NRI-NRT

సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో ఘనంగా బాలమురళీ జయంతి

సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో ఘనంగా బాలమురళీ జయంతి

అమెరికాలోని కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ “సంపద” ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత సామ్రాట్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జులై 4వ తేదీన అంతర్జాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్దప్రతిష్టులైన కళాకారులు పాల్గొని బాలమురళికృష్ణతో తమకున్న అనుభవాన్ని మరియు అనుబంధాన్ని వీక్షకులతో పంచుకున్నారు.

ప్రఖ్యాత వాయులీనం విద్వాంసులు అన్నవరపు రామస్వామి, ప్రముఖ నాట్యాచార్యులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం, ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సుధ రఘునాథన్, ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి, కేరళ రాష్ట్రం నుంచి మంగళంపల్లి వారి శిష్యులు ప్రిన్స్ రామవర్మ, హైదరాబాద్ నుంచి DV మోహన కృష్ణ, ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బి ఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్, సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం, మోదుమూడి సుధాకర్, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్, GV ప్రభాకర్, మంగళంపల్లి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాల రావు తదితరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ సీనియర్ శిష్యురాలు శ్వేత ప్రచండె, బాలమురళి థిల్లానాలకు తన అద్భుతమైన నాట్య ప్రదర్శనతో వీక్షకులను అలరించింది. బాలమురళి ప్రశిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళి కీర్తనలు పాడి స్వర నివాళి అర్పించారు. సంపద ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి బాలమురళీకృష్ణ జీవన విశేషాలపై ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు అలరించాయి. ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన సంపద అధ్యక్షులు దీనబాబుకి మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాద్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, మమత కూచిభొట్ల బాలమురళి అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు.