Health

ఇండియాలో 40సరికొత్త డెల్టా ప్లస్ కేసులు-TNI కోవిద్ బులెటిన్

ఇండియాలో 40సరికొత్త డెల్టా ప్లస్ కేసులు-TNI కోవిద్ బులెటిన్

* దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రకం వైరస్‌ ఇప్పటికే పలు రాష్ట్రాలకు పాకగా.. 40కి పైగా కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 21 ‘డెల్టా ప్లస్‌’ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో ఆరు, కేరళలో మూడు, తమిళనాడులో మూడు కేసులు బయటపడ్డాయి. ఇక పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లోనూ ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. మరోవైపు ‘డెల్టా ప్లస్‌’ రకాన్ని ఆందోళనకర రకం (వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌)గా పేర్కొంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిలో సంక్రమణశక్తి పెరగడం, ఊపరితిత్తుల కణాల్లోని గ్రాహకాలతో గట్టిగా బంధాన్ని ఏర్పరచడం, మోనాక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 కన్సార్షియం ఆన్‌ జీనోమిక్స్‌(ఇన్సాకాగ్‌) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ సహా 10 దేశాల్లో డెల్లా ప్లస్‌ రకం కేసులు వెలుగుచూశాయి. భారత్‌లో ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అడ్వయిజరీలు జారీ చేసింది. ఈ వేరియంట్‌ నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా ఉద్ధృతి అదుపులోకి వస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 50వేల కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. అటు రికవరీలు కూడా భారీగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో 6.4లక్షల మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.

* రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై జీవో జారీ చేశామని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదించారు. 170 ప్రైవేటు ఆస్పత్రులపై 350 ఫిర్యాదులు వచ్చాయని.. 30 ఫిర్యాదులు పరిష్కరించి బాధితులకు రూ.72.20లక్షలు వెనక్కి ఇప్పించామని వివరించారు. మిగతా బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డీహెచ్‌ హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో రోజుకు సరాసరి 1.17లక్షల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, పాజిటివిటీ రేటు 1శాతానికి తగ్గిందని డీహెచ్‌ తన నివేదికలో పేర్కొన్నారు.

* ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈమేరకు జీవో 40ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ జారీ చేసింది. ‘‘సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్ఠంగా ₹4వేలు, ఐసీయూ గదిలో రోజుకు గరిష్ఠంగా ₹7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్ఠంగా ₹9వేలు, పీపీఈ కిట్‌కు ₹273, హెచ్ ఆర్ సీటీ- ₹1,995, డిజిటల్ ఎక్స్ రే- ₹1300, ఐఎల్6- ₹1300, డీడైమర్- ₹300, సీఆర్‌పీ- ₹500, ప్రొకాల్ సీతోసిన్- ₹1400, ఫెరిటీన్- ₹400, ఎల్ డీహెచ్- ₹140, సాధారణ అంబులెన్సుకు కనీస ఛార్జి ₹2వేలు- కి.మీకు ₹75’’ ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

* భారత్‌లో కరోనా కేసులు మూడు కోట్ల మార్కును దాటాయి. గతేడాది జనవరి 30న మనదేశంలో తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెండుదశల్లో మహమ్మారి విజృంభించింది. ప్రస్తుతం రెండోదఫా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది. తాజాగా 19,01,056 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 50,848 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 19 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న మరో 1,358 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ముందురోజు కంటే మరణాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం మొత్తం కేసులు మూడు కోట్ల మార్కును దాటగా.. 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రదేశం అమెరికా తరవాత ఆ స్థాయిలో కేసులు నమోదైంది ఒక్క మనదేశంలోనే. క్రియాశీల కేసులు 6.4లక్షలకు తగ్గగా.. ఆ రేటు 2.21 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 96.5 శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజే 68,817 మంది కోలుకున్నారు. మొత్తంగా 2.9కోట్ల మంది వైరస్‌ను జయించి ఇంటికి చేరుకున్నారు. మరోపక్క నిన్న 54,24,374 మందికి టీకా అందింది. ఇప్పటివరకు 29కోట్ల 46లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.