ScienceAndTech

ఎక్కిళ్లు ఆపే స్ట్రా కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు

ఎక్కిళ్లు ఆపే స్ట్రా కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు

ఎక్కిళ్లు ఎవరికైనా కొద్దిసేపు వచ్చి ఆగిపోతాయి. కానీ కొంతమందికి తరచూ వస్తూ ఇబ్బంది పెడతాయి. ఓ పట్టాన ఆగవు. అలాంటివాళ్ల కోసమే శాన్‌ ఆంటానియోలోని టెక్సాస్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఫోర్స్‌డ్‌ ఇన్‌స్పిరేటరీ సక్షన్‌ అండ్‌ స్వాలో టూల్‌(ఫిస్ట్‌)అన్న పేరుతో ఎల్‌ ఆకారంలోని స్ట్రాను రూపొందించారు. దీన్ని ఎక్కిళ్లు వస్తున్నవాళ్లలో పరీక్షించి చూడగా- 92 శాతం మందికి వెంటనే తగ్గాయట. ఇది ఎలా పనిచేస్తుందీ అంటే- చిన్న ట్యూబ్‌లా ఉన్న దీనికి అడుగున చిన్నదీ పెద్దదీ రెండు రంధ్రాలు ఉంటాయి. దానికి అమర్చిన లిడ్‌ని జరపడం ద్వారా పిల్లలకోసం చిన్నదీ పెద్దవాళ్లకోసం పెద్ద రంధ్రాన్ని తెరుచుకునేలా చేయాలి. తరవాత స్ట్రాను గ్లాసులో ఉంచి పై భాగాన్ని నోట్లో పెట్టుకుని బలంగా పీల్చగానే నీళ్లు ఒక్కసారిగా లోపలకు వెళతాయి. ఆ వేగానికి ఎక్కిళ్లకు కారణమైన ఫ్రెనిక్‌, వేగస్‌ నాడులు స్పందించడంతో అవి ఆగిపోతాయి. ఎందుకంటే ఈ రెండు నాడులు బిగుసుకోవడం వల్లే ఊపిరితిత్తుల అడుగున ఉన్న డయాఫ్రమ్‌ కండరం సంకోచం చెంది, స్వరపేటిక పైన మూతలా ఉండే ఎపిగ్లాటిస్‌ను మూసుకునేలా చేస్తుంది. దాంతో లోపలినుంచి వచ్చే గాలి స్వరపేటికకి తగిలి హిక్‌ అనే శబ్దంతో ఎక్కిళ్లు వస్తుంటాయి. ఈ స్ట్రాతో నీళ్లను పీల్చగానే ఆ వేగానికి బిగుసుకున్న నాడులు స్పందించడంతో డయాఫ్రమ్‌ మళ్లీ యథాస్థితికి వస్తుంది. దాంతో ఎపిగ్లాటిస్‌ తెరుచుకుని గాలి మార్గం సుగమం
కావడంతో ఎక్కిళ్లు ఆగిపోతాయి.