Sports

11వేల ఆటగాళ్లతో టోక్యో ఒలంపిక్స్ సాధ్యమేనా?

11వేల ఆటగాళ్లతో టోక్యో ఒలంపిక్స్ సాధ్యమేనా?

ఐపీఎల్‌లో ఆటగాళ్ల సంఖ్య అటు ఇటుగా 200. ఆటగాళ్లతో పాటు ఈ లీగ్‌లో భాగమైన కోచ్‌లు, సహాయ సిబ్బంది, నిర్వాహకులు అందరినీ కలిపినా 800 లోపే. ఇలాంటి లీగ్‌లో నాలుగైదు కరోనా కేసులు బయటపడగానే టోర్నీని అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. అంతకుముందు పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ పరిస్థితీ ఇంతే. అలాంటిది ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రీడా సంబరమైన ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు మాత్రమే 11 వేలు. మొత్తం ఈ ఈవెంట్లో భాగమయ్యే వారి సంఖ్య దాదాపు 60 వేలు. ఇంతమందితో ముడిపడ్డ ఈవెంట్‌పై కరోనా ప్రభావం పడకుండా ఉంటుందా అన్న భయం వెంటాడుతోంది. ఒలింపిక్స్‌ ఆరంభానికి నాలుగు వారాల ముందే.. టోక్యోకు చేరుకున్న ఉగాండా దేశ జట్టులో కరోనా కేసులు బయటపడటం ఇప్పటికే కలవరం రేపుతోంది. ఆ జట్టులోని ఒకరు విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలగా.. అక్కడే ఐసొలేట్‌ చేశారు. మిగతా బృందం బస్సులో ప్రయాణించి ఒసాకాలో తమకు వసతి ఏర్పాటు చేసిన చోటికి వెళ్లగా.. కొన్ని రోజులకు జట్టులోని ఇంకొకరు కరోనా బారిన పడ్డట్లు వెల్లడైంది. దీంతో మొత్తం జట్టునంతా క్వారంటైన్‌ చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఒలింపిక్స్‌ ఆరంభ సమయానికి క్రీడాకారులు, సహాయ సిబ్బంది కలిపి వివిధ దేశాల నుంచి 15 వేలమందికి పైగా టోక్యోలో అడుగు పెడితే పరిస్థితేంటో చూడాలి. ఒలింపిక్స్‌ ముంగిట చెప్పుకోదగ్గ సంఖ్యలో కేసులు బయటపడితే.. ఈవెంట్‌ సందర్భంగా ఎవరైనా పాజిటివ్‌గా తేలితే ఏం చేస్తారో? ఏళ్ల తరబడి కష్టపడి, తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యాక అథ్లెట్లు పాజిటివ్‌గా తేలి పోటీలకు దూరం కావాల్సి వస్తే వారి వేదన వర్ణనాతీతం. టీమ్‌, రిలే ఈవెంట్లలో పోటీ పడే బృందాల్లో ఒక్కరు కరోనా బారిన పడ్డా.. మొత్తం అందరూ వైదొలగాల్సిందే. టోక్యోలో ఒలింపిక్స్‌ ముంగిట రోజు వారీ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. ఈ నెల 21న షరతులు సడలించాక ఒలింపిక్స్‌ ఆతిథ్య నగరంలో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒలింపిక్స్‌ సమయానికి వైరస్‌ ప్రభావం మరింత పెరగొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌ ఎలా నడుస్తుందో అన్న భయాలు ఎక్కువవుతున్నాయి. కరోనా నేపథ్యంలో జపాన్‌లో మెజారిటీ జనాలు ఒలింపిక్స్‌ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తుండటంతో నిర్వాహకులు హడావుడి లేకుండా సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. ప్రచార ఈవెంట్లేవీ కనిపించడం లేదు. జ్యోతి ప్రదర్శన కార్యక్రమాలను రద్దు చేశారు. మరోవైపు ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల సన్నద్ధత, మానసిక స్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. ఒలింపిక్స్‌ ఏడాది వాయిదా పడటం.. ఎన్నో టోర్నీలు రద్దవడం.. ప్రాక్టీస్‌కు కూడా సరైన అవకాశం లేకపోవడంతో క్రీడాకారుల సన్నాహాలపై ప్రభావం చూపింది. ఒలింపిక్స్‌ జరుగుతాయా లేవా అన్న సందిగ్ధత.. కరోనా భయం క్రీడాకారుల మానసిక స్థితిపై ప్రభావం చూపేదే. మొత్తంగా ఎన్నడూ లేనంత గందరగోళ పరిస్థితుల మధ్య క్రీడాకారులు ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అథ్లెట్ల ప్రదర్శన పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చని, ఎప్పట్లా ఈసారి రికార్డులు బద్దలవడం తక్కువగా ఉండొచ్చని, ఒలింపిక్స్‌ ప్రమాణాలు తగ్గుతాయని భావిస్తున్నారు. అర్హత టోర్నీలు కొన్ని రద్దవడం, కొన్ని వాయిదా పడటం, ఇతర కారణాల వల్ల కొందరు స్టార్‌ అథ్లెట్లు ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొనట్లేదు. ఇవన్నీ కూడా ఒలింపిక్స్‌కు ఆకర్షణ తగ్గించేవే.