Business

మిషెలిన్ టైర్లలో కీలక బాధ్యతలు చేపట్టిన భారతీయ వ్యక్తి-వాణిజ్యం

మిషెలిన్ టైర్లలో కీలక బాధ్యతలు చేపట్టిన భారతీయ వ్యక్తి-వాణిజ్యం

* భారత్‌లో ల్యాండ్‌రోవర్‌ ఇండియా సరికొత్త రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ కారును ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ మోడల్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.64.12లక్షలుగా కంపెనీ పేర్కొంది. పెట్రోల్‌ వెర్షన్‌ ఆర్‌ డైనమిక్‌ ఎస్‌ఈ ట్రిమ్‌లో కూడా ఈ కారు లభిస్తుంది. డీజిల్‌ వెర్షన్‌ కేవలం ఎస్‌ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో 2.0 లీటర్‌ ఇన్‌జీనియమ్‌ శ్రేణి పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లను అమర్చారు. ఈ కారు విడుదల సందర్భంగా కంపెనీ ఎండీ రోహిత్‌ సూరి మాట్లాడుతూ..‘‘ఎవోక్‌ మోడల్‌ ప్రత్యేకమైన‌,ఆధునిక డిజైన్‌తో చూపులు తిప్పుకోనివ్వదు. కొత్త ఇంటిరీయర్‌ కలర్‌ వే, ఆధునిక ల్యాండ్‌ రోవర్‌ సాంకేతికతలు, ఇన్‌జీనియమ్‌ పవర్‌ ట్రైన్‌ మరింత శక్తిని సమకూరుస్తాయి’’ అని పేర్కొన్నారు.

* ప్రముఖ టైర్ల తయారీ సంస్థ మిషిలిన్‌లో భారత మూలాలు ఉన్న గగన్‌జోత్‌ సింగ్‌ కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన కంపెనీ ఆఫ్రికా, భారత్‌, మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతాల వ్యాపారాలకు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహించిన మార్క్‌ పస్క్యూట్‌ను కంపెనీ మరో చోట నియమించింది. దాదాపు పదేళ్ల నుంచి మిషిలిన్‌లో పనిచేస్తున్న గగన్‌జోత్‌ వివిధ విభాగాలకు నాయకత్వం వహించారు. ఆసియా, ఐరోపా, యూరప్‌ల్లో వివిధ వాణిజ్య కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించారు. ఆయనకు గ్లోబల్‌ బిజినెస్ మోడల్‌ అధిపతిగా పనిచేసిన అనుభవం ఉంది.

* దేశంలోని ఆటోమొబైల్‌ పరిశ్రమలోని ‘ఒరిజనల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానిఫ్యాక్చర్స్‌’(ఓఈఎం) ఎప్పటికప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో నిరంతరం నాణ్యతను పెంచుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఆయన పుణెలోని ఎంఐటీ-ఏడీటీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో పాల్గొని ప్రసంగించారు. భారత్‌లో ఓఈఎంలకు చాలా మార్కెట్‌ షేరు ఉన్నా.. వారి పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాద పరీక్షా ప్రమాణాలకు ఎక్కడా తగ్గకుండా వాహనాల తయారీ వారి సామాజిక బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ఈక్రమంలో వాహనాల ధరలు పెరిగినా ఫర్వాలేదన్నారు. బస్సుల బాడీ నాణ్యత మరింత మెరుగుపడాల్సి ఉందని సూచించారు.

* బంగారం ధర క్రమంగా పుంజుకొంటోంది. దేశ రాజధాని నగరం దిల్లీలో సోమవారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.69లు మాత్రమే పెరగ్గా.. మంగళవారం రూ.389లు పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.46,762కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ.46,373గా ఉంది. వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.397లు పెరగడంతో మొత్తం ధర రూ.69,105కి చేరింది.