Politics

రేవంత్ మరో పార్టీలోకి వెళ్లేవారు-తాజావార్తలు

రేవంత్ మరో పార్టీలోకి వెళ్లేవారు-తాజావార్తలు

* తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాళ్లతో కొడితే.. తెరాస కార్యకర్తలు చెప్పులతో కొడతారని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు రేవంత్‌రెడ్డి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారని తీవ్రంగా విమర్శించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి.. ఇంట్లో రెవెన్యూ టీంను ఉంచుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. డబ్బులిచ్చి కీలక పదవులు పొందిన రేవంత్‌ తెరాసను విమర్శించడం ఏంటని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి రాకుంటే రేవంత్‌ పార్టీని వీడేవారని చెప్పారు. కొనుక్కున్న పదవులను చూసి మిడిసిపడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని సందర్భాల్లో డబ్బు పనిచేయదని.. కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలే రోజు తప్పకుండా వస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజల అభీష్టానికి దూరంగా వెళ్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఏళ్ల తరబడి ఉన్నవాళ్లకు న్యాయం జరగటం లేదన్నారు. ఎన్ని మాటల గారడీలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు.

* భాషా పరిరక్షణతోనే సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోగలం – ఉపరాష్ట్రపతి వెంకయ్య.· భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతం అవుతాయి · తెలుగు భాషా పరిరక్షణకు పంచ సూత్రాలు· ఆదర్శవంతమైన జీవనానికి సంస్కృతి తోడ్పడుతుంది · ప్రవాస భారతీయులు సాంస్కృతిక వారధులు· ఖండాంతరాలు దాటి మన సంస్కృతిని కాపాడుకుంటున్న ప్రవాస భారతీయులకు అభినందనలు · భారతీయ సంస్కృతి సనాతన ధర్మంగా పరిఢవిల్లింది · ప్రకృతిని కాపాడుకోవడం, నలుగురికీ సాయం చేయడం భారతీయ సంస్కృతి · ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను కాపాడుకోవాలి, జీవన విధానంలో భాగం చేసుకోవాలి · పీఠాధిపతులు ప్రజల్లోకి వెళ్ళి ఆధ్యాత్మికతను, ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయాలి · శ్రీ సాంస్కృతిక కళాసారధి – సింగపూర్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి ప్రసంగం

* విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ నాయకులు గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు.

* ఉత్తరాఖండ్‌ తదుపరి సీఎంగా భాజపా నేత పుష్కర్‌ సింగ్‌ ధామి పేరు ఖరారైంది. ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో భాజపా శాసనసభాపక్ష నేతగా పుష్కర్‌ను ఎన్నుకున్నారు. పుష్కర్‌ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

* ప్రాణాలు కాపాడకపోగా, వెంటిలేటర్ పై 19 రోజులు ఉంచి రూ.28 లక్షలు వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యంపై కేసు ఫైల్ చేయమని పోలీసు అధికారులకు రాజమహేంద్రవరం ఎంపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ ఆదేశించారు.

* భూ సమస్యలను పరిష్కారం కోసం ధరణి పోర్టల్ లో మార్పులు,చేర్పులపై దృష్టి పెట్టారు అధికారులు. గ్రీవెన్సు ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్ లో కొత్త పిచర్ ను జతచేశారు. బాధితులు సమస్యను వివరిస్తే..అధికారులు పరిశీలించి పరిష్కార మార్గాన్ని సూచించేలా ఈ పిచర్ ను తీసుకొచ్చారు. 10 రకాల సమస్యలకు చోటు కల్పించారు. మొత్తం 37 మ్యాడ్యూల్స్ ఉన్నాయి. వీటి ద్వారా 90 శాతానికి పైగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.

* చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో భారీ భూ కుంభకోణం జరిగిందని తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో హైవేకు ఆనుకుని రూ.400 కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. మంత్రి, ఎంపీల అండ చూసుకొని వైకాపా నేతలు భూ కబ్జాకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రభుత్వ భూములకు లే- అవుట్లు వేసి అక్రమంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణలకు సంబంధించిన ఊరు, సర్వే నెంబర్ల వివరాలను ఆయన మీడియా ముందు ఉంచారు. జిల్లాలో భూ అక్రమాలపై సర్వే నెంబర్లు త్వరలో బయటపెడతామని కిశోర్‌ అన్నారు. భూ కుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

* బాలీవుడ్ స్టార్‌ కపుల్‌ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు విడిపోతున్నారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై కుమారుడి బాధ్యత ఇద్దరూ చూసుకోనున్నట్లు తెలిపారు.

* టాలీవుడ్‌ హీరోయిన్‌ మెహరీన్‌ పిర్జాదా షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల ఆమెకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. గత మార్చిలో నిశ్చితార్థం కూడా జైపూర్‌ వేదికగా ఘనంగా జరిగింది. కాగా ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు మెహరీన్‌ స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. ఇక నుంచి భవ్య బిష్ణోయ్‌, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్‌ స్పష్టం చేసింది. తన వ్యక్తిగత గోప్యతను అందరూ గౌరవిస్తారని.. ఇక నుంచి తన అభిమానులను అలరించేందుకు సినిమాలు చేస్తానని ఆమె పేర్కొంది.

* గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలకు ఇటీవల డిమాండ్‌ మరింత పెరిగింది. ప్రశాంతమైన వాతావరణం.. ఆహ్లాదకరమైన పరిసరాలు.. చుట్టూ పచ్చదనం.. మూడంచెల భద్రతా వ్యవస్థ.. సకల సౌకర్యాలు.. ఆధునిక హంగుల కలబోతగా నిర్మిస్తున్న విల్లాల్లో నివాసానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కాలంతో పాటూ వచ్చిన మార్పులకు అనుగుణంగా తమ జీవనశైలిని కొనసాగించేందుకు వీటిల్లోకి మారిపోతున్నారు. నగరం మధ్యలో, వాణిజ్య కేంద్రాలకు దగ్గరగా నివాసం ఉండాలని ఇదివరకు కోరుకునేవారు. ఇప్పుడు కొనుగోలుదారుల ఆలోచనలు మారాయి. ట్రాఫిక్‌కు, కాలుష్యానికి దూరంగా నివసించాలని భావిస్తున్నారు. నగర శివార్ల వైపు చూస్తున్నారు. సాధారణంగా శివార్లలో నివాసాలు విసిరేసినట్లుగా ఉంటాయి. సౌకర్యాలు అంతంతమాత్రమే. ప్రస్తుతం ఇక్కడి విల్లా ప్రాజెక్టులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. పది నుంచి వంద ఎకరాల విస్తీర్ణంలో వంద నుంచి ఐదు వందల విల్లాలు ఒకేచోట నిర్మిస్తుండటంతో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్లబ్‌ హౌస్‌, ఈత కొలను, ఆట స్థలాలు, అతిథుల కోసం ప్రత్యేక గదులు, పెద్దల కోసం పార్కులు నిర్మిస్తున్నారు. కొత్తగా కొంత స్థలం విద్యాసంస్థల కోసం కేటాయించి ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల క్లినిక్‌లకు కేటాయిస్తున్నారు. ఇళ్లన్నీ ఒకే తరహాగా అందమైన ఎలివేషన్‌తో తీర్చిదిద్దడం.. ఆధునిక జీవనశైలికి నిర్మాణాలు అద్దం పడుతుంటంతో వీటిలో నివాసానికి ఇష్టపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు, వైద్యులు, ప్రవాస భారతీయులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా విల్లాలను కొనుగోలు చేస్తున్నారని రియల్టర్లు అంటున్నారు. మధ్య తరగతి వారు సైతం తమ పాత ఇళ్లను, స్థలాలను విక్రయించి విల్లాలను కొనుగోలు చేస్తున్నారు.