Health

GHMCలో అత్యధిక కేసులు-TNI కోవిద్ బులెటిన్

GHMCలో అత్యధిక కేసులు-TNI కోవిద్ బులెటిన్

* తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,19,537 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈసారి కూడా జీహెచ్ఎంసీ (137) పరిధిలోనే అత్యధిక కేసులు వచ్చాయి. జిల్లాల్లో ఎక్కడా 100కు మించి కరోనా కేసులు నమోదు కాలేదు. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 1 పాజిటివ్ కేసు గుర్తించారు. అదే సమయంలో 1,707 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,576కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,14,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,93,577 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 17,246 మంది చికిత్స పొందుతున్నారు.

* నగరంలో ఆయుష్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం బందరు రోడ్డులో ఆయుర్వేద వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయుష్ కమిషనర్ వి.రాములు ప్రారంభించారు. అనంతరం వి.రాములు మాట్లాడుతూ..కరోనా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. నెల రోజుల పాటు ఉచిత‌ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈరోజు నుండి‌ జులై 21 వరకు వివిధ ప్రాంతాలలో మందులను కూడా పంపిణీ చేస్తామని అన్నారు. కరోనాపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని..అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో ఆయుర్వేదం మందులు బాగా పని చేశాయని… వీటిపై అనుమానాలు, అపోహలు తొలగించుకోవాలన్నారు.

* అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈరోజు దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. నేడు ప్ర‌పంచ‌మంతా క‌రోనాతో పోరాడుతోంద‌ని, ఈ మ‌హమ్మారిని ఓడించ‌గ‌ల‌మ‌నే న‌మ్మ‌కాన్ని యోగా అందిస్తున్న‌ద‌న్నారు. ఒత్తిడి త‌గ్గించ‌డంలో, శారీర‌క బ‌లాన్నిపెంపొందింప‌జేయడంలో యోగా కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్నారు. ప‌బ్లిక్ హెల్త్ కేర్ విష‌యంలోనూ యోగా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.

* కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌తో పాటు వైద్యశాఖలో నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి(కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరు.