Business

జగన్‌కు అదిరే షాక్ ఇచ్చిన రిలయన్స్-వాణిజ్యం

జగన్‌కు అదిరే షాక్ ఇచ్చిన రిలయన్స్-వాణిజ్యం

* తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ తలపెట్టిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ వెనక్కి తగ్గింది. ఏపీ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ) తమకు కేటాయించిన భూములను వెనక్కి ఇచ్చేసింది. రిలయన్స్‌ సంస్థ భూములను వెనక్కి ఇచ్చిన విషయాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్‌ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. దీంతో భూముల కోసం ఆ సంస్థ డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.తిరుపతిలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో సెట్‌టాప్‌ బాక్సులు, ఇంటర్నెట్‌ వినియోగానికి అవసరమైన డాంగిల్స్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రిలయన్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం రిలయన్స్‌ సంస్థకు 136 ఎకరాలను కేటాయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాకే అందులో 75 ఎకరాలను అప్పగించింది. అయితే రిలయన్స్‌కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు వివిధ కారణాలతో కోర్టులో కేసులు వేశారు.
ప్రస్తుతం ఆ భూములకు సంబంధించి సమారు 50 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్‌ ఏర్పాటు చేయటానికి అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించారు. ఇదే విషయమై సంప్రదింపులు జరిపినా సంస్థ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ఇటీవల ఆ భూములనే తిరుమల దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించిందిఈ నేపథ్యంలోనే సెట్‌టాప్‌ బాక్సుల అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను రిలయన్స్‌ సంస్థ విరమించుకుంది. సంస్థ అవసరాల మేరకు సెట్‌టాప్‌ బాక్సుల తయారీకి ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తమ అధికారులు జరిపిన చర్చల సందర్భంగా… ఇప్పుడు రాష్ట్రంలో యూనిట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు చెప్పినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు

* కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు వైద్య కళాశాలలు, 15 నర్సింగ్‌ కాలేజీల్లో 10 వేలకు పైగా కొలువులు రానున్నాయి. రెగ్యులర్‌ ప్రాతిపదికన 7,727 మందిని నియమిస్తారు. ఈ మేరకు పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి ముందు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, ఆర్థిక శాఖల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. మంజూరు చేసిన పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ సర్వీసు నిబంధనలు వర్తిస్తాయని వివరించారు. ఈ వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీల్లో 3,035 మందిని అవుట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించుకునేందుకు ప్రభుత్వం బుధవారం అనుమతించిన విషయం తెలిసిందే. ఏడు వైద్య కళాశాలల్లో 2,135 మందిని, 15 నర్సింగ్‌ కళాశాలల్లో 900 మందిని తీసుకోవచ్చని పేర్కొంది.

* సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తన విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం(ఓఎస్‌) శ్రేణిలో తదుపరి ఆవిష్కరణను తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకర్షించే సరికొత్త సదుపాయాలతో విండోస్‌ 11 ఓఎస్‌ను వర్చువల్‌ విధానంలో ఆవిష్కరించింది. 2015లో విండోస్‌ 10ను విడుదల చేసిన తరువాత మైక్రోసాఫ్ట్‌ నుంచి వచ్చిన కీలక ఆవిష్కరణ ఇదే. ‘‘వచ్చే పదేళ్ల వరకూ వినియోగదారుల అవసరాలను తీర్చేలా దీన్ని రూపొందిస్తున్నాం. విండోస్‌ చరిత్రలో ఇదో పెద్ద మైలు రాయి’’ అని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు. విండోస్‌ 11లో స్టార్ట్‌ మెనూ కొత్తగా ఉండబోతోంది. టాస్క్‌బార్‌, ఫాంట్‌, ఐకాన్‌ల విషయంలోనూ సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ ఓఎస్‌ ద్వారా తొలిసారిగా విండోస్‌.. ఆండ్రాయిడ్‌ యాప్‌లను కూడా వినియోగించుకునే సదుపాయం అందించబోతోంది. ఈ ఏడాది చివరికల్లా కొత్త కంప్యూటర్లతో పాటు విండోస్‌ 10 వినియోగదారులకూ కొత్త ఓఎస్‌ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

* మణప్పురం గోల్డ్ సంస్థకు ముప్పై లక్షలు టోకరా వేసిన సైబర్ కేటుగాళ్లు…సంస్థ ఉన్నతాధికారినంటూ హిమాయత్నగర్ బ్రాంచ్ ఉద్యోగులకు ఫోన్ చేసి.. వారి లాగిన్ ఐడీ పాస్వర్డ్ తీస్కుని ముప్పై లక్షలు కాజేసిన కేటుగాళ్లు…ఇద్దరు ఉద్యోగులను బురిడీ కొట్టించిన కేటుగాళ్ళు వారి ఐడీలనుండి లాగిన్ అయి పదిహేను లక్షల చొప్పున కాజేసినట్లు గుర్తించిన సంస్థ ఉన్నతాధికారులు.హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు.