Politics

మోడీ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 7న (బుధ‌వారం) మ‌ధ్యాహ్నం 11 గంట‌ల‌కు మోదీ 2.0 ప్రభుత్వం తొలిసారి కేబినెట్ విస్తర‌ణ చేపట్టనుందని ఢిల్లీ వర్గాల సమాచారం. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో గరిష్టంగా 81 మంది మంత్రులను స్థానం ఉండగా, ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో 28 మందికి మంత్రులుగా అవకాశం లభించనుంది. కేబినెట్ విస్తర‌ణ‌పై గత రెండు రోజులుగా ప్రధానితో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగ‌త ప్రధాన కార్యద‌ర్శి బీఎల్ సంతోష్‌ల‌తో చ‌ర్చలు జ‌రుపుతున్నారు. కేబినెట్ విస్తర‌ణ‌లో ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు బీహార్‌, మ‌హారాష్ట్ర, మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రాల‌కు ప్రాతినిధ్యం ల‌భిస్తుంద‌ని తెలుస్తుంది. ఇందులో ముగ్గురు మాజీ సీఎంలు, ఓ మాజీ డిప్యూటీ సీఎంకు చోటు లభిస్తుందని సమాచారం. ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీర‌త్ సింగ్ రావ‌త్, అసోం మాజీ ముఖ్యమంత్రి శ‌ర్బానంద సోనోవాల్‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం నారాయ‌ణ్ రాణేలకు బెర్త్ లభించనుంది.