Business

పెరిగిన బంగారం ధర – వాణిజ్యం

పెరిగిన బంగారం ధర – వాణిజ్యం

* కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల అమలుపై ట్విటర్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ వీటిని జారీ చేసింది. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో జూన్‌ 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వార్తా సమాచార దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకోవాలన్న అంశంపై ట్విటర్‌ ప్రతినిధి ప్రణాళికతో రావాలని కమిటీ తెలిపింది. ‘‘సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకొని డిజిటల్‌ స్పేస్‌లో మహిళల భద్రతకు రక్షణ కల్పించే అంశంపై ట్విటర్‌ ప్రతినిధి ఉద్దేశాలను తెలుసుకొంటాం’’ అని పార్లమెంటరీ కమిటీ అజెండా పేర్కొంది.

* ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ సంస్థ హాప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మంగళవారం విపణిలోకి రెండు కొత్త ఇ-స్కూటర్‌లను తీసుకొచ్చింది. మొత్తం ఐదు వాహనాలను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, ఇందులో ఒక ఇ-బైక్‌ కూడా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన వాటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అంతేకాదు, వివిధ నగరాలు, పట్టణాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని హాప్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా జైపూర్‌లో ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. త్వరలోనే మిగిలిన ప్రాంతాల్లోనూ వీటిని సిద్ధం చేయనుంది.

* బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై సోమవారం రూ.441 తగ్గగా.. ఈరోజు పెరుగుదల నమోదైంది. దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం 10గ్రాముల పసిడి ధరపై రూ.303లు పెరగడంతో 47,853కి చేరింది. గత ట్రేడింగ్‌లో పసిడి ధర రూ.47,550గా ముగిసింది. మరోవైపు, వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి నిన్న రూ.70,127 ఉండగా.. ఈ రోజు పై రూ. 134లు పెరగడంతో రూ.70,261కి చేరింది.

* దేశీయ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజులు లాభాల బాట పట్టిన సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 16వేల మార్క్‌కు మరింత చేరువైంది.

* భారత్‌లో కరోనా వైరస్‌ ప్రళయం తగ్గే కొద్దీ మెల్లగా ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోంది. తాజాగా దేశంలో నిరుద్యోగ రేటు కూడా కొంత తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్‌ 13నాటికి లెక్కగట్టిన గణాంకాల ప్రకారం నిరుద్యోగ రేటు 13.6శాతం నుంచి 8.7శాతానికి తగ్గింది. ఈ గణాంకాలను ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ ప్రైవేటు లిమిటెడ్‌’ సంస్థ లెక్కగట్టింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 14.4శాతం నుంచి 9.7శాతానికి పడిపోయింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇది 13.3 నుంచి 8.2కు చేరింది.