Politics

పోలీసుల దాష్టీకంపై కేసీఆర్ ఆగ్రహం

పోలీసుల దాష్టీకంపై కేసీఆర్ ఆగ్రహం

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో మరియమ్మ మృతిపై కాంగ్రెస్‌ నేతలతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ స్పందించారు. ఎస్సీ మహిళ లాకప్‌డెత్‌ అత్యంత బాధాకరమన్నారు. మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనలో పోలీసుల తీరుపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరియమ్మ మృతిపై విచారణకు ఆదేశించిన సీఎం.. నిజనిర్ధారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే మరియమ్మ మృతికి బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. డీజీపీ స్వయంగా చింతకాని వెళ్లి బాధితులను పరామర్శించి రావాలన్నారు. ఎస్సీల పట్ల సమాజం దృక్పథం మారాలని సీఎం ఆకాంక్షించారు. ఎస్సీలు, పేదల పట్ల పోలీసుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలన్నారు. ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని.. వారికి అన్యాయం జరిగితే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మరియమ్మ కుమారుడు ఉదయ్‌ కిరణ్‌కు రూ. 15 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నివాస గృహం మంజూరు చేస్తామన్నారు. మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.