Business

ఈ పెట్రోమంటలు ఆగేదెప్పుడు?-వాణిజ్యం

ఈ పెట్రోమంటలు ఆగేదెప్పుడు?-వాణిజ్యం

* దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. వరుస పెంపులతో కొత్త రికార్డులను తాకుతున్న చమురు ధరలతో వాహనదారుల గుండెలు గుబేలుమంటున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర సెంచరీ దాటేసి పరుగులు పెడుతోంది. శనివారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు ఉత్పత్తి సంస్థలు మరోసారి పెంచాయి. దీంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104 దాటగా.. హైదరాబాద్‌లో రూ.102కు చేరువైంది. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్‌ ధర రూ.98 దాటేసింది.

* హీరో ఎలక్ట్రిక్‌ కంపెనీ తన ద్విచక్ర వాహనాల ధరలను 33 శాతం వరకు తగ్గించింది. సింగిల్‌ బ్యాటరీ వేరియంట్లకు 12 శాతం నుంచి; ట్రిపుల్‌ బ్యాటరీ ఎన్‌వైఎక్స్‌ హెచ్‌ఎక్స్‌ మోడల్‌కు 33 శాతం వరకు ధర తగ్గిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. తాజా నిర్ణయంతో ఫోటాన్‌ హెచ్‌ఎక్స్‌ మోడల్‌ ధర రూ.79,940 నుంచి రూ.71,449కు; ఎన్‌వైఎక్స్‌ హెచ్‌ఎక్స్‌(ట్రిపుల్‌ బ్యాటరీ) ధర రూ.1,13,115 నుంచి రూ.85,136కు; ఆప్టిమా ఈఆర్‌ ధర రూ.78,640 నుంచి రూ.58,980కు పరిమితం అవుతాయి.

* రక్షణ రంగంలోని మినీ నవరత్న కంపెనీ మిశ్ర ధాతు నిగమ్‌ (మిధాని) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.345.87 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.203.63 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఇదే సమయంలో నికర లాభం రూ.40.14 కోట్ల నుంచి రూ.74.71 కోట్లకు పెరిగింది. 2020-21 మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.813 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019-20లో ఇది రూ.712.88 కోట్లే. గత ఆర్థిక సంవత్సరంలో రూ.166.29 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21లో ఒక్కో షేరుకు రూ.2.78 డివిడెండ్‌ చెల్లిస్తున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్‌ 1, 2021 నాటికి మొత్తం రూ.1353 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నట్లు తెలిపింది.

* విశాఖ ఉక్కు సీఎండీగా అతుల్‌భట్‌ పేరును పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు(పీఈఎస్‌బీ) సిఫారసు చేసింది. ఈ పోస్టు కోసం విశాఖ ఉక్కు డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎ.కె.సక్సేనా, అతుల్‌భట్‌ మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సక్సేనా ముఖాముఖీకి హాజరు కాలేదు. దీంతో అతుల్‌భట్‌ను ఉక్కు సీఎండీ పదవికి సిఫారసు చేసినట్టు పీఈఎస్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈయన దిల్లీ ఐఐటీలో కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఐఐఎం కోల్‌కతా నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్‌ సీఎండీగా అతుల్‌భట్‌ విధులు నిర్వహిస్తున్నారు.

* అటవీశాఖకు చెందిన ఒక్కో అధికారి వందల ఎకరాల భూములను అమ్ముకున్నారని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ ఆరోపించారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మట్టెవాడ సమీపంలోని పోడు భూమిలో శుక్రవారం అధికారులు కందకాలు తవ్వుతున్నట్లు అందిన సమాచారంతో ఆయన అక్కడికి చేరుకుని ఆ పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అటవీ అధికారులు భూములను అమ్ముకున్నట్లు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. వారిపై కేసులు సైతం నమోదయ్యాయని చెప్పారు. అధికారులు సక్రమంగా పనిచేస్తే అడవులు అభివృద్ధి చెందేవన్నారు. ఇకనుంచైనా కన్జర్వేటర్‌, డీఎఫ్‌వో, అటవీక్షేత్రాధికారులు సరిగ్గా వ్యవహరించాలని సూచించారు. కందకం పనులు చేస్తున్న పొక్లెయిన్‌లను అక్కడి నుంచి పంపించేశారు.