Business

శాంసంగ్ కార్యాలయాల్లో తనిఖీలు-వాణిజ్యం

శాంసంగ్ కార్యాలయాల్లో తనిఖీలు-వాణిజ్యం

* తెలంగాణలో టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కేరళకు చెందిన కైటెక్స్ గ్రూపు ముందుకొచ్చింది. దాదాపు రూ. 3,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలపై కైటెక్స్ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాయిబాబు, ప్రతినిథుల బృందం మంత్రి కేటీఆర్‌తో సమావేశమై చర్చించారు. దుస్తుల తయారీ రంగంలో పేరొందిన కైటెక్స్.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పరిశ్రమలను నిర్వహిస్తోంది. పారిశ్రామిక అనుకూల విధానాలు, టెక్స్ టైల్ రంగంలో అపార అవకాశాలు ఉన్నందునే తెలంగాణను ఎంచుకున్నట్లు ఎండీ తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు 30 వేల ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నట్లు అంచనా.

* ఈనెల 6న హైదరాబాద్‌లోని రాంకీ సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా అక్రమ లావాదేవీలు గుర్తించినట్టు ఆదాయపన్నుశాఖ ప్రకటన విడుదల చేసింది. స్థిరాస్తి, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ రంగంలో ఉన్న ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించగా… అక్రమ లావాదేవీలకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 2018-19లో ఈ సంస్థ సింగపూర్‌లోని ఓ ప్రవాస సంస్థకు మెజార్టీ వాటాను విక్రయించి భారీగా మూలధనం ఆర్జించినట్టు ఐటీశాఖ పేర్కొంది. అమ్మకాలకు సంబంధించిన పత్రాలు, లాభాలను దాచిపెట్టి నష్టాలుగా చూపారని వివరించారు. దాదాపు రూ.1200 కోట్లు కృత్రిమ నష్టాలు చూపి పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించామని ఐటీశాఖ పేర్కొంది. వాటికి సంబంధించి లెక్కల్లోకి రాని లావాదేవీలను గుర్తించామని ఆదాయపన్నుశాఖ తెలిపింది. లెక్కల్లోకి రాని రూ.300 కోట్లతో పాటు, ఎగవేతకు పాల్పడిన పన్నును చెల్లించేందుకు ప్రముఖ సంస్థ అంగీకరించినట్టు ఐటీశాఖ వెల్లడించింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.

* భూముల మార్కెట్ ధరల పెంపుపైప్రభుత్వం తీపికబురు..కోవిడ్ కారణంగా ఈ ఏడాది మార్కెట్ విలువ పెంచడం లేదని స్పష్టం చేసిన AP ప్రభుత్వం..ప్రతియేటా ఆగస్టు ఒకటి నుంచి భూ ముల విలువలు పెంచుతున్న ప్రభుత్వం..వివిధ వర్గాలు,సాధారణ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల తో ఈసారి ధరల మార్పు చేయడం లేదని పేర్కొన్న సర్కార్.

* ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,500 డాలర్ల(రూ.1.12 లక్షలు) సింగిల్‌ టైం బోనస్‌ ప్రకటించింది. మహమ్మారి మూలంగా కష్టంగా గడిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కార్పొరేట్‌ వైస్ ప్రెసిడెంట్‌ కంటే కింది స్థాయి ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తిస్తుందని పేర్కొంది. మార్చి 31, 2021కి ముందు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బహుమానం ఇవ్వనున్నట్లు తెలిపింది.

* నెట్‌వర్క్ పరికరాల దిగుమతి సమయంలో డ్యూటీలు ఎగ్గొట్టిందన్న అనుమానంతో శాంసంగ్‌ కార్యాలయాల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ తనిఖీలు చేసింది. బుధవారం దిల్లీ, ముంబయిల్లోని సంస్థ కార్యాలయాల్లో ఈ తనిఖీలు మొదలయ్యాయి. వీటిల్లో వెలుగు చూసిన అంశాలపై డీఆర్‌ఐ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. నెట్‌వర్క్‌ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ముంబయి కార్యాలయంలో తొలుత అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత గురుగ్రామ్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో కూడా వీటిని నిర్వహించారు.