Agriculture

మంగళవారం నుండి తెలంగాణా రైతులకు “రైతుబంధు”

మంగళవారం నుండి తెలంగాణా రైతులకు “రైతుబంధు”

పెట్టుబడి సాయంగా ఎకరాకు సీజన్‌కు రూ.5 వేల చొప్పున అందించే రైతుబంధు పథకం నిధులను మంగళవారం(ఈ నెల 15) నుంచి 25లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ఈ సీజన్‌లో 63,25,695 మంది భూ యజమానులను అర్హులుగా (150.18 లక్షల ఎకరాలు) గుర్తించినట్లు వెల్లడించారు. మొత్తం రూ.7,508.78 కోట్లు అవసరమని లెక్క తేలిందన్నారు. అర్హుల పేర్లతో కూడిన తుది జాబితాను వ్యవసాయశాఖకు రెవెన్యూశాఖ అందజేసిందని ఆదివారం మీడియాకు తెలిపారు. ‘‘గత యాసంగి కన్నా 2.81 లక్షల మంది రైతుల పేర్లను (66 వేల 311 ఎకరాలు) అదనంగా చేర్చాం. దీంతో మొత్తం రైతుల సంఖ్య 63.25 లక్షలకు పెరిగింది. ఈ పథకానికి ఈ సీజన్‌లోనే తొలిసారి అర్హులైన రైతులు స్థానిక ఏఈఓలు, ఏఓలను కలిసి పట్టాదార్‌ పాసుబుక్‌, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా పాస్‌బుక్‌ నకలు కాపీలు ఇవ్వాలి. కొన్ని బ్యాంకుల విలీనంతో ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మారినా ఖాతాదారులు ఆందోళన చెందవద్దు. ఏవైనా అనుమానాలుంటే స్థానిక వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారు’’ అని మంత్రి తెలిపారు.