Health

అసలు ఈ బ్లాక్ ఫంగస్ ఏమిటి?

What exactly is black fungus - Explained in Telugu

ఒకపక్క కోవిడ్‌ భయపెడుతుంటే కొన్నాళ్లుగా బ్లాక్‌ ఫంగస్‌ మరీ ఆందోళన కలిగిస్తోంది. అసలు బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటి? ఇది ఎందుకు సోకుతుంది? దీని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అవగాహన పెంచటానికి ఈ సమాచారం.
**బ్లాక్‌ ఫంగస్‌ కోవిడ్‌ కంటే ప్రమాదకరమైనదని, కోవిడ్‌ వచ్చిన వారికందరికి బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందని, దీనికి వైద్యం లేదని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవం కాదు. నిజానికి ఎప్పటి నుంచో ఉన్న జబ్బు. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన కూరగాయలు, బ్రెడ్‌లు చెడిపోయి బూజు పట్టినట్టుగా కనిపించడం ఈ ఫంగస్‌ వల్లనే. కోవిడ్‌ రోగులకు ఎక్కువగా వస్తుండడంతో కోవిడ్‌ వ్యాధికి వచ్చినంత ప్రచారం దీనికి కూడా వచ్చి కోవిడ్‌ కంటే ఎక్కువగా భయపెడుతుంది.
**ఆ పేరు ఎలా వచ్చింది?
బ్లాక్‌ ఫంగస్‌ … శాస్త్రీయ నామం మ్యూకార్‌ మైకోసిస్‌. నిజానికి ఇది నల్ల రంగులో ఉండదు. ఈ ఫంగస్‌ సోకిన కణజాలం రక్తప్రసరణ సరిగా అందక నల్లగా మారిపోతుంది. కాబట్టి దీనిని బ్లాక్‌ ఫంగస్‌ అని పిలుస్తున్నాం.
**అంత భయపడాల్సిన అవసరం ఉందా?
మధుమేహ వ్యాధి అదుపులో లేకుండా ఉండి కరోనా పీడితులైన వారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ స్టిరాయిడ్స్‌ వాడేవారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. కరోనా బాధితుల్లో 10 నుంచి 15 శాతానికి మించి మధుమేహ వ్యాధిగ్రస్తుల ఉండరు. వీరందరికీ బ్లాక్‌ ఫంగస్‌ రావాలని లేదు. వెయ్యి మందిలో ఒక్కరికి బ్లాక్‌ ఫంగస్‌ రావొచ్చు. బ్లాక్‌ ఫంగస్‌ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. షుగర్‌ని అదుపులో ఉంచుకుంటే గురించి భయపడాల్సిన పనిలేదు.అయితే బ్లాక్‌ ఫంగస్‌ కేసుల్లో 50 శాతం మరణాల రేటు ఉంది. అంటే ఈ వ్యాధి సోకిన వారిలో దాదాపు సగం మంది మరణిస్తున్నారు. మూడోవంతు మంది కంటిచూపు కోల్పోతున్నారు. ముందుగానే గుర్తించి యాంటీఫంగల్‌ వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు.
**ఎంత మందికి సోకింది?
కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం… దేశంలో మే 22 నాటికి 9000 మందికి సోకింది. 212 మంది ప్రాణాలను హరించింది. ఈ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రం గుజరాత్‌. గుజరాత్‌లో 2281 మందికి, మహారాష్ట్రలో 2000 మందికి, ఆంధ్రప్రదేశ్‌లో 910 మందికి ఇది సోకింది. దేశంలో నమోదైన కేసుల్లో 58 శాతం కేసులు ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
**ఎలా ప్రవేశిస్తుంది?
ఈ ఫంగస్‌ స్పోరులు గాలిలో ఉంటాయి. మన శరీరంలోకి ఏ మార్గం ద్వారా అయినా ప్రవేశించవచ్చు. చర్మం మీద కూడా వాలచ్చు. ఈ స్పోరులు గాలిలో ఉంటాయి కాబట్టి మనం గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలి ద్వారా ముక్కు లోకి ప్రవేశించి, ముక్కు దగ్గరలో ఉన్న సైనస్‌ల లోనికి, కళ్ళకి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాల్లో జీర్ణవ్యవస్థలోకి, ఊపిరితిత్తుల్లోకి, మెదడుకు కూడా పాకవచ్చు.
**ఎవరికి ఎక్కువగా సోకుతుంది?
ఎక్కువ కాలం మధుమేహ వ్యాధి ఉండి ఈ వ్యాధి అదుపులో లేకుండా ఉన్నటువంటి వారికి, కీళ్ల నొప్పులు, ఆస్తమా లాంటి మొండి దీర్ఘకాలిక జబ్బులకు ఎక్కువ కాలం పాటు స్టిరాయిడ్స్‌ వాడుతున్నటువంటి వారికి, ఊపిరి ఆడక దీర్ఘకాలం వెంటిలేటర్‌ సహాయంతో వైద్యం చేస్తున్న వారికి, అవయవ మార్పిడి చేయించుకున్న వారికి, క్యాన్సర్‌ రోగులకు, ఎయిడ్స్‌ రోగులకు ఎక్కువగా సోకే అవకాశం ఉంది.
**వ్యాధి లక్షణాలు ఏమిటి?
విపరీతమైన తలనొప్పి, దవడ నొప్పి, కళ్ళు ఎర్రబారడం, కళ్ళు, ముక్కు దగ్గర చర్మం వాచి ఎర్రబడడం, చూపు మందగించడం, రెండు ప్రతిబింబాలు కనిపించడం, ముఖం నొప్పిగా ఉండడం, ఎక్కువ సందర్భాల్లో ఒక వైపు తల నొప్పి ఉండటం.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముదురు రంగు ద్రవం పడడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, పళ్ళు వదులు కావడం … ఇలా అనేక లక్షణాలు ఉండవచ్చు. అందరికీ అన్ని లక్షణాలూ ఉండనవసరం లేదు. కొద్ది మందికి కొన్ని ఉంటాయి. మరి కొద్దిమందికి కొన్ని ఉండవు. కోవిడ్‌ వ్యాధి నుంచి కోలుకుంటున్న దశలో ఈ లక్షణాల్లో కొన్ని ఉన్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
**చికిత్స ఎలా?
కోవిడ్‌ వైద్యం లాగానే బ్లాక్‌ ఫంగస్‌ వైద్యం కూడా చాలా ప్రియం అయిపోయింది. దీనికోసం వాడే ఆంపోటెరిసిన్‌ సూది మందు అంత సులభంగా దొరకడం లేదు. దరిదాపుగా 20 సూదులు వేయాలి. ఒక్క సూది ఖరీదు సుమారుగా ఐదు వేల రూపాయలు. నల్ల బజారులో దీని విలువ చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చింది కాబట్టి పేదవారికి కొంత ఊరట కలిగింది.
***ఈ ఫంగస్‌ సోకకుండా ఏం చేయాలి?
*కొవిడ్‌ సోకినప్పుడు స్టిరాయిడ్లు వాడవలసిన అవసరం వస్తే వైద్యుని సలహా ప్రకారం సరైన మోతాదులో, పరిమిత కాలం పాటు వాడాలి.
* కోవిడ్‌ వైద్యం కోసం స్టిరాయిడ్స్‌ వాడినా, వాడకపోయినా చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి.
*బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిపై అవగాహన పెంచుకుని ఆ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచి బ్లాక్‌ ఫంగస్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించుకోవాలి.
* సరైన సమయంలో, యాంటీ ఫంగల్స్‌, యాంటీ బయాటిక్స్‌్‌ని విచక్షణతో వాడుకోవాలి.
*ఆక్సిజన్‌ థెరపీలో ఉపయోగించే హ్యుమిడిఫయర్లలో శుభ్రమైన స్టెరైల్‌ నీటిని వాడుకోవాలి. ఇంటి దగ్గరే ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర ని ఉపయోగిస్తున్నప్పుడు, స్టెరైల్‌ నీరు దొరకనప్పుడు కనీసం కాచి చల్లార్చిన నీరు వాడాలి.
* కొవిడ్‌ వ్యాధి ఉన్నప్పుడు, కోవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత కనీసం ఒక నెల వరకు మరీ ముఖ్యంగా మధుమేహులు, క్రమం తప్పకుండా, తరచుగా చక్కెర స్థాయిని పరీక్షించుకుంటూ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.
* మధుమేహ వ్యాధిగ్రస్తులు అందరూ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి.
* కోవిడ్‌ వ్యాధిగ్రస్తులకు గతంలో మధుమేహం లేకపోయినా కోవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత రక్తపరీక్ష చేయించుకొని కొత్తగా మధుమేహ వ్యాధి వచ్చిందేమో చూసుకోవాలి. కోవిడ్‌ అనంతరం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
*మధుమేహం ఉండి, కోవిడ్‌ వ్యాధి సోకి హౌమ్‌ ఐసోలేషన్లో ఉండేవారు పల్స్‌ ఆక్సీ మీటర్‌తో పాటు రక్తంలోని చక్కెర శాతాన్ని పరీక్షించుకోవడానికి గ్లూకోమీటర్‌ని కూడా దగ్గర ఉంచుకోవాలి. చక్కెర మోతాదును బట్టి వైద్యుని సలహాలతో మందుల మోతాదును సరి చూసుకుంటూ ఉండాలి.
* కోవిడ్‌ వ్యాధిగ్రస్తులు రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలి. వారి టూత్‌ బ్రష్‌ను వేరెవరి బ్రష్‌తో కలవకుండా ప్రత్యేకంగా ఉంచుకోవాలి.
* కోవిడ్‌ వ్యాధిగ్రస్తులు వ్యాధి లక్షణాలు తగ్గిన 14 రోజుల తర్వాత గాని కోవిడ్‌ టెస్ట్‌ నెగెటివ్‌ వచ్చిన తర్వాత గాని అప్పటివరకు వాడుతున్న బ్రష్‌ను మార్చుకోవాలి.
*ఒకే మాస్కుని ఉతకకుండా రోజుల తరబడి ధరిస్తే బ్లాక్‌ఫంగస్‌ వచ్చే అవకాశముంది. మాస్కును శుభ్రంగా ఉతికిన తర్వాతే ధరించాలి. అటు వెంటిలేషన్‌ సరిగ్గా లేని ఇళ్లలో ఉండే వారికీ ఈ వ్యాధి సోకే ప్రమాదముంది
*కరోనా లాగా ఇది అంటుకునే వ్యాధి కాదు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వచ్చే సాధారణమైన జబ్బు. కాకపోతే మనదేశంలో షుగరు వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉండటం, కోవిడ్‌ కేసులు ఎక్కువగా ఉండడం కారణంగా దీని గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు.