Food

పెరుగుతో పుల్ల ఐస్

పెరుగుతో పుల్ల ఐస్

పుల్లైస్‌లు వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. వడదెబ్బ నుంచి కాపాడతాయి. వీటివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరానికి కాల్షియం, విటమిన్‌-డి… లాంటివీ లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి, చర్మ సౌందర్యం పెరుగుతుంది. ‘పుల్లైస్‌ల గురించి ఇవన్నీ ఎప్పుడూ వినలేదే’ అని షాకవుతున్నారా… అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఐస్‌ పాప్‌లను పెరుగు, లస్సీ, మజ్జిగలతో కూడా చేస్తున్నారు. వీటిని తింటే లస్సీ తాగినట్లే కదా మరి. మండే ఎండల్లో చల్లచల్లటి పుల్లైస్‌లను చప్పరిస్తుంటే అబ్బ, ఎంత హాయిగా ఉంటుందో. పిల్లలకే కాదు, పెద్దలక్కూడా వాటిని చూస్తే నోరూరిపోతుంది. కానీ మామూలు పుల్లైస్‌ల వల్ల ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. అదే మజ్జిగ, లస్సీలనుకోండి… వేసవిలో ఎంత ఎక్కువ తాగితే ఒంటికి అంత చలవ చేస్తుంది. దాహం కూడా తీరుతుంది. పైగా పెరుగు, మజ్జిగ ల్లోని మంచి బ్యాక్టీరియా వల్ల ఆరోగ్యానికెంతో మేలు. కానీ పిల్లలతో వాటిని తినిపించడం, తాగించడమే కష్టం. అదే- లస్సీ, మజ్జిగలతో చేసిన పుల్లైస్‌లైతే అటు హాయిగా ఐస్‌ పాప్‌లను తిన్నట్లూ ఉంటుంది. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.

ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మన ముందున్న ప్రధాన సమస్య అయిపోయింది. అందుకే, పల్లెలూ పట్టణాలూ అన్న తేడా లేకుండా ‘ఏది తింటే ఎంత ఆరోగ్యం…’ అని లెక్కలేసుకుని మరీ తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో భాగంగానే పోషకాహార నిపుణులూ కొందరు యువ వ్యాపారవేత్తలూ లస్సీ, మజ్జిగలతో పుల్లైస్‌లకూ ఆరోగ్యాన్ని అద్దడం మొదలుపెట్టారు. వీటిని ఇంట్లోనూ సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే బయట కూడా కొన్ని చోట్ల అమ్ముతున్నారు. మామూలుగానే లస్సీలº్ల మ్యాంగో లస్సీ, స్ట్రాబెర్రీ, రోజ్‌, బనానా, బెర్రీ, చాకొలెట్‌ లస్సీ… అంటూ రకరకాల రుచులు ఉంటాయి. అలా మనక్కావాల్సిన ఫ్లేవర్‌ లస్సీని చేసుకుని దాన్ని ఐస్‌పాప్‌లు చేసే మోల్డ్‌లలో పోసి ఫ్రీజర్‌లో పెడితే చాలు, కొన్ని గంటల్లో నచ్చిన పుల్లైస్‌ రెడీ. ఈ కాలంలో మామిడి పండ్లు బాగా దొరుకుతాయి కాబట్టి చిక్కటి పెరుగుకి మామిడి ముక్కలు, కుంకుమ పువ్వు, డ్రైఫ్రూట్‌లు కలిపి మిక్సీలో వేసి, ఆ లస్సీతో ఐస్‌ పాప్‌లను చేస్తే ఆ రుచే వేరు. ఇలా పండ్లూ డ్రై ఫ్రూట్‌లతో చేసే లస్సీల వల్ల మజ్జిగతో పాటు, పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలూ ఉంటాయి. పైగా మామూలుగా పండ్లను తినడానికి మారాం చేసే పిల్లలు కూడా పుల్లైస్‌లనైతే ఎంచక్కా చప్పరించేస్తారు. ఇలాగే, మజ్జిగతోనూ ఐస్‌పాప్‌లను చేసుకోవచ్చు. దీన్లోనూ పంచదార లేదా ఉప్పు వేసిన మామూలు మజ్జిగతో చేసే పాప్స్‌కిల్స్‌తో పాటు, లెమన్‌, పుదీనా బటర్‌మిల్క్‌, మసాలా చాస్‌లాంటి కొత్త రుచులూ ఉన్నాయి. మసాలా చాస్‌ పుల్లైస్‌ల కోసం పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, పుదీనా, కరివేపాకు, కొత్తిమీరలను పేస్ట్‌ చేసి మజ్జిగలో కలుపుతారు. తర్వాత జీలకర్రపొడి, చాట్‌మసాలా కూడా వేసి మజ్జిగను ఐస్‌పాప్‌ లేదా కుల్ఫీ మోల్డ్‌లలో పోసి ఫ్రీజర్‌లో ఉంచుతారు. గడ్డకట్టాక ఈ మోల్డ్‌లను తీసి, అర నిమిషం వేడి నీళ్లలో ఉంచితే ఐస్‌ పాప్‌లు మోల్డ్‌లో నుంచి సులభంగా వచ్చేస్తాయి. ఇంకేముందీ… పిల్లలతో కలసి పెద్దలూ ఎంచక్కా తినేయొచ్చు. ఆరోగ్యంగానూ ఉండొచ్చు.