Editorials

అమెరికాక్ చైనా హెచ్చరిక. ప్రకాష్‌రాజ్‌కు సుమన్ మద్దతు-తాజావార్తలు

అమెరికాక్ చైనా హెచ్చరిక. ప్రకాష్‌రాజ్‌కు సుమన్ మద్దతు-తాజావార్తలు

* భారతదేశంలో పుట్టిన పౌరులందరూ లోకలేనని తెలుగు సినీ నటుడు సుమన్‌ వ్యాఖ్యానించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అమీర్‌పేటలోని అస్టర్‌ప్రైమ్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్యుల గొప్పతనం గురించి మాట్లాడిన ఆయన పరోక్షంగా ‘మా’ ఎన్నికల వ్యవహారం గురించి స్పందించారు. ‘మా’ ఎన్నికల కారణంగా తెరపైకి వచ్చిన లోకల్‌ నాన్‌లోకల్‌పై పరోక్షంగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ లోకల్‌ కిందే లెక్కని.. కాబట్టి అందరూ కలిసి కట్టుగా ఉండాలని.. లోకల్‌-నాన్‌లోకల్‌ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు. అలాగే వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందదని ఆయన తెలిపారు. తెలుగు నటీనటుల సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సుమన్ పరోక్షంగా మద్దతు ప్రకటించారు.

* కడప జిల్లాలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయశాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. మఠానికి స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్‌ తీసుకుంటుందని తెలిపారు. మఠాధిపతి ఎంపికకు ధార్మిక పరిషత్‌ అనుమతించిందా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో సోమవారం నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

* కృష్ణా జలాలపై అనవసర వివాదం ఆపాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని అనుకుంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసి అనుమతులు తెచ్చుకున్న తర్వాతే నీళ్లు తీసుకెళ్లాలన్నారు. ఈ వ్యవహారంలో ఏపీ మంత్రుల వ్యాఖ్యలు విచారకరమని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని ఏపీ ప్రజల ఆస్తులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగించామా అని ప్రశ్నించారు.

* కడప జిల్లాలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయశాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. మఠానికి స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మఠంపై నిర్ణయాలను ధార్మిక పరిషత్‌ తీసుకుంటుందని తెలిపారు. మఠాధిపతి ఎంపికకు ధార్మిక పరిషత్‌ అనుమతించిందా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

* తెలంగాణలో కొవిడ్‌తో కేవలం 3,651 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం చెబుతోందని.. కాంగ్రెస్‌ పార్టీ తీసిన లెక్కల ప్రకారం ఇప్పటివరకు 1.50 లక్షల మంది మరణించారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ తెలిపారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసిందన్నారు.

* తిరుమలలో భక్తులకు సేవలందించే కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయం తీసుకుంది. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ఏజెన్సీకి అప్పగించారు. వీటితో పాటు వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీని సైతం అప్పగించారు. లడ్డూ కేంద్రంలో కేవీఎమ్‌ ఇన్ఫోకామ్‌ సంస్థ సేవలు ప్రారంభించింది. ఇప్పటి వరకు పలు బ్యాంకుల ద్వారా లడ్డు విక్రయాలు జరిపేవారు.

* ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించడంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తే థర్డ్‌వేవ్‌కు ఆస్కారం ఉండదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. థర్డ్‌వేవ్‌ అనేది అది ప్రజలు వ్యవహరించే తీరు, వ్యాక్సిన్‌ వేయడంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఒకవేళ వచ్చినా మూడో దశ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్‌ మిక్సింగ్‌పై ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయని, దానిపై ముందుకెళ్లేందుకు మరింత డేటా అవసరం ఉందని చెప్పారు.

* వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్లలో పన్ను చెల్లింపుదార్లు రెట్టింపయ్యారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. జీఎస్‌టీ విధానం నేటితో నాలుగేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఆమె పన్ను అధికారులకు అభినందించారు. గత కొన్ని నెలలుగా ఆదాయ వసూళ్లు మెరుగ్గా ఉన్నాయని, ఇకపై కూడా ఇలాగే కొనసాగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

* కరోనావైరస్‌పై తొలి డీఎన్‌ఏ టీకాను భారత్‌లో రూపొందించారు. ఈ టీకా తయారీ, వినియోగం అత్యంత సులువని తయారీదారు జైడస్‌ క్యాడిల్లా పేర్కొంది. దీంతో భారత్‌లో వ్యాక్సినేషన్‌కు అదనపు శక్తి లభించనుంది. ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్‌,కొవిషీల్డ్‌,స్పుత్నిక్‌-వి టీకాలను వినియోగిస్తున్నారు. కొత్తగా మోడెర్నా టీకాల దిగుమతికి పచ్చజెండా ఊపారు. హైదరాబాద్‌ సంస్థ బయోలాజికల్‌-ఇ టీకా కూడా వేగంగా పురోగతి సాధిస్తోంది. ఈ క్రమంలో జైడస్‌ టీకా జైకోవ్‌-డికు అత్యవసర వినియోగ అనుమతులను కోరింది.

* దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి ప్రధాన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం 52,547 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొంది. చివరికి 164.11 పాయింట్లు నష్టపోయి 52,318.60 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41.50 పాయింట్లు కోల్పోయి 15,680 వద్ద స్థిరపడింది.

* చైనాను వేధించే రోజులు శాశ్వతంగా తొలగిపోయాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. తియనాన్మెన్‌ స్క్వేర్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మావోను తలపించేలా వస్త్రధారణ చేసిన షీ జిన్‌పింగ్‌.. సభకు హాజరైన 70 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించారు. తైవాన్‌ విలీనానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆధునిక చైనా అభివృద్ధిలో కమ్యూనిస్టు పార్టీ పాత్రను ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. పార్టీని ప్రజలకు దూరం చేయాలని భావించినవారు ఓడిపోయారన్నారు.