Politics

నిర్మలపై కేటీఆర్ విసుర్లు

నిర్మలపై కేటీఆర్ విసుర్లు

కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్‌ భారత్‌ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించి ఏడాదవుతున్నా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు ఎలాంటి సాయం అందలేదని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్ర తయారీ రంగానికి వెన్నెముకగా నిలుస్తున్న ఎంఎస్‌ఎంఈలకు ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వపరంగా గట్టి ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 80 శాతానికిపైగా పరిశ్రమలు లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, 25 శాతానికి పైగా తమ రాబడులను పూర్తిగా కోల్పోయాయన్నారు. గత ఏడాది ప్రకటించిన ఆత్మనిర్భర్‌ సహాయ ప్యాకేజీలో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నందున దానిని పునర్‌ నిర్వచించి కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాలు, ఎంఎస్‌ఎంఈలకు వీలైనంత ఎక్కువ చేయూత అందించేలా చూడాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా నష్టాలను భరించేలా భారీ ఆర్థిక గ్రాంట్‌ ఇవ్వాలన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు గురువారం లేఖ రాశారు.