Agriculture

ఎకరాకు పాతికవేల మొక్కలు. ఒకేసారి పత్తి తెంపుడు.

ఎకరాకు పాతికవేల మొక్కలు. ఒకేసారి పత్తి తెంపుడు.

పత్తి సాగు విధానంలో విప్లవాత్మక మార్పు రాబోతున్నది. వరంగల్‌ ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో గతేడాది ప్రయోగాత్మకంగా చేపట్టిన నూతన సాగు విధానం విజయవంతమైంది. దీంతో శాస్త్రవేత్తలు రెండోదశ ప్రయోగాలపై దృష్టి సారించారు. ఈ పద్ధతిలో ఖర్చులు తగ్గడమే కాకుండా దిగుబడి మూడు రెట్లు పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. నూతన విధానంలో ప్రధానంగా రెండు ప్రయోజనాలున్నాయి. వీటిలో ఒకటి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచగలగడం (హైడెన్సిటీ). రెండోది ఒకే కాతతో పంట మొత్తం ఒకేసారి చేతికి రావడం (సింగిల్‌ పికింగ్‌ క్రాప్‌). పత్తిని కోసిన తర్వాత శనగ, నువ్వులు వంటి రెండో పంటను పండించే అవకాశం లభించడం మరో సానుకూలాంశం. ఈ రెండింటితో పాటు యంత్రాల సహాయంతో పత్తిని ఒకేవిడుతలో ఏరేందుకు అవకాశం ఉంటుంది. ఇందు కు యంత్రాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ శాస్త్రవేత్తలను నిర్దేశించారు. ఆ మేరకు యంత్రం రూపొందించే పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. గతేడాది పరిశోధనా కేంద్రంలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన శాస్త్రవేత్తలు ఈ ఏడాది కొం దరు రైతుల భాగస్వామ్యంతో రెండో దశ ప్రయోగానికి సమాయత్తమయ్యారు. వరంగల్‌, మెదక్‌, నల్లగొండ జిల్లాల్లో 50 మందికి పైగా రైతులకు విత్తనాలు అందజేశారు. ఇది విజయవంతమైతే.. ఈ కొత్త రకం సాగు విధానాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తారు. ఇందులో పాత రకం విత్తనాలే వాడటం మరో విశేషం. ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న సాధారణ సాగు పద్ధతిలో ఎకరాకు 7-8 వేల పత్తి మొక్క లే పెరుగుతాయి. కానీ వరంగల్‌ పరిశోధనా కేంద్రంలో చేపట్టిన కొత్త పద్ధతిలో 25 వేల మొక్కలు పెరగడం విశేషం. ఈ విధానంలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, సాళ్ల మధ్య 80 సెంటీమీటర్ల దూరం ఉంటే సరిపోతుంది. సాధారణ సాగు పద్ధతిలో మొక్క మొక్కకు 60 -90 సెంటీమీటర్లు, సాలు సాలుకు మధ్య 100-120 సెంటీమీటర్ల దూరం ఉంటున్నది. కొత్త విధానంలో మొక్కల సంఖ్యకు తగ్గట్టుగా పత్తి దిగుబడి కూడా భారీగా పెరుగుతుంది.