Business

వరంగల్‌కు మెట్రో. భగ్గుమంటున్న పెట్రో ధరలు-వాణిజ్యం

వరంగల్‌కు మెట్రో. భగ్గుమంటున్న పెట్రో ధరలు-వాణిజ్యం

* ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు కొనసాగుతున్నది.మంగళవారం చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 28 పైసల వరకు పెంచాయి.తాజా పెంపుతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి పెరిగాయి.తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.50, డీజిల్‌ రూ.88.23కి పెరిగింది.ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ రూ.103.63కు చేరింది.రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, జమ్మూకాశ్మీర్‌, లద్దాఖ్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను ధాటింది.దేశంలో అత్యధికంగా పాక్‌కు సమీపంలో ఉన్న రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ఫిబ్రవరిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. ఈ నెల ప్రారంభంలో డీజిల్‌ సైతం రూ.100 మార్క్‌ను చేరింది.దేశంలోనే అత్యధికంగా ప్రస్తుతం రూ.108.37, డీజిల్‌ రూ.101.12కు పెరిగింది.ఇప్పటి వరకు మే 4 తర్వాత నుంచి ఇప్పటి వరకు 29సార్లు ధరలు పెరిగాయి.వరుసగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు.

* గత వారం భారీగా బంగారం ధరలు పడిపోయిన తర్వాత నేడు భారతీయ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎంసిఎక్స్ లో 10 గ్రాముల గోల్డ్ ధర 0.24% పెరిగి రూ.47,185 చేరుకుంటే, సిల్వర్ ధర 0.05% తగ్గి కిలోకు రూ.67,730గా ఉంది. ఈ నెలలో బంగారం ధర భారీగానే తగ్గింది. జూన్ 1న రూ.49,500గా ఉన్న ధర నేడు రూ.47,000లకు చేరుకుంది. అంటే కేవలం 21 రోజుల్లో రూ.2,500 వరకు తగ్గింది అన్నమాట. అంతర్జాతీయ మార్కెట్లలో, బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నేడు బంగారం ఔన్స్ ధర 1,784.14 డాలర్లుగా ఉంది.

* జెట్‌ ఎయిర్‌వేస్‌ను బిడ్డింగ్‌లో దక్కించుకున్న కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కొన్ని షరతులతో ఆమోదం తెలిపింది. ఈ విమానయాన సంస్థ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా విమానాశ్రయాల్లో స్లాట్ల కేటాయింపునకు పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ)కు ఎన్‌సీఎల్‌టీ 90 రోజుల గడువు ఇచ్చింది.

* ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు గుజరాత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేడు ఈ-వేహికల్ పాలసీ-గుజరాత్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2021ను విడుదల చేశారు. కొత్త పాలసీ గురించి రాష్ట్ర సమాచార శాఖ ఈ విదంగా తెలిపింది. రాబోయే నాలుగు సంవత్సరాలలో గుజరాత్ రోడ్లపై 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను చూడాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గుజరాత్ ఎలక్ట్రిక్ వాహన విధానం 2021ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. టూ వీలర్, ఫోర్ వీలర్ ఈ-వాహనాలను భారీగా ప్రోత్సాహకలను ప్రకటించింది.

* ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులో ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌ లింక్‌ ప్రోగ్రాం మరికొద్ది రోజుల్లోనే చరిత్ర సృష్టించనుంది. స్టార్‌లింక్‌ ప్రోగాంతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను అందించడానికి స్టార్‌లింక్‌ కృషి చేస్తోంది. కాగా ప్రస్తుతం స్టార్‌ లింక్‌ సేవలు కేవలం 11 దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. స్టార్‌లింక్‌ కవరెజీని ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తోందని మంగళవారం జరిగిన మాక్వేరీ గ్రూప్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ లో స్పేస్‌ఎక్స్‌ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గ్విన్‌ షాట్‌వెల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

* తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో నియో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు సమగ్ర నివేదికను సిద్ధం చేసింది మహామెట్రో సంస్థ. వరంగల్‌ నుంచి హన్మకొండ మీదుగా కాజీపేట వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే నియోమెట్రోకు రూ. 1000 కోట్లు ఖర్చవుతాయని లెక్క తేలింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపింది కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ.