Politics

కత్తి మహేష్ కన్నుమూత-తాజావార్తలు

కత్తి మహేష్ కన్నుమూత-తాజావార్తలు

* రోదసిలో ప్రయాణించిన తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థ అధిపతిగా బ్రిటన్‌ కుబేరుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ చరిత్ర సృష్టించనున్నారు! ఆదివారం నాడు ఆయన న్యూ మెక్సికోలోని ప్రైవేటు స్పేస్‌పోర్టు నుంచి తన ‘వర్జిన్‌ గలాక్టిక్‌ వీఎస్‌ఎస్‌ యూనిటీ’ అంతరిక్ష నౌక ద్వారా నింగిలో విహరిస్తారు. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వర్జిన్‌ గ్రూప్‌ విమానం ‘వీఎంఎస్‌ ఈవ్‌’… తన 140 అడుగుల రెక్కల తోడుతో యూనిటీని నింగిలోకి తీసుకెళ్తుంది. 9 మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత అది ఈవ్‌ నుంచి విడిపోయి, అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. భూమి నుంచి 50 మైళ్ల దూరం వెళ్లాక అంతరిక్షంలో ప్రవేశించినట్టు భావిస్తారు. అయితే ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ యూనిటీ 55 మైళ్లు దాటి ప్రయాణిస్తుందని, అనంతరం మళ్లీ నేరుగా స్పేస్‌పోర్టుకు చేరుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సుమారు 90 నిమిషాలపాటు ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నాయి. యూనిటీలో రిచర్డ్‌తో పాటు ఇద్దరు పైలట్లు, వర్జిన్‌ గలాక్టిక్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఈ నౌక ద్వారా వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు వ్యక్తులను అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లాలని వర్జిన్‌ గలాక్టిక్‌ భావిస్తోంది.

* తెలంగాణ రాష్ట్రంలో 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బిశ్వాల్‌ కమిటీ చెప్పిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. సుమారు 2 లక్షల పోస్టులుంటే 50 వేలే భర్తీ చేస్తారా?అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కార్పొరేషన్లలోని ఖాళీల భర్తీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘కరోనా వేళ స్టాఫ్‌ నర్సులను దేవుళ్లని పొగిడారు. ప్రస్తుతం నర్సులు ప్రగతిభవన్‌ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉన్నఫళంగా 1,640 కుటుంబాలను కేసీఆర్‌ రోడ్డున పడేశారు. 2018లో ఎంపికైన ఏఎన్‌ఎంలకు ఇప్పటికీ పోస్టులు లేవు. స్టాఫ్‌ నర్సులను విధుల్లో కొనసాగించాలి. 2018 ఏఎన్‌ఎం అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలివ్వాలి. డిమాండ్లు నెరవేర్చకపోతే నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. తమను ఆదుకోవాలని రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించిన నర్సులకు వారి తరఫున పోరాటం చేస్తామని ఆయన భరోసా కల్పించారు.

* పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో జులై 14 (బుధవారం) ముఖ్యమంత్రి జగన్ పర్యటనను పురస్కరించుకుని ముందస్తు ఏర్పాట్లను సమీక్షించడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్​ కార్తికేయ మిశ్రా తెలిపారు.

* నటుడు. ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కన్ను మూశారు.. రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కత్తి మహేష్ మృతి చెందారు.నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్. జూన్ 26 న తెల్లవారుఝూమున ఆయన ప్రయాణిస్తున్న వాహనం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో మహేశ్‌ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.కత్తి మహేష్ కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 17లక్షల రూపాయలు అందచేసింది.

* తెలుగు అకాడమి పేరులో మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి చోటు కల్పించారు. అతడిని ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

* హైదరాబాద్‌-విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది. సుమారు 158 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గాన్ని పూర్తిచేస్తే తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరుగుతుంది. ఈ రహదారిని హరిత మార్గంగా నిర్మించాలని కేంద్రం ఇంతకు ముందే నిర్ణయించటం తెలిసిందే. తెలంగాణ నుంచి కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టులకు సరకు రవాణాకూ ఈ మార్గం ఉపకరిస్తుంది. హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు ఇప్పటికే జాతీయ రహదారి అందుబాటులో ఉంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు ఫోర్‌ లేన్‌ విస్తరణ పనులు సాగుతున్నాయి. ఖమ్మం నుంచి దేవరాపల్లి వరకు రహదారిని 4 వరుసలుగా విస్తరించాల్సి ఉంది. అక్కడి నుంచి విశాఖ వరకు ఇప్పటికే 4 వరుసల మార్గం ఉంది. హైదరాబాద్‌ నుంచి దేవరాపల్లి మీదుగా విశాఖకు 625 కి.మీ. మార్గం 4 వరుసలుగా విస్తరించనున్నారు.

* కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లలో చేయని పనులు ఏడేళ్లలో తెరాస చేసి చూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్యాంకర్‌ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీని చేపడతామని.. 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తామని చెప్పారు. స్థలం ఉన్నవారు ఇళ్లు కట్టుకునేందుకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణను అవమానించారని.. తెలంగాణ గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి బయటకు పంపారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్‌ వారసులమని చెప్పుకుంటూ కొంత మంది రాష్ట్రానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి అవకాశవాదులకు తెలంగాణలో స్థానం లేదని తేల్చి చెప్పారు.

* తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,00,632 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 704 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,31,218కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,725కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 917 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,16,769కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

* ప్రధాని మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులే జరిగాయి. కొత్తగా 36 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య 78కి పెరిగింది. కాగా.. నూతన మంత్రిమండలిలో 42శాతం అంటే 33 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులున్నాయట. వీరిలో 24 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ లాంటి తీవ్రమైన నేర అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) తన నివేదికలో వెల్లడించింది.