Movies

25ఏళ్ల భర్తకు 60ఏళ్ల భార్యగా శ్రీలక్ష్మీ

25ఏళ్ల భర్తకు 60ఏళ్ల భార్యగా శ్రీలక్ష్మీ

అరవై ఏళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడికి పెళ్లి అయితే ఎలా ఉంటుంది..? అసలు అలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది..? మరి వాళ్లిద్దరూ జీవితాంతం కలిసి ఉన్నారా..? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘సావిత్రి w/o సత్యమూర్తి’. ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి, ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం భార్యభర్తలుగా నటించారు. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మించారు. ఈ చిత్రంలో శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. ‘‘కుటుంబసమేతంగా చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రం. పార్వతీశం, శ్రీలక్ష్మి జంట నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాతో ముగ్గురు కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నాం. త్వరలో వాళ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. హైదరాబాద్, అరకు, ఈస్ట్ గోదావరి, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 45 రోజులు చిత్రీకరణ చేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని నిర్మాత చెప్పారు.