Business

2 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటిన మైక్రోసాఫ్ట్-వాణిజ్యం

2 ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటిన మైక్రోసాఫ్ట్-వాణిజ్యం

* మైక్రోసాఫ్ట్‌ సిఇఒగా సత్య నాదేళ్ల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ కంపెనీ షేరు పరుగులు పెడుతోంది. అదే విధంగా కంపెనీ విలువ అమాంతం పెరుగుతోంది. మంగళవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజిలో కంపెనీ షేరు ధర 1.2 శాతం పెరగడంతో మైక్రోసాఫ్ట్‌ కాపిటలైజేషన్‌ విలువ రెండు ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.150 లక్షల కోట్లు)కు చేరింది. ముఖ్యంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యాపారంలో అద్భుతమైన పురోభివృద్ధి సాధించడంతో కంపెనీ విలువ ఇటీవల గణనీయంగా పెరిగింది. 2014లో సత్యా నాదేళ్ల బాధ్యతలు చేపట్టే నాటికి కంపెనీ విలువ 310 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2019 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు (రూ.75 లక్షల కోట్లు)కు చేర్చారు. ఆ తర్వాత రెండేళ్లలోనే మరో ట్రిలియన్‌ డాలర్ల సంపదను జోడించారు. గతేడాది 24 శాతం వృద్థిని నమోదు చేసింది.

* 2019లో దేశంలో జనన, మరణాలకు సంబంధించిన తాజా జనాభా లెక్కలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లు.2019లో 2.67 కోట్ల జననాలు నమోదు కాగా, 83 లక్షల మంది చనిపోయారు. నిమిషానికి సగటున 51 మంది శిశువులు జన్మిస్తుంటే, 16 మంది కన్నుమూస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ జనాభా 5.23 కోట్లుగా, తెలంగాణ జనాభా 3.72 కోట్లుగా నివేదిక పేర్కొంది.లింగ నిష్పత్తిలో ఏపీ 16వ స్థానంలో ఉండగా, తెలంగాణ ఏడో స్థానంలో ఉంది.ఆంధ్రప్రదేశ్‌లో జననాల్లో కర్నూలు ముందుండగా, మరణాల్లో తూర్పుగోదావరి జిల్లా ముందున్నాయి.2019లో ఏపీలో 7,54,939 మంది జన్మించారు. 4,01,472 మంది మరణించారు. మరణించిన వారితో పోలిస్తే జన్మించిన వారి సంఖ్య 88 శాతం అధికం.కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం 2019 మధ్య నాటికి ఏపీ మొత్తం జనాభా 5,23,15,000.

* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌ రుమయాన్‌ రిలయన్స్‌ బోర్డులోకి వస్తున్నారు. ఈ మేరకు రిలయన్స్‌ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఫైనాన్స్‌, టెక్నాలజీలో యాసిర్‌ అల్‌ రుమయాన్‌ ప్రముఖ వ్యక్తి. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన సౌదీ ఆరామ్‌కో ఛైర్మన్‌గా ఆయన అనుభవం నుంచి ప్రయోజనం పొందుతామనే విశ్వాసం మాకుంది. రిలయన్స్‌ బోర్డులో ఆయన చేరిక.. రిలయన్స్‌ ప్రపంచీకరణలో మొదటి అడుగుగా భావిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో రిలయన్స్‌ ఎదుగుదలకు ఇది ప్రారంభం. భవిష్యత్తులో ఆ ప్రణాళికలు రానున్నాయి. ఆయనను సాదరంగా బోర్డులోకి ఆహ్వానిస్తున్నాం’’ అని ముకేశ్ తెలిపారు.

* దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా వంటి ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీనికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు కూడా రాణించడంతో సెన్సెక్స్‌ 392.92 పాయింట్లు లాభపడి 52,699 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 103..50 పాయింట్లు లాభపడి 15,790.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.18గా ఉంది.

* టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో భారీగా లాభపడ్డాయి. ఒక దశలో 2.5శాతం వరకు పెరిగి రూ.1,539.90కి చేరాయి. ఇటీవల ఇన్ఫోసిస్‌ రూ.9,200 కోట్ల విలువైన షేర్లను ఓపెన్‌ రూట్‌లో బైబ్యాక్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ శుక్రవారం నుంచి మొదలు కానుంది. దీంతో ఈ షేర్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. గత నెల రోజుల్లో ఈ కంపెనీ షేరు విపరీతంగా పెరిగింది. నెల రోజుల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5శాతం పెరిగితే అదే సమయంలో ఇన్ఫీ షేరు 14 శాతం పెరిగింది. నేటి ఉదయం 11 గంటల సమయంలో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువ రూ.6.5లక్షల కోట్లను దాటేసింది.