WorldWonders

ముక్కులోకి చోప్‌స్టిక్స్

ముక్కులోకి చోప్‌స్టిక్స్

సాధార‌ణంగా ముక్కులో చిన్న కురుపైనా ఎంతో అసౌక‌ర్యంగా ఉంటుంది. అది పూర్తిగా త‌గ్గిపోయే వ‌ర‌కు ఒక ర‌క‌మైన యాత‌న‌ను అనుభ‌వించాల్సి వ‌స్తుంది. కానీ తైవాన్‌లో ఓ 29 ఏండ్ల మ‌హిళ ముక్కులో ఏకంగా రెండు చాప్‌స్టిక్స్ (ఆహారాన్ని గుచ్చి తిన‌డానికి ఉప‌యోగించే చెక్క పుల్ల‌లు) గుచ్చుకున్నా ఆమె వారం రోజుల దాకా గుర్తించ‌లేక‌పోయింది. వివ‌రాల్లోకి వెళ్తే.. తైవాన్‌లో స‌ద‌రు మ‌హిళ‌కు, ఆమె సోద‌రికి రాత్రి డిన్న‌ర్ చేసే స‌మ‌యంలో గొడ‌వ‌ జ‌రిగింది. ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరుగ‌డంతో చివ‌రికి కొట్టుకునే దాకా వెళ్లింది. తినే ప్లేట్లు, గిన్నెల‌తోనే ఒక‌రినొక‌రు కొట్టుకున్నారు. దాంతో బాధిత మ‌హిళ ముక్కుపై వంట‌పాత్ర‌ల ముక్కలు గుచ్చుకుని స్వ‌ల్పంగా ర‌క్త‌స్రావం అయ్యింది. దాంతో ఆమె ఆస్ప‌త్రికి వెళ్ల‌గా.. వైద్యులు ఎక్స్‌రేలు తీసి చిన్నచిన్న ఇనుప ముక్క‌లు, చెక్క ముక్క‌లు తొల‌గించి పంపించారు. వారం రోజుల త‌ర్వాత ముక్కుపై గాయాలు పూర్తిగా మానిపోయాయి. ఆ త‌ర్వాత బాధితురాలు గొడ‌వ జ‌రిగిన రోజు విరిగిపోయిన వ‌స్తువుల‌ను ప‌రిశీలించగా చాప్‌స్టిక్స్‌లో కొన్ని భాగాలు విరిగిపోయి ఉన్నాయి. అవి ఏమై ఉంటాయ‌నే అనుమానంతో అద్దంలో ముఖం చూసుకోగా త‌న ముక్కులో గ్రే రంగులో ఏదో వ‌స్తువు ఉన్న‌ట్లు క‌నిపించింది. దాంతో ఆమె వెంట‌నే ఆస్ప‌త్రికి వెళ్ల‌గా వైద్యులు స్కానింగ్ చేసి మ‌హిళ సైన‌స్‌లో రెండు చాప్‌స్టిక్ పీసులు ఉన్న‌ట్లు గుర్తించారు. శ‌స్త్రచికిత్స చేసి 1.4 ఇంచులు, 2 ఇంచులు పొడ‌వు ఉన్న రెండు చాప్‌స్టిక్ ముక్క‌ల‌ను తొల‌గించారు.