NRI-NRT

పీవీకి భారతరత్న…ఆయన పేరిట ఒక జిల్లా

పీవీకి భారతరత్న…ఆయన పేరిట ఒక జిల్లా

ప్రజల పట్ల ప్రేమతో అంకితభావంతో పని చేసిన స్ఫూర్తిప్రదాత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యురాలు, పీవీ కుమార్తె సురభి వాణీదేవి అన్నారు. పీవీ ఖ్యాతి ఈ తరానికి చాటిచెప్పాల్సిన అవసరముందని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో పీవీ శతజయంతి ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. న్యూజీలాండ్ లోని మోటార్ కేడ్ లో పీవీ శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో సురభి వాణీదేవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. పీవీ ఉత్సవాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు. పీవీ అంటే సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం అని… అందుకే ఏడాది పాటు స్మరించుకునేలా ఉత్సవాలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. దేశవిదేశాల ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. పీవీ జీవితమే మార్గదర్శకత్వం అని అన్నారు. ఉపాధ్యాయురాలిగా ఎంతో మందిని చూసినప్పటికీ… పీవీ లాంటి వ్యక్తిత్వాన్ని చూడలేదని కొనియాడారు. పీవీ నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకునే వారని, రాజకీయనేతగా, ప్రధానిగా తన పదవికి పరిమితం కాకుండా… ఎన్నో విషయాల పట్ల అవగాహన కలిగి ఉండేవారని తెలిపారు. వివిధ రంగాల్లో ఎంతో ప్రతిభ కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని వివరించారు. విషయ పరిజ్ఞానం ఎంత ఉన్నా… ఎదుటి వ్యక్తి చెప్పేది వినడం, అవతలి వ్యక్తి దృక్పథం తెలుసుకోవడం, నేర్చుకోవడం పీవీ గొప్ప గుణమని వాణీదేవి అన్నారు. మితాహారం, మితభాషణం, సమయ పాలన, జ్ఞాపకశక్తి పీవీ విశేష లక్షణాలు అని తెలిపారు. ఒక వ్యక్తిని 30 ఏళ్ల తర్వాత గుంపులో చూసినా… పేరు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి పీవీ సొంతమని చెప్పారు. సమయపాలనకు పీవీ నిదర్శనమని, వేకువజామునే 4 గంటలకు నిద్ర లేచే వారని తెలిపారు. పుస్తక పఠనం, అధ్యయనం మాత్రమే ఆయనను ఉన్నతస్థానాలకు తీసుకెళ్లాయని అన్నారు. పీవీ చదువును, అక్షరాన్ని నమ్ముకున్నారు కాబట్టే ఆయన ఖ్యాతి క్షరం కాకుండా స్థిరస్థాయిగా నిలిచి ఉందని తెలిపారు. పీవీకి ఏ పదవి అయినా అందరి ఏకాభిప్రాయంతోనే వచ్చినవేనని చెప్పారు. సన్యాసం స్వీకరిద్దామని సిద్ధపడ్డ తరుణంలో ప్రధాని పదవి రావడంతో… ప్రజలకు ఏదో చేయాల్సి ఉందన్న నిష్టతో పని చేసిన ధార్మికుడు పీవీ అని గుర్తుచేశారు. అద్భుతమైన పాలనతో నవభారత ఆర్థిక సంస్కర్తగా, స్థితప్రజ్ఞగా పీవీ నరసింహారావు ఖ్యాతి చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు.

– పీవీ నిరంతర సంస్కరణశీలి: మహేశ్ బిగాల
ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కన్వీనర్, శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల సమన్వయకర్తగా వ్యవహరించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. పీవీ నరసింహారావు ఒక వ్యక్తి కాదని… అలాంటి మహనీయుడిని స్మరించుకోవడానికి ఏడాది కూడా సరిపోదని అన్నారు. పీవీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని కొనియాడారు. పీవీ సంస్కరణల కారణంగానే ఎంతో మంది విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉండేందుకు అవకాశం లభించిందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, కెనడా, జర్మనీ, కువైట్, డెన్మార్క్ సహా… 50కి పైగా దేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పీవీ ఖ్యాతిని చాటేందుకు శత జయంతి ఉత్సవాల తర్వాత కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత దేశ ఆధునిక చాణక్యుడిగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ కీర్తి గడించారని తెలిపారు. ఏ రంగంలో బాధ్యతలు అప్పగించినా సంస్కరణలు చేపట్టిన ఘనత పీవీ సొంతమని వివరించారు. కేవలం అప్పగించిన బాధ్యతల్ని నిర్వహించడం కాకుండా… ఆయా రంగాల్లో సంస్కరణలు తీసుకురావడం పీవీ ప్రత్యేకత అని తెలిపారు. ప్రధానిగా ఉన్నప్పుడు విపక్షాలకు సముచిత గౌరవం ఇవ్వడం గొప్ప విషయం అని అన్నారు. ఆనాడు పీవీ తీసుకువచ్చిన భూ సంస్కరణల తర్వాత… భూముల విషయం గురించి మళ్లీ ఆలోచించింది… కేసీఆర్ మాత్రమే అని కొనియాడారు. పీవీకి భారతరత్న వచ్చేలా ప్రభుత్వంతో పాటు… పౌర సమాజం కూడా గళమెత్తాలని సూచించారు.

– పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలి: న్యూజీలాండ్ ప్రతినిధులు
పీవీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా న్యూజీలాండ్ ప్రతినిధులు పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన వివిధ సంఘాల ప్రతినిధులు… పీవీ ఖ్యాతిని, అనుబంధాన్ని స్మరించుకున్నారు. పీవీ మన కాలం చాణక్యుడు అని అన్నారు. విద్యార్థిగా నిజాం వ్యతిరేక పోరాటం పాల్గొనడం నుంచి ప్రధాని స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగారని స్మరించుకున్నారు. పీవీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టారని, నాటి సంస్కరణలే నేడు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు. పీవీ పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 360 కోణాల వ్యక్తిత్వం ఉన్న మనిషి గురించి తెలుసుకుని… ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరముందని అన్నారు. ఉత్సవాల ద్వారా పీవీ గురించి సమగ్రంగా తెలుసుకునే అవకాశం లభించిందని తెలిపారు. పీవీ జీవితం వ్యక్తిత్వ వికాస గ్రంథమని, ఆయన మాటలు స్ఫూర్తి మంత్రాలని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడు కాలమే సమాధానం చెబుతుందని… అందుకోసం ఎదురుచూడాలని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని, కొన్నిసార్లు నిర్ణయం తీసుకోకపోవడమే నిర్ణయం అంటూ.. ఇలా పీవీ ఇచ్చిన ఎన్నో సందేశాలు ఆలోచనాత్మకంగా ఉంటాయని కొనియాడారు. ప్రగతిశీల ఆలోచన విధానం కలిగిన రాజనీతిజ్ఞుడు పీవీ గురించి నేటి తరానికి పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరముందని తెలిపారు. కార్యక్రమంలో న్యూజీలాండ్ తెలుగు సంఘాల ప్రతినిధులు ఒడ్నాల జగన్ మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డితో ARUN PRAKASH REDDY, RAMA RAO Rachakonda, Vijay Kosna, and Kalyan Kasuganti and Narender Reddy patlola పాటు పలువురు పాల్గొన్నారు.