువగా వచ్చినా జకో పట్టు వదల్లేదు. తన పోరాటంతో స్కోరు సమం చేశాడు. దీంతో టైబ్రేకర్‌ తప్పలేదు. అందులోనూ వీళ్లు ఒక్కో పాయింట్‌ కోసం యుద్ధమే చేశారు. అయితే చివరగా ఆ సెట్‌ జకో సొంతమైంది. వరుసగా రెండు సెట్లు గెలిచిన ఊపులో చెలరేగిన జకో.. నాదల్‌ను సాధారణ ఆటగాడిగా మార్చేస్తూ నాలుగో సెట్‌లో విజృంభించాడు. తొలి నాలుగు గేమ్‌ల వరకూ ప్రతిఘటించిన నాదల్‌ ఆ తర్వాత అనవసర తప్పిదాలతో వెనకబడ్డాడు. అదే అదనుగా జకోవిచ్‌ ముందుకు సాగాడు. విజయం దిశగా చేరువవుతున్నా కొద్దీ దూకుడు ప్రదర్శించాడు. చివరగా నాదల్‌ బంతిని లైన్‌ బయటకు కొట్టడంతో జకో విజయానందంలో మునిగిపోయాడు. ఈ మ్యాచ్‌లో డబుల్‌ ఫాల్ట్‌లు (8), అనవసర తప్పిదాలు (55) నాదల్‌ కొంప ముంచాయి. ఆదివారం ఫైనల్లో జకోవిచ్‌.. అయిదో సీడ్‌ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు.‘