Politics

బుగ్గనను తోసేశారు-తాజావార్తలు

Central Forces Push Buggana Rajendra Nath Reddy Away

* వాయువ్య బంగాళాఖాతం పరిసర పశ్చిమ బెంగాల్‌ తీరం, ఉత్తర ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్‌ స్థాయి వరకు వ్యాపించింది. రాగల రెండు మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశముంది. ఈరోజు ఉత్తర పశ్చిమ ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర తెలంగాణ, ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు 4.5 నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

* వచ్చే ఐదేళ్లకు రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్ మద్దతుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో దాదాపు 300 అంకుర సంస్థలు, సూక్ష్మ-చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), వ్యక్తిగత ఆవిష్కర్తలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయుధాలు, సైనిక ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిధులు దోహదం చేయనున్నాయని రక్షణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌-డీడీపీ’ ఆధ్వర్యంలో ‘డిఫెన్స్‌ ఇన్నోవేషన్‌ ఆర్గనైజేషన్‌-డీఐఓ’ ఏర్పాటు చేసి దాని ద్వారా ‘ఇన్నోవేషన్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌-ఐడెక్స్‌’ అమలు చేయనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ, ఏరోస్పేస్‌ రంగంలో స్వావలంబన సాధించడమే ‘ఐడెక్స్‌-డీఐఓ’ లక్ష్యమని.. దాని కోసమే తాజాగా కేటాయిచిన రూ.499 కోట్ల నిధులను వినియోగించనున్నట్లు తెలిపింది. ఆవిష్కర్తలు డీడీపీతో అనుసంధానమయ్యేందుకు డీఐఓ వారధిగా నిలవనుందని తెలిపింది.

* తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో విమానాశ్రయం వీఐపీ గేట్ నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బందిపై ఆగ్రహం. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం తిరుమల పర్యటనకు విచ్చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి గోయల్‌కి స్వాగతం చెప్పేందుకు వీఐపీ గేట్‌ గుండా వెళ్తున్న సమయంలో కేంద్ర భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్టు సమాచారం. ఆయనను పక్కకు తోసేయడంతో మంత్రి అసహనానికి గురై భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆయన కేంద్ర మంత్రిని కలవలేకపోయారు. విషయంపై మంత్రి సీరియస్ అవడంతో విమానాశ్రయ అధికారులు స్పందించి సర్దిచెప్పి పంపించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* పెద్దపల్లి డిసిపి రవీందర్, గోదావరిఖని ఏసీపీ ఉమెందర్ మాట్లాడుతూ……గోదావరిఖని లో బాధ్యత లేకుండా జులయిగ తిరుగుతూ గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కుటుంబ బాధ్యత లేక చదువు లేక యువత గంజాయికి అలవాటు పడి ఆ సమయంలో వారు ఎం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితుల్లో నేరాలకు పాల్పడి జీవితాలు జైలు పాలు చేసుకుంటున్నారు ఈ రోజు గోదావరిఖని లోని అన్ని ఏరియల నుండి గంజాయి త్రాగే 60 మందిని 1టౌన్ సీఐ రమేష్ బాబు స్టేషన్ కు పిలిపించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరందరిపై షీట్స్ ఓపెన్ చేస్తామని ఇకపై ప్రతి నెల 2వ తారీకు నాడు పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరుకావాలని డిసిపి తెలపడం జరిగింది.

* బ్రిటన్ వేదికగా 3 రోజులపాటు జరిగిన జీ-7 సదస్సు నేటితో ముగిసింది. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడంలో సాయం చేయాలని సభ్య దేశాలు తీర్మానం చేశాయి. రోజు రోజుకి పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని సాంకేతికత సహాయంతో ఎదుర్కొంటామని ప్రకటించాయి. చైనాలో మానవ హక్కుల ఎక్కువ జరుగుతుండటంతో మానవ హక్కులను గౌరవించాలని చైనాకు జీ-7 సదస్సు వేదికగా పిలుపునిచ్చాయి. జీవవైవిధ్య నష్టాన్ని తగ్గించడానికి “నేచర్ కాంపాక్ట్” 2010కి సంబంధించి 2030 నాటికి కర్బన ఉద్గారాలను దాదాపు సగానికి తగ్గించడానికి కట్టుబడి కృషి చేస్తామని పేర్కొన్నాయి.

* మాజీ మంత్రి, మాజీ హుజూరాబాద్‌ శాసన సభ్యుడు ఈటల రాజేందర్‌ మరికొద్ది గంటల్లో కమల తీర్ధం పుచ్చుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన రేపు ఉదయం 11:30కి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం ఆయన రేపు ఉదయం తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ ఛైర్మన్‌ తుల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా, దేవరయాంజల్‌ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల.. కొద్ది రోజుల కిందటే టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పారు. ఈ క్రమంలో అతను సొంతంగా పార్టీ పెడతారనే ప్రచారం సాగింది. అయితే వీటన్నిటికీ ఫుల్‌ స్టాప్‌ పెడుతూ.. ఆయన రేపు ఉదయం బీజేపీలో చేరనున్నారు.

* ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నరసాపురంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఏపీ బహుజన ఐక్య వేదిక వెల్లడించింది. రెండేళ్లుగా నియోజకవర్గ ప్రజలను, అభివృద్ధిని పట్టించుకోని రఘురామను ఎంపీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేసింది. ఓట్లేసి ఎన్నుకున్న ఎంపీ తమను మోసం చేశాడంటూ నియోజకవర్గ ప్రజలు రఘురామకృష్ణరాజుపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న ఆలోచనే వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం ఆయన కాకినాడ రూరల్ వాకలపూడి రోడ్డు లో వ్యవసాయ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ జులై 8 వైఎస్సార్‌ జయంతి (రైతు దినోత్సవం) రోజున 61 ల్యాబ్‌లు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

* వైకాపా అధికారిక‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి తన పేరును తొల‌గించ‌డంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. వైకాపా త‌ర‌ఫున గెలిచిన త‌న పేరును తొలగించ‌డంపై అందులో ప్ర‌స్తావించారు. వైకాపా నుంచి త‌న‌ను బ‌హిష్క‌రించారా? అని ఎంపీ సందేహం వ్య‌క్తం చేశారు. పొర‌పాటున‌ పేరు తొల‌గించారా? లేక కావాల‌నే చేశారా? అనే విష‌యంపై స్పష్టత ఇవ్వాలని జ‌గ‌న్‌ను కోరారు.

* ప్రపంచంలోని వ్యాపార సంస్థలపై చైనా గూఢచారులు కన్నేశారు. సైబర్‌ దాడులు చేసి విలువైన సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. భారత్‌లోని సంస్థలు కూడా వీరి రాడార్‌లో ఉన్నాయి. గత నెలలో ‘ఎయిర్‌ ఇండియా’పై సైబర్‌దాడిలో వీరి హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 45లక్షల మంది ప్రయాణికుల వివరాలను వీరు తస్కరించినట్లు సమాచారం. వీటిల్లో పాస్‌పోర్టు వివరాలు, క్రెడిట్‌కార్డుల సమాచారం వంటివి ఉన్నాయి. ఈ విషయంపై సింగపూర్‌కు చెందిన ఓ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అంచనాకు వచ్చింది. గతనెలలో ఎయిర్‌ ఇండియాకు చెందిన కీలక కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ ఘటనపై సింగపూర్‌కు చెందిన ‘గ్రూప్‌-ఐబి’ దృష్టిపెట్టింది. ప్రపంచ విమానయాన రంగంపై చైనా నిఘా పెట్టిందని.. దానిలో భాగంగానే ఈ హ్యాకింగ్‌ జరిగిందని వెల్లడించింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్‌ ప్రతిక పేర్కొంది. చైనా ప్రభుత్వ మద్దతుతో నిర్వహిస్తున్న ఏపీటీ41 అనే హ్యకింగ్‌ బృందం హస్తం ఉన్నట్లు వెల్లడించింది. ఇదే హ్యాకింగ్‌ ముఠా అమెరికాలో దాదాపు 100 సంస్థల నుంచి సమాచారం తస్కరించింది. ఇది గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఎఫ్‌బీఐ మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో ఉంది.