Health

క్రికెట్ ఆడి కరోనా అంటించుకున్న 35మంది-TNI కోవిద్ బులెటిన్

క్రికెట్ ఆడి కరోనా అంటించుకున్న 35మంది-TNI కోవిద్ బులెటిన్

* హైదరాబాద్‌లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్‌లో ఈ టెస్టింగ్ సెంటర్ అత్యవసరమని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటు చేస్తే నెలకి సుమారు 8నుంచి 10 కోట్ల డోసులను అదనంగా ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే రానున్న ఆరు నెలల్లో హైదరాబాద్ నుంచి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

* యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఒకేసారి 35 మంది యువకులకు కరోనా సోకడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వీరంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్ మ్యాచ్ ఆడగా అక్కడ ఒకరి నుండి మరొకరికి ఇది వ్యాప్తి చెందినట్లుగా అధికారులు నిర్ధారించారు. బీబీ నగర్ మండలంల ముగ్ధంపల్లి గ్రామంలో ఈ కరోనా కలకలం రేపింది.

* కరోనా మహమ్మారి ఆ కుటుంబంపై పగ పట్టింది.ఫలితంగా ఒకే ఇంట్లో అయిదుగురుని బలి తీసుకుంది.12 సంవత్సరాల మేడిచర్ల సాయి సత్య సహర్ష అనాథగా మిగిలాడు.మొన్నటి వరకూ అమ్మా, నాన్న, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య పంచన గారాల బాబుగా ముద్దూ మురిపాలు అందుకున్న ఆ పసివాడికి కరోనా ఒక్క సారిగా అన్నీ దూరం చేసేసింది.రాజనగరం సమీపంలోని గైట్ కాలేజీ ఎదురుగా బ్రిడ్జి కౌంట్ లో నివాసం ఉంటున్న మెడిచర్ల వి సుధీర్ రాయల్, శ్వేత హరితల ఏకైక కుమారుడు సాయి సత్య సహర్ష.రాజమహేంద్రవరం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు.

* ఆంధ్రప్రదేశ్‌లో మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్‌ నడుస్తోంది. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.02 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. తూ.గో. జిల్లాలో అత్యధికంగా 1.12 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ వేశారు. కాగా, కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్‌ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం… ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది.

* కరోనావైరస్ కట్టడి చర్యలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలలో భాగంగా ది.20.06.2021 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు, అదేవిధంగా ది.21.06.2021 వ తేదీ నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే తెలంగాణ వైపు నుండి వచ్చే వాహనాలు ఆంధ్ర బోర్డర్ గరికపాడు వద్ద అనుమతించబడును, ఆ తర్వాత వచ్చే ఎటువంటి వాహనాలు ఆంధ్రా లోకి అనుమతించబడవు.కావున తెలంగాణ వైపు నుండి వచ్చే ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలసిందిగా నందిగామ డీఎస్పీ ఘ్. నాగేశ్వర్ రెడ్డి గారు, జగ్గయ్యపేట సీఐ ఫ్.చంద్రశేఖర్ రావు గారు,చిల్లకల్లు ఎస్సై వాసా వెంకటేశ్వరరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.

* కరోనా వైరస్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపింది.