Politics

కేసీఆర్ మహాశక్తి. రేవంత్ కొత్త బిచ్చగాడు.

కేసీఆర్ మహాశక్తి. రేవంత్ కొత్త బిచ్చగాడు.

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహాశక్తి. ఆయనలాంటి నాయకుడిని, తెరాస వంటి పార్టీని ఎదుర్కొనే సత్తా ఎవ్వరికీ లేదు. కేసీఆర్‌ను ఢీకొట్టాలనుకునే వారికి రాజకీయంగా నూకలు చెల్లినట్లే. ఇతర రాష్ట్రాలకూ సీఎంలు ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నది రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి. 21 ఏళ్ల పాటు తెలంగాణ కోసం శ్రమించారు. వైఎస్సార్‌, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలతో కొట్లాడారని మరచిపోవద్దు’’ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. మార్కెట్‌లోకి కొత్త బిచ్చగాళ్లు వచ్చారని, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలంటే డైలాగ్‌లు కొడితే సరిపోదని వ్యాఖ్యానించారు. ఆయన నాలుగు రోజులు బయట తిరిగితే అందరి నోళ్లూ మూతపడ్డాయన్నారు. చిల్లర మల్లర మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. సింగరేణిలో భాజపా అనుబంధ సంఘం బీఎంఎస్‌ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఆయనను, ఇతర నేతలను మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

రేవంత్‌కు చిన్న పదవి రాగానే పీఎం పదవి వచ్చినట్లు పోజు కొడుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఏడుసార్లు గెలిచి, 17 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డిని నాగార్జునసాగర్‌లో ఒక పిల్లాడు ఓడించిన విషయాన్ని గమనించాలన్నారు. ‘‘ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించి నోట్ల కట్టలతో దొరికిన రేవంత్‌ ఇప్పుడు నీతులు చెబుతున్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలంటున్నారు. ఆయన పార్టీ మారినా నాడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఆయన్ని ఏ రాయితో కొట్టాలో చెప్పాలి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 12 మంది రాజ్యాంగ ప్రకారం తెరాస ఎల్పీలో విలీనమయ్యారు. రాజస్థాన్‌లో అశోక్‌ గహ్లోత్‌ కూడా అదే చేశారు. ఆయన్ను కూడా రాయితో కొట్టాలా? తెదేపాలో ఉండి సోనియాగాంధీని బలిదేవత అన్న రేవంత్‌ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నారు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

దుబ్బాకలో గెలిచి జీహెచ్‌ఎంసీలో 4 సీట్లు పెరగగానే భాజపా నేతలు ఎగిరెగిరి పడ్డారని… అనంతరం నాగార్జునసాగర్‌లో బొక్కబోర్లా పడ్డారని, డిపాజిట్‌ కూడా రాలేదని కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా సిట్టింగ్‌ సీటు కూడా పోయిందని ఎద్దేవా చేశారు. ‘‘తెలంగాణలో పాదయాత్రల సీజన్‌ మొదలవుతోంది. కొందరు నేతలు పోటాపోటీగా చేస్తామంటున్నారు. వారికి శుభాకాంక్షలు. ఆరోగ్యానికి మంచిదే. బండి సంజయ్‌ తిరగాలి. నేర్చుకోవాలి. కనీసం పాద యాత్ర చేస్తేనైనా పల్లెలు తెరాస ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిన విషయం తెలుస్తుంది. హుజూరాబాద్‌లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోందని సంజయ్‌ బాధపడుతున్నారు. కేంద్రం కూడా వెయ్యి కోట్ల ప్యాకేజి ఇస్తామంటే మేము వద్దంటున్నామా’’ అని ప్రశ్నించారు.

‘‘సింగరేణి కార్మికులకు తెరాస ఇచ్చిన ప్రతిఒక్క హామీని నెరవేర్చిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. న్యాయపరమైన చిక్కులను సావధానంగా పరిష్కరించుకుందాం. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపును కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి పంపితే ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ఎలుగెత్తుతాం. సింగరేణి కార్మికులు తెరాసతో కలిసి క్రియాశీలకంగా పని చేయాలి. కెంగర్ల మల్లయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌, విప్‌లు బాల్కసుమన్‌, గువ్వల బాలరాజు, ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, సాట్స్‌ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, బొగ్గుగని కార్మిక సంఘం నేతలు వెంకటరాజు, రాజిరెడ్డి, సింగరేణి కార్మికులు, నేతలు పాల్గొన్నారు.