Politics

150మందితో కొత్త జాబితా రెడీ చేసిన జగన్-తాజావార్తలు

YS Jagan Makes New List For Nominated Posts With 150Members

* శ్రీశైలం , తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండళ్ళతో పాటు , రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ లకు చైర్మెన్లను నామినేట్ చెసెందుకు రంగం సిద్ధమయింది. ఈ మెరకు 150 మందితో ముఖ్యమంత్రి కార్యాలయం ( C M O ) జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరికే రిజర్వేషన్ల ప్రకారం పదవులను అప్పగించనుందని సమాచారం . ఈ నెల 30 నాటికీ దినీపై ప్రకటన వచ్చె అవకాశం ఉంది. ఇక ఈ జాబితాలోని కీలక నేతలకే ఆ తరువాత. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వచ్చు అని తెలుస్తుంది.

* పాన్‌ కార్డు, ఆధార్‌ అనుసంధాన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది.కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ దృష్ట్యా గడువును మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.సెప్టెంబర్‌ 30ని తాజాగా గడువుగా పేర్కొంది.గతంలో విధించిన గడువు జూన్‌ 30తో ముగస్తున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది.పాన్‌- ఆధార్‌కు 2020 మార్చి 31ను తొలుత గడువుగా పేర్కొన్నారు.తర్వాత దాన్ని 2020 జూన్‌ 30కి, తర్వాత 2021 మార్చి 31కి, అనంతరం ఈ ఏడాది జూన్‌ 30కి మరోసారి కేంద్రం పలు దఫాలుగా గడువు పొడిగిస్తూ వచ్చింది.పాన్‌- ఆధార్‌తో పాటు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఉద్యోగి కొవిడ్‌ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

* భారత్‌లో కరోనా మూడో ఉద్ధృతి రావడానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్‌ అధ్యయనపత్రం వెల్లడించింది. ఒక వేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఇప్పటి పరిస్థితులను, రాబోయే ఉద్ధృతులను ఎదుర్కోవడంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపింది. ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ, వైద్యనిపుణులు సందీప్‌ మండల్‌, సమీరన్‌ పండా, లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన నిమలన్‌ అరినమిన్‌పతి సంయుక్తంగా రూపొందించిన ఈ అధ్యయన పత్రం ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌లో ప్రచురితమైంది. రోగనిరోధకశక్తి క్షీణించడం, రోగనిరోధకశక్తిని తప్పించుకొనేలా వైరస్‌లో మార్పులు రావడం వంటి కారణాలు మూడో ఉద్ధృతికి దారితీసే అవకాశాలు తక్కువేనని ఇందులో అభిప్రాయపడ్డారు. రెండు సందర్భాల్లోనే మూడో ఉద్ధృతి తలెత్తడానికి ఆవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో 1. కొత్త వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి ఉండి, అదే సమయంలో అది రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలగాలి. 2. సంక్రమణాన్ని తగ్గించగలిగే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేయాలి. ఈ రెండు కారణాల వల్ల ఒక వేళ మూడో వేవ్‌ వచ్చినప్పటికీ అది రెండో వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని వీరు అధ్యయన పత్రంలో అభిప్రాయపడ్డారు.

* దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 17,45,809 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..48,698 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. ఈ నెలలో రెండోసారి రోజువారీ కేసులు 50వేల దిగువకు చేరాయి. తాజాగా మరో 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,83,143కి చేరగా 3,94,493 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత కొంతకాలంగా గణనీయంగా తగ్గుతున్న క్రియాశీల కేసులు.. తాజాగా 6లక్షల దిగువకు చేరాయి. క్రియాశీల రేటు 1.97 శాతానికి తగ్గగా రికవరీరేటు 96.72 శాతానికి పెరిగింది. నిన్న 64,818 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.91 కోట్లకు చేరాయి. ఇదిలా ఉండగా రెండో దఫా వైరస్‌ విజృంభణ తగ్గుముఖం పడుతున్న క్రమంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తి కలవరపెడుతోంది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 48 డెల్టాప్లస్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

* కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని సంగీత్ న‌గ‌ర్‌లో విషాదం నెల‌కొంది. ప‌బ్‌జీ ఫైర్ గేమ్ ఆడుతూ.. 12 ఏండ్ల బాలుడు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

* గుంటూరు జిల్లా అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో కాల్‌గర్ల్స్‌ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. స్నేహితుని పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నుంచి అమ్మాయిలను తీసుకొచ్చినట్లు గుర్తించారు. దాడుల్లో ఐదుగురు వ్యక్తులు, ముగ్గురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే, రేవ్‌పార్టీ ఏమైనా నిర్వహించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్‌ నిర్వాహకులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

* దేశంలోని హైకోర్టుల్లో జడ్జిల పోస్టుల భర్తీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొలీజియం సిఫార్సులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీజేఐ లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారిని కరోనా యోధులుగా గుర్తించాలని కోరారు. కోర్టు సిబ్బంది కుటుంబసభ్యులకు టీకా ఇవ్వాలని.. కరోనాతో ఉపాధి కోల్పోయిన జూనియర్‌ లాయర్లకు సాయం అందించాలన్నారు. జాతీయ న్యాయ, మౌలిక వసతుల కార్పొరేషన్ ఏర్పాటు తుది దశలో ఉందని.. నివేదిక సిద్ధమైన తర్వాత కేంద్రానికి సమర్పిస్తామని సీజేఐ వెల్లడించారు.

* ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. అనంతరం తెలంగాణ పీఆర్‌టీయూ నేతలు మీడియాతో మాట్లాడుతూ… పాఠశాలల ప్రారంభంపై తొందరలేదని, ప్రత్యక్ష తరగతుల వాయిదాకు సీఎం అంగీకరించారని తెలిపారు. జులై 1 నుంచి ఆన్‌లైన్‌ బోధనకు సీఎం అంగీకారం తెలిపారని వెల్లడించారు. రోజూ సగం మంది టీచర్లు విధులకు హాజరయ్యేందుకు కల్పించాలని కోరగా సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని ఉపాధ్యాయ సంఘం నేతలు మీడియాకు వెల్లడించారు.

* తెలంగాణ వ్యాప్తంగా జులై 1 నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అమలు చేయనున్న కార్యక్రమాలపై చర్చించారు. నిర్దేశించిన ఏ పనీ పెండింగ్‌లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తోందని, అలాంటప్పుడు పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో సమీక్షించుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నాటించాలని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా పంటలతో రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని, తక్షణమే అదనపు రైస్‌ మిల్లుల అవసరం ఏర్పడిందని అన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దుతో పరీక్షా ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఫలితాల వెల్లడి కోసం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫలితాలను వెల్లడించేందుకు మూల్యాంకనం ఎలా ఉండాలన్న దానిపై నిపుణుల కమిటీ నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు. మరోవైపు ప్రపంచబ్యాంకు నిధులతో ప్రాథమిక విద్యాబోధన ప్రాజెక్టు, విద్యాకానుక అమలు అంశాలపైనా చర్చించారు.

* ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు మోసానికి గురవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురులో పోలీసు కస్టడీలో మరియమ్మ అనే ఎస్సీ మహిళ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘దళిత ఆవేదన దీక్ష’ పేరుతో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు కార్యక్రమం నిర్వహించారు. తాజా ఘటనతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు ఆవేదన చెందుతున్నారని దాసోజు శ్రవణ్‌ అన్నారు.

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మక్దూమ్‌ భవన్‌లో ఏపీ నిరుద్యోగుల సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హాజరై మాట్లాడారు.‘ఏ ప్రభుత్వంలో లేని ఆశలు ఈ ప్రభుత్వంపైన ఉన్నాయి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని జగన్ చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆ ఉద్యోగాలు తానే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

* అయోధ్య నగరంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించే నిమిత్తం ప్రధాని మోదీ శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌తో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ నెలలో వారిద్దరి మధ్య జరిగిన రెండో సమావేశం ఇది. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం చేపట్టిన భూముల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దాంతో తాజాగా నిర్వహించిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. నేటి సమావేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, రైల్వే స్టేషన్, విమానాశ్రయంతోపాటు అయోధ్య అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను యోగి ప్రధానికి సమర్పించారు.