Fashion

ఊటీకి పోటీ…కొండవీటి సోకు

ఊటీకి పోటీ…కొండవీటి సోకు

సాంస్కృతిక వికాసానికి పౌరుష ప్రాబవాలకు పెట్టింది పేరు కొండవీడు.. ప్రకృతి కాంత సిగలో ముడిచిన మల్లెచెండును తలపించే కొండలు సమ్మోహన సౌందర్యానికి ప్రతీకలుగా విరాజిల్లుతున్నాయి. నాటి రెడ్డిరాజుల కళాపోషణకు, వసంతోత్సవ సంరంభానికి నిలువుటద్దాలుగా నింగి నంటే ఆనంద గంధాలను పంచుతూ శోభిల్లుతూ ముచ్చటగొలిపే వారసత్వ విరిదండలే ఈ కొండవీడు కొండలు. ఉషోదయ వేళ కనిపించే మంచు.. వివిధ రకాల పూలమొక్కలలో వికసించిన పువ్వులు.. చుట్టూ పచ్చదనం పరుచుకున్న కొండలు.. పాములా మెలికలు తిరిగిన ఘాట్‌రోడ్డు.. ఇలా ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న కొండవీడు పర్యటక స్వర్గధామంగా కనిపిస్తోంది. చల్లని సమీరం.. పువ్వుల సువాసనలు.. పండ్ల తోటల అందాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. వర్షాలు కురుస్తున్న వేళ ప్రకృతి అందాలు మరింత వికసించి కనువిందు చేస్తున్నాయి. గుంటూరు నగరానికి 30 కిలోమీటర్ల సమీపంలో ఇంత అందమైన ప్రదేశం ఉండటం జిల్లా వాసులకు వరమని చెప్పాలి.
**నల్లపాడు నుంచి బోయపాలెం వరకు 25 కిలోమీటర్ల మేర కొండవీడు కొండలు విస్తరించి ఉన్నాయి. కొండవీడు కేంద్రంగా అనేక రాజవంశాల వారు పాలన సాగించారు. అప్పట్లో ఆయుధాలను భద్రపరిచే ప్రాంతంగా చెప్పే నేతికొట్టు అనే స్థావరం కొండపైన ఉంది. కొండవీడు రాజులు కోట నిర్మించుకుని కొండపైనే నివాసం ఉండేవారు. ఇప్పటికీ కోట ఆనవాళ్లు ఉన్నాయి. కొండకు సమీపంలో ఏర్పాటుచేసిన మ్యూజియంలో కొండవీడు పరిసరప్రాంతాల్లో ఉన్న రాతి విగ్రహాలు, జిల్లాలో జీరోద్ధరణకు నోచుకోని ఆలయాల్లో విగ్రహాలు, పురాతన శాసన నమూనాలు, చారిత్రక ఘట్టాలను చిత్రాలతో ఆవిష్కరించిన చిత్రపటాలు చూడవచ్చు. కొండవీడు కోట నమూనా ఇక్కడ ప్రదర్శించారు.
***ఔషధ మొక్కలకు నిలయం
కొండపైన మూడు చెరువులు ఉన్నాయి. అప్పట్లో కొండమీద నివసించే వారి చెరువుల నుంచి నీరు సరఫరా అయ్యేది. అలాగే ఇప్పటికీ ఒక చెరువు వేసవికాలంలో నీటితో నిండి ఉంటుంది. కొండపైన నేల అత్యంత సారవంతమైనది కావడంతో అనేక ఔషధ మొక్కలకు కొండవీడు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 56 రకాల ఔషధ మొక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీ రూపొందించడానికి ఆయుష్‌ శాఖ కార్యాచరణ సిద్ధం చేసిందని కొండవీడు అభివృద్ధి కన్వీనర్‌ శివారెడ్డి తెలిపారు.
(*ఆధ్యాత్మికతకు నిలయం
కొండపైన మూడు వైష్ణవ దేవాయాలు, మూడు శివాలయాలు ఉన్నాయి. కొండ కింద రెడ్డిరాజుల కులదైవం మూలంకురేశ్వరి (అమీనాబాద్‌), కొండవీడులో రామలింగేశ్వర ఆలయం, నరసింహస్వామి ఆలయం, కోట గ్రామంలో గోపినాథ ఆలయం(కత్తులబావి), చెంఘీజ్‌ఖాన్‌పేటలో వెన్నముద్ద వేణుగోపాలుని ఆలయాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇస్కాన్‌ వాళ్ల ఆధ్వర్యంలో 17 ఎకరాల విస్తీర్ణంలో రాధాకృష్ణ మందిరం నిర్మిస్తున్నారు.
**పర్యటక స్వర్గధామమే..
కొండవీడు పరిసర ప్రాంతాల్లో గులాబీ, చామంతి, బంతి, సన్నజాజి, విరజాజి, కనకాంబరం తోటలతో ఆహ్లాదకరమైన వాతావరణం పర్యటకులను ఆకర్షిస్తోంది. కొండవీడుకు వెళ్లే దారిలో కుండలు తయారుచేసే వాళ్ల వద్ద కుంపట్లు, చేపడాగులు, చట్టీలు ఆకట్టుకుంటున్నాయి. కొండవీడు నుంచి బోయపాలెం వెళ్లే దారిలో మామిడి, బొప్పాయి తోటలు రహదారికి ఇరువైపులా ఉన్నాయి. ఆరోగ్య ప్రేమికులకు అందుబాటులో ట్రెక్కింగ్, హైకింగ్, మెట్లదారిలో వెళ్లడం ద్వారా కనీసం గంటసేపు ఔషధ మొక్కల నడుమ వ్యాయామం చేసినట్లు ఉంటుంది. ప్రస్తుతం కొండవీడు కోట అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొండపైన 600 మీటర్ల రహదారి, ఆలయాల పునరుద్ధరణ, చెరువుల అభివృద్ధి పూర్తయితే కొండవీడు పర్యటకులకు మరింత శోభను అందించనుంది.