Sports

22ఏళ్లుగా క్రికెట్ సేవలో మిథాలీ

22ఏళ్లుగా క్రికెట్ సేవలో మిథాలీ

ఆమె క్రికెట్లోకి అడుగు పెట్టే సమయానికి ఇప్పుడు భారత జట్టులో స్టార్లుగా ఉన్న షెఫాలీవర్మ, జెమిమా రోడ్రిగ్స్‌ లాంటి వాళ్లు పుట్టనే లేదు.. ఆమె రికార్డులు కొట్టే సమయానికి స్మృతి మంధాన లాంటి వాళ్లు బ్యాట్‌ పట్టనే లేదు. 22 ఏళ్లు.. ఎన్నో రికార్డులు.. మరెన్నో ఘనతలు! ఇప్పటికీ యువ బ్యాటర్లతో పోటీపడుతూ పరుగులు! ఈ ఉపోద్ఘాతం మిథాలి రాజ్‌ గురించే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. తాజాగా ఇంగ్లాండ్‌తో మూడో వన్డే సందర్భంగా అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఈ హైదరాబాదీ అమ్మాయి మరో ఘనత సొంతం చేసుకుంది. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సాగిన 22 ఏళ్ల ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఎప్పుడో 1999లో ఐర్లాండ్‌పై 16 ఏళ్ల వయసులో వన్డే అరంగేట్రం చేసిన మిథాలి తొలి మ్యాచ్‌లోనే అజేయంగా 114 పరుగులు చేసి తన రాకను ఘనంగా చాటుకుంది. ఆ తర్వాత ఆమె వేగంగా ఒక్కో మెట్టూ ఎదుగుతూ వెళ్లింది. మహిళల క్రికెట్లో ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లు తక్కువే అయినా.. ఎప్పుడు అవకాశం దొరికినా ఈ కుడి చేతివాటం బ్యాట్స్‌మన్‌ సత్తా చాటింది. సాంకేతికంగా బలంగా ఉండడం, సహనంతో ఆడడం మిథాలీని పరుగుల యంత్రంగా మార్చింది. 2002లో ఆడిన మూడో టెస్టులోనే (ఇంగ్లాండ్‌పై) 214 పరుగుల చేసి కరెన్‌ రోల్టాన్‌ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలుకొట్టింది. టెస్టులు (11) తక్కువే ఆడినా.. వన్డేల్లో (217) మిథాలీ ఎప్పుడూ నమ్ముకోదగ్గ బ్యాటర్‌గా మారింది. భారత విజయాల్లో ఆమెదే కీలకపాత్ర. బ్యాటర్‌గానే కాదు కెప్టెన్‌గానూ మిథాలీ జట్టును ముందుండి నడిపిస్తోంది. 2017 వన్డే ప్రపంచకప్‌లో జట్టు ఫైనల్‌ చేరడంలో ఆమెది ప్రముఖ పాత్ర. సారథిగానే కాక బ్యాటర్‌గా వరుసగా మూడు అర్ధసెంచరీలు చేసింది. 206 పరుగులు సాధించి టోర్నీలో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె లక్ష్యం ఒక్కటే.. 2022 వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటి జట్టుకు కప్‌ అందించడం.

సవాళ్లను దాటి..: 22 ఏళ్ల కెరీర్‌..! పురుషుల క్రికెట్లో కూడా ఇది అంత తేలిక కాదు. అలాంటిది మహిళల క్రికెట్లో ఇంత కాలం కెరీర్‌ కొనసాగించడం అంటే పెద్ద ఘనతే! ఈ 22 ఏళ్లలో ఎన్నో అడ్డంకులను అధిగమించి మిథాలి ఇక్కడిదాకా వచ్చింది. ఆమె కెరీర్‌ ఆరంభించే మ్యాచ్‌ ఫీజులు అంతంతమాత్రం, ప్రయాణ ఖర్చులు సొంతంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆర్థికంగా ఏమాత్రం లాభదాయకం కాకున్నా, మహిళల క్రికెట్‌కు ప్రోత్సాహం అంతంతమాత్రమే అయినా అవేవీ ఆమెకు అడ్డంకులు కాలేకపోయాయి. కెరీర్‌ ఆరంభం నుంచి అదే అంకిత భావంతో తన ఆట తాను ఆడుతూ ముందుకు సాగింది. చిన్న వయసులోనే జట్టుకు కెప్టెన్‌ కూడా అయింది. మహిళల క్రికెట్‌ బీసీసీఐ పరిధిలోకి వచ్చేవరకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఆమె కెరీర్‌ను కొనసాగించింది. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌ తర్వాత, రెండేళ్ల కిందట టీ20 ప్రపంచకప్‌ సమయంలో ఆమె సామర్థ్యంపై, అంకితభావంపై జట్టు యాజమాన్యం నుంచే ప్రశ్నలు తలెత్తినా ఆమె కుంగిపోలేదు. ఆటతోనే అన్నింటికీ సమాధానం చెప్పింది. ప్రస్తుత ఇంగ్లాండ్‌ సిరీస్‌నే తీసుకుంటే.. మిగతా ప్రధాన బ్యాటర్లు విఫలం కాగా, మిథాలి మూడు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించింది. చివరి మ్యాచ్‌లో కడదాకా నిలిచి జట్టును గెలిపించిన వైనం అద్భుతం.