Business

10గ్రా పసిడి ₹46277-వాణిజ్యం

10గ్రా పసిడి ₹46277-వాణిజ్యం

* కారు కొన‌డం చాలా మంది కల. దాన్ని సాకారం చేసుకోవడానికి పెద్ద మొత్తంలో పెట్టాల్సి వస్తుంది. దీనికి స‌రైన ప్ర‌ణాళిక అవ‌స‌రం. అందుకే కొందరు.. కారు కొనుగోలు ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి సెకండ్ హ్యాండ్‌వైపు మొగ్గు చూపుతారు. ఇదో విధంగా తెలివైన పనే. ఎందుకంటే నచ్చిన కారును తక్కువ మొత్తానికే సొంతం చేసుకోవచ్చు. చాలా మందికి సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలుకూ బ్యాంకులు రుణాలిస్తాయనే విషయం తెలీదు. అయితే, దీనికి కొన్ని నిబంధనలు, షరతులు ఉంటాయి. అవేంటో, వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.కొత్త కార్ల కొనుగోలుకు రుణాలిచ్చినట్లే వీటి కొనుగోలుకు కూడా బ్యాంకులు రుణాలిస్తాయి. కాకపోతే కాస్త ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. కొన్ని నిబంధనలూ ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని రుణ సంస్థ‌లు ఈ రుణాల‌ను తయారైన 3 ఏళ్లలోపు ఉన్న కార్లకు మాత్రమే రుణాలిస్తాయి. మరికొన్ని 5 ఏళ్ల వరకు అందిస్తున్నాయి. అలాగే, చాలా రుణ సంస్థ‌లు కారు విలువ‌లోని 60శాతం వ‌ర‌కు మాత్ర‌మే రుణంగా అందిస్తాయి. మిగిలిన మొత్తాన్ని కారు కొంటున్న‌వారే సొంతంగా భ‌రించాలి. రుణం ఇచ్చేట‌ప్పుడు కూడా ఆయా వ్య‌క్తుల క్రెడిట్ స్కోర్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 వరకు బ్యాంకులు ఈ తరహా రుణాలు అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు 7.3 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి.

* అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం కాస్త పెరిగింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.250లు పెరగడంతో రూ.46,277కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ. 46,027గా ఉంది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు పుంజుకోవడం, రూపాయి విలువ తగ్గడంతో పసిడి ధర పెరిగినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. మరోవైపు, వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండిపై రూ.258లు పెరగడంతో కిలో వెండి ధర సోమవారం రూ.66,842కి చేరింది.

* అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరకు లాభాల్లో ముగియడం విశేషం. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ ఓ దశలో ఏకంగా 889 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఉదయం 51,887 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ 51,740 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 230 పాయింట్ల లాభంతో 52,574 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ కొనసాగించింది. రోజులో 15,765-15,505 మధ్య కదలాడిన సూచీ చివరకు 63 పాయింట్లు లాభపడి 15,746 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.05 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడాయి. వీటితో పాటు దేశీయంగా కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో దేశీయ సూచీలు ఈరోజు తొలి భాగంలో నష్టాల బాటపట్టాయి. చివరకు ఇంధన, స్థిరాస్తి, బ్యాంకింగ్‌, ఆర్థిక, ఇన్‌ఫ్రా రంగాల షేర్ల నుంచి మద్దతు లభించడంతో అనూహ్యంగా పుంజుకున్నాయి.

* బ్యాంకింగ్‌ సేవలను పొందడం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడడం, ఆన్‌లైన్‌ చెల్లింపులు, యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇలాంటి సేవలన్నీ పొందాలంటే.. మీ పాన్‌ను ఆధార్‌ను జత చేయాల్సిందే. లేకపోతే.. ఈ సేవలకు విఘాతం కలిగే ఆస్కారం ఉంది. దీంతోపాటు.. మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండు, ఇతర ఆదాయాలపైనా అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం ఉంది. ఒకసారి ఇలా విధించిన పన్నును తిరిగి వెనక్కి తీసుకునే అవకాశమూ ఉండదు.ఆదాయపు పన్ను శాఖ ఇటీవల మార్చిన నిబంధనల మేరకు ప్రతి జులై 1 నుంచి ప్రతి పాన్‌.. ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. లేకపోతే ఆ పాన్‌ చెల్లదు. కాబట్టి, మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) చేసేవారు ఇలాంటి పాన్‌ ఉన్న వారికి 20శాతం వరకూ పన్ను విధించాల్సి ఉంటుంది. అయితే టీడీఎస్‌ చేయని ఆదాయాలకు ఇది వర్తించదు. మీ పాన్‌ను ఆధార్‌తో జత చేసిన సమాచారాన్ని బ్యాంకులు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకూ సమాచారం ఇవ్వడమూ మంచిదే. జులై 1 తర్వాత ఆధార్‌ అనుసంధానం కాని పాన్‌ ఉన్న వారికి రూ.10వేల జరిమానా విధించే అవకాశమూ ఉంది. కాబట్టి, వీలైనంత తొందరగా వ్వ్వ్.ఇంచొమెతక్ష్.గొవ్.ఇన్ పోర్టల్‌లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయండి. ఇప్పటికే మీరు ఈ రెండింటినీ జత చేసుకున్నా.. మరోసారి ఇఫైలింగ్‌ వెబ్‌సైటులోకి వెళ్లి, తనిఖీ చేసుకోవడం మంచిది. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. పాన్‌, ఆధార్‌లో పుట్టిన తేదీ వేర్వేరుగా ఉంటే.. అనుసంధానం కుదరకపోవచ్చు. పేరులో తప్పులున్నా సాధ్యం కాదు.