Politics

ఓటుకు నోటు పంథాలో రేవంత్‌కు పదవి ఇచ్చారు-తాజావార్తలు

ఓటుకు నోటు పంథాలో రేవంత్‌కు పదవి ఇచ్చారు-తాజావార్తలు

* తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన శంషాబాద్‌ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్టు తనకు దిల్లీ వెళ్లాక తెలిసిందన్నారు. పీసీసీ కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూ వారి నాయకత్వంలో రాబోయే హుజూరాబాద్‌ ఎన్నికల్లో డిపాజిట్లు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా టీ టీడీపీ మాదిరిగానే మారబోతోందని వ్యాఖ్యానించారు. టీపీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు. రేపట్నుంచి ఇబ్రహింపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. తనను కలిసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, రేవంత్‌రెడ్డి సహా ఎవరూ తనను కలిసేందుకు ప్రయత్నించొద్దని కోమటిరెడ్డి తెలిపారు. ‘‘మొదటి నుంచి ఒకే పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అన్యాయం జరిగింది, రేపు మనకు కూడా అదే పరిస్థితి వస్తుందని పార్టీని నమ్మకున్న కార్యకర్తలు అనుకుంటారు. ప్రజల మధ్యనే ఉంటా.. కొత్త నాయకులను కార్యకర్తలను ప్రోత్సహిస్తా. నల్గొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో గెలుపుకోసం కృషి చేస్తా. పార్లమెంట్‌లో నా గళం వినిపిస్తా. ఎల్బీనగర్‌ నుంచి ఆందోల్‌ మైసమ్మ గుడి వరకు జాతీయ రహదారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబితేనే మంజూరు చేశానని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. నాగార్జున సాగర్‌కు రూ.370 కోట్లతో పనులు జరుగుతున్నాయి’’ అని కోమటిరెడ్డి వివరించారు. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌ పదవికి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. పార్టీలో మాత్రం కొనసాగుతానని శశిధర్‌రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్‌) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శనివారం రాత్రి లేఖ పంపారు. పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం ప్రకటించిన కొద్ది సేపటికే కేఎల్లార్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

* వన్ ర్యాంక్-వన్ పెన్షన్’ ప్రకటించడం ద్వారా సైనికులకు ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలబెట్టుకుని తన నిబద్ధతను చాటుకున్నారని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ తెలిపారు.మూడు రోజుల పర్యటన కోసం లద్ధాక్ చేరుకున్న ఆయన లేహ్‌లో ఆర్మీ విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ప్రసంగించారు.సైన్యంలో విశిష్ఠ సేవలందించిన అనంతరం వారు ఉన్నతంగా స్థిరపడేందుకు ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని ఈ సందర్భంగా రాజ్​నాథ్​ స్పష్టం చేశారు.మీరు ఏ విధంగానైతే దేశాన్ని రక్షిస్తున్నారో, అదే విధంగా మిమ్మల్ని కాపాడుకోవటం మా లక్ష్యమని ఉద్ఘాటించారు రాజ్​నాథ్​.సైనికుల సమస్యలు తీర్చేందుకు హెల్ప్‌లైన్ నంబర్​ ఏర్పాటు చేస్తామన్నారు.

* సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ట్విటర్‌ వేదికగా అభిమానులు, ప్రజలు అడిగే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు, సమస్యలను సైతం పరిష్కరిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు తన వ్యక్తిగత/కుటుంబ ఫొటోలను సైతం పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. 1984లో నాలుగో తరగతి సందర్భంగా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోను స్నేహితుడు పంపగా దాన్ని అభిమానులతో పంచుకున్నారు.‘‘1984 నాటి ఫొటో. భరత్‌ అనే నా క్లాస్‌మేట్‌ ఈ ఫొటోను నిన్న నాకు పంపాడు. కరీంనగర్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ నాలుగో తరగతి చదువుతున్నప్పటి ఫొటో ఇది. ఈ ఫొటోలోని ఉన్న అందరి పేర్లు మళ్లీ గుర్తు చేసుకున్నా. మీకు ఆశ్చర్యమనిపించినా ఇది నిజం’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండింగ్‌లో ఉంది.

* తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది.

* మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు అంతకంతకు ఉత్కంఠగా మారుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇప్పటికే నలుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ జాబితాలోకి మరో నటుడి పేరు వచ్చి చేరింది. తెలుగు చిత్రపరిశ్రమలో విభిన్నమైన పాత్రలు పోషించిన నటుడు సీవీఎల్‌ నరసింహారావు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆదివారం వెల్లడించారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను అన్నివిధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌, నటుడు మంచు విష్ణు, నటీమణులు జీవిత, హేమలు ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ ప్యానల్‌ సభ్యుల్ని సిద్ధం చేసుకుంటున్నారు.

* శ్రీలంక క్రికెట్‌ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వెంటనే తగు చర్యలు తీసుకొని కాపాడాలని మాజీ కెప్టెన్‌ సనత్‌ జయసూర్య సూచించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న లంక జట్టు మూడు టీ20ల సిరీస్‌ను ఒక్కటి కూడా గెలవకుండానే ఓటమిపాలైంది. మరీ ముఖ్యంగా శనివారం రాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు 181 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇంగ్లాండ్‌ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తమ చరిత్రలో పరుగుల తేడా పరంగా నాలుగో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే జయసూర్య ఆదివారం ట్విటర్‌లో ఇలా స్పందించాడు.

* మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై నటుడు మంచు విష్ణు లేఖ రాశారు. ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్‌ వేస్తున్నానని ఆయన తెలిపారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, సమస్యలు తనకి బాగా తెలుసని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

* జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో వైకాపా ప్రభుత్వం యువతను తప్పుదోవ పట్టించిందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని ఆక్షేపించారు. ఎలాగైనా సాధించాలని ఏళ్ల తరబడి లక్షల మంది విద్యార్థులు ఎంతో ఖర్చు చేసి గ్రూప్-1, గ్రూప్‌-2 పోస్టులకు సన్నద్ధమవుతున్నారన్నారు. అలాంటి తరుణంలో గ్రూప్-1, గ్రూప్‌-2లో కేవలం 36 పోస్టులు మాత్రమే ఉన్నాయని ప్రకటించి వారందరినీ నడిరోడ్డుపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ ఏడాది మే నెలలో 4.77 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించి.. 20 రోజులు గడిచిన తర్వాత 6.03 లక్షల ఉద్యోగాలు కల్పించామని తప్పుడు ప్రకటనలు ఇచ్చారన్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలో 1.26లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిందా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

* నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఏపీ సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎనిమిదో లేఖ రాశారు. సర్పంచ్‌ల అధికారాల్లో కోత విధించడం ప్రజాస్వామ్యానికి చేటు అని చెప్పారు. గ్రామసభ క్రియాశీలత్వం కోల్పోయి లాంఛనప్రాయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్‌పై స్పష్టత లేకపోవడంతో.. బ్యాంకుల నుంచి నిధులు తీసుకోలేక నిస్సహాయంగా మారారని రఘురామ ఆరోపించారు.