Politics

జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో విచారణ

జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో విచారణ

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రఘురామ దాఖలు చేసిన రిజాయిండర్‌పై లిఖితపూర్వక సమాధానం ఇస్తానన్న జగన్‌ అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషన్‌ వేసినందున తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని రఘురామ తరఫు న్యాయవాది శ్రీవెంకటేశ్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కేసులో సాక్షులుగా ఉన్న అధికారులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభ పెడుతున్నారని వివరించారు. ఇతర నిందితులకూ ప్రయోజనాలు కల్పిస్తున్నారని తెలిపారు. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ అభిప్రాయం వెల్లడించకపోవడం సరికాదని రఘురామ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. జగన్‌, రఘురామ వాదనల తర్వాత లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సీబీఐ… కోర్టుకు తెలిపింది. రఘురామకు పిటిషన్‌ వేసే అర్హత లేదని జగన్‌ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ ఉద్దేశాలతోనే పిటిషన్‌ వేశారని వెల్లడించారు. జగన్‌, రఘురామ, సీబీఐ లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించిన సీబీఐ న్యాయస్థానం విచారణ ఈనెల 8కి వాయిదా వేసింది.