DailyDose

నాలుగేళ్ల తర్వాత డ్రగ్స్ కేసులో పురోగతి-నేరవార్తలు

నాలుగేళ్ల తర్వాత డ్రగ్స్ కేసులో పురోగతి-నేరవార్తలు

* విశాఖ జిల్లా చోడవరం తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. తహసీల్దార్ రవికుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజా రూ.4.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. చోడవరం మండలం గాంధీ గ్రామానికి చెందిన చలపతిశెట్టి, వెంకటరామకృష్ణ కలిసి నర్సాపురంలో 1.66 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమార్పిడి చేసేందుకు గత నెల రోజులుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. ఈ విషయంలో తహసీల్దార్‌ రవికుమార్‌ బాధితుడి నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. అయితే చివరికి రూ.4 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే నర్సీపేటలోని 50 సెంట్ల భూమిని కన్‌వర్షన్ చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్‌ రూ.50వేలు డిమాండ్ చేశారు. పది రోజుల క్రితమే బాధితులిద్దరూ ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయాన్ని వివరించారు. డబ్బు సిద్ధం చేశానని.. ఎక్కడికి తీసుకురావాలో చెప్పాలని తహసీల్దార్‌ రవికుమార్‌కు బాధితుడు ఫోన్‌ చేశాడు. నేరుగా కార్యాలయానికి తీసుకురావొద్దని.. తన కారు డ్రైవర్‌కు ఇవ్వాలని చెప్పారు. అప్పటికే కార్యాలయం వద్ద మాటువేసిన ఏసీబీ అధికారులు డ్రైవర్‌ వద్దనున్న డబ్బును తీసుకుంటుండగా ఎమ్మార్వో, డిప్యూటీ ఎమ్మార్వోలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని మూసేసి నిందితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.

* రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మత్తుమందుల కేసుకు నాలుగేళ్ల తర్వాత మోక్షం లభించనుంది. దీనిపై త్వరలోనే న్యాయ విచారణ మొదలుకానుంది. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు పూర్తిచేసిన ఆబ్కారీశాఖకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అభియోగపత్రాలు దాఖలు చేయగా వాటన్నింటినీ న్యాయస్థానం ఆమోదించింది. కరోనా వల్ల న్యాయవిచారణలో జాప్యం జరగడంతో వాయిదా పడింది. నాలుగేళ్ల క్రితం అంటే 2017 జులై 2న ఆబ్కారీశాఖ అధికారులు నగరానికి చెందిన కెల్విన్‌ మాస్కెరాన్స్, అబ్దుల్‌ వహాబ్, అబ్దుల్‌ ఖుద్దూస్‌లను అరెస్టు చేసి వారి నుంచి రూ.30లక్షల విలువైన మత్తుమందులను స్వాధీనం చేసుకున్నారు. అనేక మంది సినీ ప్రముఖులు, సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లు, చివరకు పాఠశాల విద్యార్థులకు కూడా మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు వారు విచారణలో చెప్పడంతో కంగుతిన్న అధికారులు.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా సిట్‌ ఏర్పాటు చేశారు. మొత్తం 12 కేసులు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని పిలిపించి విచారించారు. అంగీకరించిన వారి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరించారు. ఈ కేసుల్లో మొత్తం దాదాపు 30 మందిని అరెస్టు చేయగా 27 మందిని విచారించారు. నమోదు చేసిన 12 కేసులకు తొలుత 8 కేసులలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తులో జాప్యం జరగటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖుల ప్రమేయం ఉండటం వల్లనే ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు ఆలస్యం చేస్తున్నారని, కేసులు నమోదయి ఏళ్లవుతున్నా అభియోగపత్రాలు దాఖలు చేయకపోవడంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు మిగతా నాలుగు కేసులలోనూ దర్యాప్తు పూర్తిచేయడంతో పాటు సినీ ప్రముఖుల నుంచి సేకరించిన నమూనాలనూ విశ్లేషించి ఆ నివేదికలను కూడా పొందుపరచి అభియోగపత్రాలు దాఖలు చేశారు. వీటన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం ఇటీవల ఆమోదం తెలపటంతో త్వరలోనే మత్తుమందుల కేసు న్యాయవిచారణ మొదలుకానుంది.

* చిత్తుగా మద్యం తాగి మత్తుగా కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు నడుపుకుంటూ వెళ్తున్న మందుబాబులపై పోలీసులు గట్టిగా దృష్టిపెట్టారు.. మోతాదుకు మించి మద్యం తాగి ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే ఇక రూ.10 వేలు జరిమానా విధిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తుండడంతో వారంలో మూడు రోజులు డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభంలో ట్రాఫిక్‌ పోలీసులు 2,500 మంది వాహనచోదకులపై కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు సమర్పించిన అభియోగపత్రాల ఆధారంగా ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టులు ఉత్తర్వులు జారీ చేశాయి. వీరిలో అత్యధికులకు ఆరు నెలల పాటు డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు చేయగా.. 210 మందికి జైలు శిక్ష విధించాయి.

* తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం నదురుబాదకు చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ క్షేత్ర సహాయకుడు విత్తనాల ముత్యాలరావు (ముత్తు) బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని బంధువులు హుటాహుటిన రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.